The Raja Saab: మారుతి గ్రోత్ మాములుగా లేదుగా...
ABN , Publish Date - Jun 16 , 2025 | 10:51 AM
దర్శకుడు మారుతి ఎమోషనల్ అయ్యారు. 'ది రాజా సాబ్' టీజర్ విడుదల సందర్భంగా ప్రభాస్ కటౌట్ పక్కనే మచిలీపట్నం సిరి కాంప్లెక్స్ లో మారుతి కటౌట్ పెట్టడం పట్ల ఆయన హర్షం వెలిబుచ్చారు. తన తండ్రిని తలుచుకుంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.
ఓడలు బళ్ళు... బళ్ళు ఓడలు అవుతాయంటారు. మొదటి మాట ఏమో కానీ దర్శకుడు మారుతి (Director Maruthi) విషయంలో బళ్ళు ఓడలయ్యాయి. ఎక్కడైతే దర్శకుడు మారుతి తండ్రి అరటిపళ్ళ వ్యాపారాన్ని చేశాడో, అక్కడే మారుతీ కూడా చిన్న షాపులో స్టిక్కరింగ్ చేసేవాడు. పెయింట్ లోనూ అనుభవం ఉన్న మారుతి స్టార్ హీరోల సినిమాల విడుదల సమయంలో ఫ్యాన్స్ కు బ్యానర్స్ రాసి ఇచ్చేవాడు. థియేటర్ల ముందు ఆ బ్యానర్స్ ను కట్టినప్పుడు వాటిని చూసుకుని ఎప్పుడైనా మన పేరు ఆ బ్యానర్ల మీద ఉంటుందా? అని ఆశ పడేవాడు. కలలు కనండి... వాటిని సాకారం చేసుకోవడానికి కష్టపడండి అని ఓ పెద్దాయన చెప్పినట్టు మారుతి కలలు కన్నాడు. ఇవాళ వాటిని సాకారం చేసుకున్నాడు.
మచిలీపట్నంలో తాను రాసిన బ్యానర్స్ ను అభిమానులు ఏ థియేటర్ ముందు కట్టారో... అదే థియేటర్ లో ఇవాళ మారుతి నిలువెత్తు కటౌట్ ను అభిమానులు పెట్టారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) 'ది రాజా సాబ్' (The Raja Saab) విడుదల కాబోతున్న నేపథ్యంలో సోమవారం మూవీ టీజర్ ఆవిష్కరణ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఎంపిక చేసిన థియేటర్లలో దీన్ని ప్రదర్శిస్తున్నారు. మచిలీపట్నం సిరి కాంప్లెక్స్ (గతంలో కృష్ణకిశోర్ థియేటర్) లో ఈ సందర్భంగా డార్లింగ్ ప్రభాస్ నిలువెత్తు కటౌట్ ను పెట్టారు. ఆ పక్కనే దర్శకుడు మారుతి కటౌట్ నూ ఆయన అభిమానులు ఉంచారు. దీన్ని చూసి మారుతి ఎమోషన్ కు గురయ్యాడు.
Also Read: Janhvi Kapoor: లండన్‌లో.. జాన్వీ పరువాల జాతర! నెట్టింట రచ్చ
ఈ కటౌట్స్ ఫోటోను తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ... ఇవాళ తనతో పాటు లేని తండ్రిని గుర్తు చేసుకున్నాడు. ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే... జీవితం కళ్లముందు గిర్రున తిరుగుతోందని చెబుతూ, 'ఒక్కసారి మన పేరు చూడాలి ఇక్కడ' అని థియేటర్స్ ముందు బ్యానర్లు పెట్టినప్పుడు అనుకునే వాడినని ఇవాళ పాన్ ఇండియా స్టార్ పక్కన తన కటౌట్ చూసుకుంటే... ఇది చాలదా జీవితానికి అనిపిస్తోందని మారుతి పేర్కొన్నాడు. 'మా నాన్నగారు ఇవాళ మాతో ఉండి ఉంటే ఎంతో గర్వంగా భావించే వారు. కానీ మాతో లేరు' అని ఆ పోస్ట్ లో మారుతి ఎమోషన్ కు గురయ్యాడు. ఓ దిగువ మధ్య తరగతి మనిషి కష్టపడితే... ఏ స్థాయికి ఎదగగలడు అనడానికి ఈ తరానికి మారుతీ ఓ గొప్ప ఉదాహరణ అనడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు.
Also Read: Surekha Vani And Supritha: సరిపోయారు ఇద్దరు.. సురేఖా, సుప్రీత డబుల్ డోస్