Dheeraj Mogilineni: 'ది గర్ల్ ఫ్రెండ్' నిర్మాత కొత్త సినిమా షురూ
ABN , Publish Date - Nov 15 , 2025 | 03:21 PM
ది గర్ల్ ఫ్రెండ్ నిర్మాతల్లో ఒకరైన ధీరజ్ మొగిలినేని... సంగీత్ శోభన్ హీరోగా సినిమా నిర్మిస్తున్నారు. దీనికి పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఫిల్మ్ నగర్ దైవ సన్నిధానంలో ఈ సినిమా షూటింగ్ పూజాతో మొదలైంది.
నేషనల్ క్రష్ రశ్మిక మందణ్ణ (Rashmika Mandanna) 'ది గర్ల్ ఫ్రెండ్' (The Girlfriend) సినిమా నిర్మాతల్లో ఒకరైన ధీరజ్ మొగిలినేని (Dheeraj Mogilineni), గిరిబాబు వల్లభనేనితో కలిసి సంగీత్ శోభన్ (Sangeeth Sobhan) హీరోగా ఓ సినిమాను నిర్మిస్తున్నారు. ఫిల్మ్ నగర్ దైవ సన్నిధానంలో జరిగిన ఈ సినిమా ప్రారంభోత్సవంలో 'ది గర్ల్ ఫ్రెండ్' దర్శకుడు రాహుల్ రవీంద్రన్ (Rahul Ravindran) అతిథిగా హాజరై చిత్ర బృందానికి స్క్రిప్ట్ ను అందించారు. దేవుని పటాలపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి ఎస్.కె.ఎన్. క్లాప్ కొట్టారు. సంగీత్ శోభన్ హీరోగా నటించే ఈ సినిమాను 'కరెంట్' మూవీ ఫేమ్ పల్నాటి సూర్యప్రతాప్ డైరెక్ట్ చేస్తున్నాడు.
ప్రముఖ దర్శకుడు సుకుమార్ (Sukumar) శిష్యుడైన సూర్యప్రతాప్ 'కరెంట్' మూవీతో దర్శకుడయ్యారు. ఆ తర్వాత అతనితోనే సుకుమార్ నిర్మాతగా 'కుమారి 21 ఎఫ్' (Kumari 21 F) మూవీని నిర్మించారు. ఈ సినిమా కమర్షియల్ గా సూపర్ హిట్ అయ్యింది. ఆ తర్వాత సూర్యప్రతాప్ నిఖిల్ హీరోగా '18 పేజీస్' (18 Pages) మూవీని డైరెక్ట్ చేశారు. అయితే ఈ సినిమా సక్సెస్ కాలేదు. దాంతో కాస్తంత గ్యాప్ తీసుకుని సూర్యప్రతాప్ ఇప్పుడు ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో తన నాలుగో సినిమాను చేస్తున్నారు.

ఇక స్వర్గీయ దర్శకుడు శోభన్ రెండో కొడుకైన సంగీత్ శోభన్ ఇప్పటికే 'మ్యాడ్' సీరిస్ మూవీస్ లో హీరోగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇటీవల 'గ్యాంబ్లర్' చిత్రంలో నటించాడు. ప్రస్తుతం సంగీత్ శోభన్ హీరోగా నిహారిక కొణిదెల ఓ సినిమాను నిర్మిస్తోంది. ఆ మూవీ సెట్స్ మీద ఉండగానే ఇప్పుడు సంగీత్ శోభన్ తో ధీరజ్ మొగిలినేని మరో సినిమాను ప్రారంభించడం విశేషం. ఈ సినిమాకు విజయ్ బుల్గానిన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రానికి లక్ష్మీ భూపాల్ రచయిత. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Also Read: Kaantha: టాప్ క్లాస్ ప్రొడక్షన్ గా 'కాంత': రానా
Also Read: Vishal vs Lyca: ఈ కేసుకు.. దారేది! విశాల్ - లైకా వివాదం.. విచారణ నుంచి తప్పుకున్న న్యాయమూర్తి