ఇంతకంటే నేను కోరుకునేదేమి లేదు
ABN, Publish Date - Jun 19 , 2025 | 05:53 AM
‘దర్శకుడిగా నా 25 ఏళ్ల ప్రయాణాన్ని తరచి చూసుకున్నప్పుడు ఉద్వేగానికి లోనయ్యా. ఒక చిన్న ఇంట్లో తొలి సినిమా తీసిన నేను ఇప్పుడు ‘కుబేర’ లాంటి పెద్ద సినిమా తీయగలిగాను...
‘దర్శకుడిగా నా 25 ఏళ్ల ప్రయాణాన్ని తరచి చూసుకున్నప్పుడు ఉద్వేగానికి లోనయ్యా. ఒక చిన్న ఇంట్లో తొలి సినిమా తీసిన నేను ఇప్పుడు ‘కుబేర’ లాంటి పెద్ద సినిమా తీయగలిగాను. ప్రేక్షకులు నాకు చాలా ప్రేమని ఇచ్చారు. వారు నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవడమే నాకు చాలా ఆనందాన్నిచ్చే విషయం. నా సినిమాలను ఆదరించిన ప్రేక్షకులు దర్శకుడిగా నాకంటూ ఒక స్థాయిని ఇచ్చారు. ఈ జీవితంలో ఇంతకంటే నేను కోరుకునేదేం లేదు’ అని శేఖర్ కమ్ముల అన్నారు. ధనుష్ కథానాయకుడిగా ఆయన తెరకెక్కించిన చిత్రం ‘కుబేర’. ఈ నెల 20న విడుదలవుతోంది. ఈ సందర్భంగా శేఖర్ కమ్ముల మీడియాతో ముచ్చటించారు.
బిలియనీర్ వర్సెస్ బెగ్గర్... అనే లైన్ ఆసక్తికరంగా అనిపించి కథగా మలిచాను. ధనవంతులు, పేదల మధ్య జరిగే కథ ఇది. రెండు ప్రపంచాల మధ్య సంఘర్షణలా ఉంటుంది. కథను సిద్ధం చేసే క్రమంలో అదొక ఎమోషనల్ థ్రిల్లర్‌గా రూపొందింది. జీవితంలో ఇక తనకు ఏమీ వద్దు అనుకునే బిచ్చగాడు, ప్రపంచంలో అన్నీ తన సొంతం కావాలని కోరుకునే బిలియనీర్ మధ్య పోరాటం ఆసక్తికరంగా ఉంటుంది.
నా కెరీర్లో అగ్రనటులతో, భారీ బడ్జెట్‌తో తీసిన చిత్రం ఇదే. నిర్మాతలు సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్రావు సహకారం వల్లే ఇది సాధ్యమైంది. సినిమాకోసం ఏదడిగినా కాదనకుండా సమకూర్చారు. ఈ చిత్రంలో కథానాయకుడి పాత్రను ధనుష్ తప్ప వేరెవ్వరూ చేయలేరు. అంత అద్భుతంగా నటించారు. ఎంత కష్టమైన షాట్ అయినా ఆయన సింగిల్ టేక్‌లో చేస్తారు. ఈ కథలో నాగార్జున బలమైన పాత్ర చేశారు. ఆయన ఆహార్యం, లుక్, భాష, ఎమోషన్స్ బాగా కుదిరాయి. రష్మిక పాత్ర చిత్రణ నవ్యపంథాలో ఉంటుంది. ఆమె పాత్ర ప్రభావం బలంగా ఉంటుంది.
ఈ మధ్యకాలంలో విభిన్న కథాంశాలతో చిత్రాలు వస్తున్నాయి. కానీ ఇలాంటి ఒక గొప్ప కథను నేను చెప్పినందుకు ఆనందంగా ఉంది. ఇది తప్పకుండా చెప్పాల్సిన కథ. సమాజంలో చైతన్యాన్ని తీసుకొస్తుంది. కథా నేపథ్యం వల్లే ఇది పాన్ ఇండియా చిత్రం అయింది తప్ప మేం కావాలని చేసింది కాదు. దేశం మొత్తం రిలేట్ అయ్యే కథ ఇది. తెలుగు, తమిళ భాషల్లో చిత్రీకరణ జరపడం వల్ల కొంచెం ఎక్కువ సమయం పట్టింది.
సున్నితమైన భావోద్వేగాలు, సామాజికపరమైన అంశాలతో సినిమాలు చేస్తాడంటూ నాకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ అయింది. అయితే నాకంటూ ఒక మార్క్ ఉండాలని నేనెప్పుడూ సినిమాలు చేయలేదు. ఏ సినిమా చేసినా కథకు అవసరమైనది మాత్రమే చేశాను.