Ram Gopal Varma: అబ్బా ఆర్జీవీ.. చిరంజీవికి క్షమాపణల వెనుక మర్మం ఇదా!
ABN, Publish Date - Nov 10 , 2025 | 11:42 AM
శివ సినిమా రీ రిలీజ్ సందర్భంగా చిరంజీవి చేసిన వ్యాఖ్యలపై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ క్షమాపణ చెప్పడం వెనుక ఉన్న అసలు కథ బయటకు వచ్చింది.
‘శివ’ రీ రిలీజ్ (Shiva’ Re-release) సందర్భంగా చిరంజీవి (Chiranjeevi) శుభాకాంక్షలు తెలుపుతూ ఆ సినిమా ను ఉద్దేశిస్తూ ఓ వీడియో బైట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ వీడియో సందేశంలో చిత్ర బృందాన్ని అభినందించారు. ‘శివ’ సినిమా చూసి నేను ఆశ్చర్యపోయా. అది సినిమా కాదు ఓ విప్లవం, తెలుగు సినిమాకి కొత్త నిర్వచనం ఇచ్చింది. ఈ చిత్రాన్ని మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తుండటం మంచి విషయం. చిత్ర బృందానికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు’ అని చిరంజీవి అన్నారు.
అయితే .. ఈ వీడియోను ఆర్జీవీ (Ram Gopal Varma) తన ఎక్స్ అకౌంట్‌లో షేర్ చేసి ‘థాంక్స్ చిరంజీవి గారు.. అనుకోకుండా మిమ్మల్ని ఇబ్బంది పెట్టి ఉంటే ఈ సందర్భంగా క్షమాపణలు కోరుతున్నా. విశాల హృదయంతో మా చిత్ర బృందాన్ని అభినందించినందుకు కృతజ్ఞతలు’ అని ట్వీట్ చేశారు. దీంతో ఇది కాస్త బాగా వైరల్ అయి ఆర్జీవీ ఇన్నాళ్లు మెగా కుటుంబంపై విమర్శలు చేసినందుకు ఇప్పుడు క్షమాపణలు చెప్పాడంటూ న్యూస్ తెగ వైరల్ అయింది.
వర్మ సారీ వెనుక కారణాలను ఒక్కొక్కరు ఒక్కో విధంగా అర్దం చేసుకున్నారు. నెటిజన్లు విభిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. మెగా ఫ్యామిలీ టార్గెట్‌గా వర్మ గతంలో చేసిన వ్యాఖ్యలను గుర్తుచేసుకుంటూ, ఇప్పుడు సారీ చెప్పడం అందుకే అనుకుంటున్నారు. అందుకే ఎన్నడూ లేనిది సారీ చెప్పాడని అనుకున్నారు. దీంతో.. ఇప్పటికైనా వర్మకు బుద్ది వచ్చిందంటూ కామెంట్లు చేశారు.
అయితే.. ఇప్పుడు సడన్‌గా ఆర్జీవీ క్షమాపణలు చెప్పడంపై అసలు కథ వేరే ఉందని పలువురు అంటున్నారు. చిరంజీవి, శ్రీదేవి కాంబోలో రామ్ గోపాల్ వర్మ ఒకప్పుడు కలిసి ఒక సినిమా చేయాల్సి ఉంది. అశ్వనీ దత్ నిర్మాణంలో ఆ సినిమా కొంత మేర చిత్రీకరణ కూడా జరుపుకుంది. వినాలని ఉంది అనే టైటిల్ కూడా ప్రచారంలోకి వచ్చింది. కానీ సరిగ్గా ఆ టైమ్‌లోనే వర్మకు బాలీవుడ్ మూవీ ఆఫర్ రావటంతో .. చిరంజీవి సినిమా చిత్రీకరణ నడుస్తూ ఉండగానే ఎవరికి చెప్పకుండా ముంబైకి వెళ్లిపోయాడట వర్మ. దాంతో అలా ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది.
ఆ ఘటన తర్వాత చిరంజీవి, రామ్ గోపాల్ వర్మల మధ్య దూరం ఏర్పడింది. అప్పటినుంచి చిరంజీవి.. రామ్ గోపాల్ వర్మను దగ్గరకు రానివ్వలేదని టాలీవుడ్ టాక్. కానీ ఇప్పుడు శివ రీ రిలీజ్ సందర్భంగా అప్పటి విషయాలను పక్కనపెట్టి చిరంజీవి సినిమా గురించి మాట్లాడారని, దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి కూడా ప్రస్తావించారని అందుకు గాను చిరంజీవిని ఆర్జీవి క్షమాపణలు కోరినట్లు సమాచారం. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అయ్యాయి.