Boyapati Srinu: నా ఆయుధం బాలయ్య.. 'అఖండ 2' భారతీయ ఆత్మ
ABN, Publish Date - Nov 17 , 2025 | 07:51 AM
బాలకృష్ణ (Balakrishna) కథానాయకుడిగా నటించిన ‘అఖండ 2: తాండవం’ చిత్రం మేకర్స్ సినీ ప్రియులకు ఓ ఆసక్తికరమైన అప్డేట్ ఇచ్చారు.
నందమూరి బాలకృష్ణ (Balakrishna) కథానాయకుడిగా నటించిన ‘అఖండ 2: తాండవం’ (Akhanda2 Thaandavam) చిత్రం మేకర్స్ సినీ ప్రియులకు ఓ ఆసక్తికరమైన అప్డేట్ ఇచ్చారు. డిసెంబరు 5న విడుదలవుతున్న ఈ సినిమాను 3డీ ఫార్మాట్‌లో తీసుకురానున్నట్లు వెల్లడించారు. సంచలన విజయం సాధించిన ‘అఖండ’కు సీక్వెల్‌గా ఇది తెరకెక్కుతోంది.
ఆదివారం చిత్రబృందం నిర్వహించిన విలేకరుల సమావేశంతో దర్శకుడు బోయపాటి శ్రీను (Boyapati Srinu) మాట్లాడుతూ ‘నందమూరి బాలకృష్ణ అభిమానులకు సరికొత్త సినిమాటిక్ అనుభూతిని అందివ్వాలనే ఉద్దేశంతోనే ఈ చిత్రాన్ని త్రీడీలో మీ ముందుకు తెస్తున్నాం. ‘భగవద్గీత, రామాయణం, భారతం’.. ఇవి భారతదేశం ఆత్మ. ప్రపంచంలోని మిగతా దేశాల్లో మతం కనిపిస్తుంది. కానీ మన భారత్‌లో మాత్రమే సనాతన ధర్మం కనిపిస్తుంది. ఈ పాయింట్ ఆధారంగానే సినిమాను రూపొందిస్తున్నామన్నారు.
నా ఆయుధం బాలయ్య.. అఖండ 2 తీసింది రాసింది నేనే.. అన్ని వర్గాల ప్రేక్షకులూ ఇష్టపడేలా చిత్రం ఉంటుందనీ.. ఈ సినిమాను దేశమంతా చూడాలని అనుకుంటున్నా. అందుకే ప్రచారాన్ని ముంబై నుంచి మొదలుపెట్టాం’ అని చెప్పారు. ‘ఈ చిత్రానికి ఉన్న కథా పరిధిని దృష్టిలో పెట్టుకొని త్రీడీలో తీసుకువస్తున్నాం. విజువల్స్ అదిరిపోనున్నాయి’ అని గోపి ఆచంట చెప్పారు. బాలకృష్ణ కూతురు తేజస్విని సమర్పణలో రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్నారు. ఆది పినిశెట్టి, సంయుక్త, హర్షాలి మల్హోత్రా కీలక పాత్రల్లో కనిపించనున్నారు.