Tollywood: నైజాం ఏరియా పంపిణీలో మారుతున్న సమీకరణాలు

ABN , Publish Date - Jul 03 , 2025 | 12:54 PM

'వార్ 2' సినిమా హక్కుల్ని సొంతం చేసుకున్న సితార ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ నైజాంలో ఆ సినిమాను మైత్రీ సంస్థ చేతిలో పెట్టినట్టు తెలుస్తోంది. ఇంతకాలం సితార సినిమాలను దిల్ రాజు నైజాంలో పంపిణీ చేసేవారు.

రాజకీయాల్లోనే కాదు సినిమా రంగంలోనూ శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరంటారు. కొన్ని సంఘటనలు చూసిప్పుడు అది నిజమే అనిపిస్తుంది. కొన్ని విజయాలు కొందరికి కలిపితే, కొన్ని పరాజయాలు మరి కొందరిని దూరం చేస్తాయి. అయితే ఈ జయాపజయాలే కాదు... మనుషులు వ్యవహార తీరు సైతం బంధాలపై ప్రభావం చూపుతుంటుంది. కొంతకాలంగా దిల్ రాజు (Dil Raju) తో అత్యంత సన్నిహితంగా ఉన్న యువ నిర్మాత, సితార ఎంటర్ టైన్ మెంట్స్ అధినేత సూర్యదేవర నాగవంశీ (Suryadevara Naga Vamshi) ఇప్పుడు దూరం జరుగుతున్నట్టుగా అనిపిస్తోందని సినిమా వర్గాల్లో చర్చ మొదలైంది.


నిర్మాతగానే కాకుండా పంపిణీ దారుడిగానూ ఎస్వీసీ అధినేతి దిల్ రాజుకు మంచి పేరుంది. ఆయన సొంత సినిమాలతో పాటు బయటి నిర్మాతల సినిమాలను సైతం పంపిణీ చేస్తుంటారు. నైజాంతో పాటు ఉత్తరాంధ్రలోనూ దిల్ రాజు చేతిలో పలు థియేటర్లు ఉండటంతో ఈ రెండు ప్రాంతాల్లో పంపిణీకి ఆయన ప్రాధాన్యం ఇస్తుంటాడు. దాంతో సహజంగానే దిల్ రాజుతో తోటి నిర్మాతలు సన్నిహితంగా ఉంటారు. అలానే తమ చిత్రాలను పంపిణీ చేసి పెట్టమని దిల్ రాజును కోరుతుంటారు. ఆ రకంగా నిర్మాతగానే కాదు పంపిణీ దారుడు, ఎగ్జిబిటర్ గా దిల్ రాజు తనదైన ముద్రను వేశారు.

ప్రస్తుతం తెలుగు సినిమా రంగంలో సితార ఎంటర్ టైన్ మెంట్స్, మైత్రీ మూవీ మేకర్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, యూవీ క్రియేషన్స్ వంటి సంస్థలు యేడాదికి మూడు అంతకంటే ఎక్కువ సినిమాలను నిర్మిస్తున్నాయి. అలానే దిల్ రాజు ఎప్పటి నుండో యేడాదికి మూడు, నాలుగు సినిమాల పైనే ప్రొడ్యస్ చేస్తున్నారు. ఇక నైజాం డిస్ట్రిబ్యూషన్ రంగంలో ఏషియన్ ఫిలిమ్స్, సురేశ్ ప్రొడక్షన్స్, గీతా ఆర్ట్స్ తో పాటు మైత్రీ మూవీ మేకర్స్ కు కూడా దిల్ రాజుకు ప్రధాన పోటీదారులుగా ఉన్నాయి.


సూర్యదేవర నాగవంశీ తన సినిమాల పంపిణీని ఇప్పటి వరకూ నైజాంలో పంపిణీ చేసే బాధ్యతలను దిల్ రాజు కే అప్పగిస్తూ వచ్చారు. వీరిద్దరి మధ్య మంచి బాండింగ్ ఉంది. అందుకనే ఈ యేడాది సంక్రాంతికి దిల్ రాజు సొంత సినిమాలు 'గేమ్ ఛేంజర్, సంక్రాంతికి వస్తున్నాం' ఉన్నా కానీ... తాను నిర్మించిన 'డాకు మహారాజ్' మూవీ పంపిణీని నైజాంలో దిల్ రాజుకే ఇచ్చారు నాగవంశీ. హిందీ చిత్రం 'వార్ -2' రెండు తెలుగు రాష్ట్రాల హక్కులను సొంతం చేసుకున్న సితార ఎంటర్ టైన్ మెంట్స్ ఇప్పుడా సినిమా నైజాం పంపిణీ హక్కుల్ని దిల్ రాజుకు ఇవ్వలేదు. సరికదా... దిల్ రాజు వైరి వర్గంగా భావించే మైత్రీ మూవీ మేకర్స్ కు ఇచ్చినట్లు సమాచారం. నాగవంశీ తీసుకున్న ఈ నిర్ణయం చాలామందిని షాక్ కు గురిచేసింది. ఎంతో కాలంగా తమతో ఉన్న దిల్ రాజును కాదని నాగవంశీ మైత్రీ మూవీస్ డిస్ట్రిబ్యూషన్ కు ఎందుకు ఇచ్చారన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారిపోయింది. నాగవంశీ తీసుకున్న ఈ నిర్ణయానికి కారణం ఏమిటనేది తెలియ రాలేదు. ఎందుకంటే 'వార్ -2'తో వస్తున్న 'కూలీ' సినిమా హక్కుల్ని సునీల్ నారంగ్ కు చెందిన ఏసియన్ ఫిలిమ్స్ సంస్థ పొందింది. సో... దాన్ని తట్టుకోవాలంటే మైత్రీ చేతుల్లో 'వార్ -2'ను పెడితేనే బెటర్ అని నాగవంశీ భావించారా, లేక ఇటీవల మెగా ఫ్యామిలీకి దిల్ రాజుకు మధ్య ఏర్పడిన దూరం కూడా దీనికి కారణమా? అనేది తెలియాల్సి ఉంది. ఒకవేళ దిల్ రాజును పూర్తి స్థాయిలో నాగవంశీ దూరం పెడితే మాత్రం... తెలంగాణలో సినిమాల పంపిణీ రంగంలో ఈక్వేషన్స్ భారీగా మారే ఆస్కారం ఉంది. మరి దీనికి ప్రతిగా దిల్ రాజు ఎలాంటి ఎత్తు వేస్తారో చూడాలి.

Also Read: Pawan Kalyan: హరిహరవీరమల్లు ట్రైలర్ వచ్చేసింది

Also Read: UP CM: యోగి బయోపిక్ టీజర్ వచ్చేసింది...

Updated Date - Jul 03 , 2025 | 12:57 PM