Dhandoraa Song: సామాజిక అసమానతలను ప్రశ్నిస్తోన్న ‘దండోరా’ సాంగ్
ABN, Publish Date - Dec 14 , 2025 | 08:00 AM
శివాజీ, నవదీప్, నందు, రవికృష్ణ, మనికా చిక్కాల, మౌనికా రెడ్డి, బిందు మాధవి, రాధ్య, అదితి భావరాజు పాత్రధారులుగా లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్ పై రవీంద్ర బెనర్జీ ముప్పానేని రూపొందిస్తోన్న చిత్రం ‘దండోరా’. మురళీకాంత్ దర్శకత్వం వహిస్తున్నారు. డిసెంబర్ 25న మూవీ రిలీజ్ అవుతోంది.
నిను మోసినా నను మోసినా
అమ్మ పేగు ఒకటేనన్నా
నిను కోసినా నను కోసినా
రాలే రగతం ఎరుపేనన్నా
చిన్నా పెద్దా తేడా ఎట్లొచ్చేరా
నన్ను తొక్కే హక్కు ఎవడిచ్చేరా
ముట్టుకుంటే మైల ఎట్టయ్యెరా
కొట్టి కొట్టి గుండె డప్పయ్యెరా
దండోరా.. దండోరా... అంటూ సాగే ‘దండోరా...’ మూవీ టైటిల్ సాంగ్‌ను మేకర్స్ శనివారం విడుదల చేశారు. మార్క్ కె రాబిన్ సంగీత సారథ్యం వహిస్తోన్న ఈ సినిమాలోని, ఈ పాటను కాసర్ల శ్యామ్ రాశారు. ఆంథోని దాసన్, మార్క్ కె.రాబిన్ పాటను పాడారు. సమాజంలో అట్టడుగు వర్గాల ప్రజల బాధలను తెలియజేసేలా సాగే ఈ పాట చాలా ఎమోషనల్‌గా, హార్ట్ టచింగ్‌గా ఉంది.కలర్ ఫొటో, బ్లాక్‌బస్టర్ మూవీ ‘బెదురులంక 2012’ చిత్రాలను నిర్మించి అందరి దృష్టిని ఆకర్షించిన లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత రవీంద్ర బెనర్జీ ముప్పానేని రూపొందిస్తోన్న చిత్రమిది. శివాజీ, నవదీప్, నందు, రవికృష్ణ, మనికా చిక్కాల, మౌనికా రెడ్డి, బిందు మాధవి, రాధ్య, అదితి భావరాజు తదితరులు పాత్రధారులు. మురళీకాంత్ దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రం డిసెంబర్ 25న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
అగ్ర వర్ణాలకు చెందిన అమ్మాయిల ప్రేమించి పెళ్లి చేసుకున్నా, అగ్ర వర్ణాలకు ఎదురు తిరిగినా ఎలాంటి దౌర్జన్యకాండ జరుగుతున్నాయనే అంశాన్ని ఆధారంగా చేసుకుని దండోరా సినిమాను తెరకెక్కిస్తున్నారు. తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో మన పురాతన ఆచారాలు, సాంప్రదాయాలను ఆవిష్కరిస్తూనే వ్యంగ్యం, చక్కటి హాస్యం, హృదయాన్ని హత్తుకునే భావోద్వేగాల కలయికగా ఈ సినిమాను ఆవిష్కరిస్తున్నారు. ఈ సినిమాకు రిలీజ్ కంటే ముందే బిజినెస్ పూర్తి కావటం విశేషం. నైజాంలో మైత్రీ మూవీస్ సంస్థ రిలీజ్ చేస్తుంటే.. ఆంధ్ర, సీడెడ్, కర్ణాటక ఏరియాల్లో ప్రైమ్ షో రిలీజ్ చేస్తోంది. ఓవర్సీస్‌లో 200కు పైగా థియేటర్స్‌లో సినిమాను అథర్వణ భద్రకాళి పిక్చర్స్ గ్రాండ్ రిలీజ్ చేస్తోంది. ఓవర్సీస్‌లో అయితే డిసెంబర్ 23నే ప్రీమియర్స్ ప్లాన్ చేశారు.