The Rajasaab: పూరితో డార్లింగ్ ముచ్చట్లు
ABN , Publish Date - Jul 29 , 2025 | 10:17 PM
ప్రముఖ దర్శక నిర్మాత పూరి జగన్నాథ్ చాలా సంవత్సరాల తర్వాత హీరో ప్రభాస్ ను కలిశాడు. 'ది రాజా సాబ్' సెట్ కు వెళ్ళి పూరి, ఛార్మి... ప్రభాస్ తో కొంత సమయాన్ని వెచ్చించారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) తాజా చిత్రం 'ది రాజా సాబ్' (The Raja Saab) షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఈ మధ్య వచ్చిన మూవీ టీజర్ తో ఈ సినిమాపై అందరి అంచనాలు అంబరాన్ని తాకాయి. విఎఫ్ఎక్స్ వర్క్ ఈ మధ్య కాలంలో ఏ సినిమాలోనూ లేనంత గొప్పగా ఉందంటూ ప్రశంసలు దక్కాయి.
విశేషం ఏమంటే... జూలై 29న ప్రముఖ బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ (Sanjay Dutt) బర్త్ డే సందర్భంగా 'ది రాజా సాబ్' టీమ్ జన్మదిన శుభాకాంక్షలు తెలియచేస్తూ ఓ పోస్టర్ ను రిలీజ్ చేసింది. ఇదే రోజు... ఈ సినిమా షూటింగ్ లో పాల్గొన్న ప్రభాస్ ఫోటో అన్ అఫీషియల్ గా బయటకు వచ్చేసింది. ఈ ఫోటోను పూరి జగన్నాథ్ టీమ్ విడుదల చేసింది. 'రాజా సాబ్' షూటింగ్ స్పాట్ కు పూరి జగన్నాథ్ (Puri Jagannadh), ఛార్మి (Charmy Kaur) వెళ్ళి ప్రభాస్ ను కలిశారు. ప్రభాస్... పూరి ఆత్మీయంగా ఆలింగం చేసుకుని కాసేపు మాట్లాడాడు. ఆ స్టిల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
ప్రభాస్ హీరోగా పూరి జగన్నాథ్ 2008లో 'బుజ్జిగాడు' (Bujjigadu), ఆ తర్వాత సంవత్సరమే 'ఏక్ నిరంజన్' చిత్రాలను రూపొందించాడు. ఇవి గొప్ప విజయాలను అందుకోకపోయినా ప్రభాస్ కు ఆ సమయంలో కాస్తంత ఓదార్పును కలిగించాయి. ఎందుకంటే 'బుజ్జిగాడు' కంటే ముందు వచ్చిన 'పౌర్ణమి, మున్నా' సినిమాలు కమర్షియల్ గా ఆడలేదు. అలానే 'ఏక్ నిరంజన్' (Ek Niranjan) కు ముందు వచ్చిన 'బిల్లా' సినిమా సైతం కాస్ట్ ఫెయిల్యూర్ అయ్యింది. అయితే పూరి తనదైన శైలిలో 'బుజ్జిగాడు' తీశాడు. అందులో ప్రభాస్, త్రిష జంట, మోహన్ బాబు ప్రత్యేక పాత్ర జనాలను ఆకట్టుకుంది. అలానే 'ఏక్ నిరంజన్' మూవీతోనే బాలీవుడ్ భామ కంగనా రనౌత్ టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఈ రెండు సినిమాలు మ్యూజికల్ హిట్స్. అప్పటి నుండి ప్రభాస్ కు పూరి అంటే ప్రేమ, గౌరవం కూడాను. ఇక ఛార్మి... ప్రభాస్ చిత్రాలు 'చక్రం, పౌర్ణమి'లో నటించింది. సో... ఓల్డ్ ఫ్రెండ్స్ ముగ్గురూ మళ్ళీ కలుసుకున్నట్టు అయ్యింది. ఇదిలా ఉంటే... మారుతీ దర్శకత్వంలో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అధినేతి టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న పాన్ ఇండియా మూవీ 'ది రాజా సాబ్' డిసెంబర్ 5న విడుదల కాబోతోంది. అలానే పూరి జగన్నాథ్ ప్రస్తుతం విజయ్ సేతుపతి హీరోగా ఓ సినిమాను తెరకెక్కిస్తున్నారు.
Also Read: Wednesday Tv Movies: బుధవారం, జూలై 30.. తెలుగు టీవీ ఛానళ్లలో వచ్చే సినిమాలు
Also Read: Ghaati: మరోసారి వాయిదా దిశగా 'ఘాటీ'