Dasari Narayanarao: డైరెక్టర్ ఈజ్ ద కెప్టెన్.. గౌరవం దాసరి వల్లే..
ABN, Publish Date - May 04 , 2025 | 04:43 PM
'తాత-మనవడు'తో డైరెక్టర్ అయిన దాసరి.. దాసరి నూరవ చిత్రం 'లంకేశ్వరుడు'.. దాసరి 150వ సినిమా 'పరమవీరచక్ర'.. నటనతోనూ ఆకట్టుకున్న దర్శకరత్న..
'తాత-మనవడు'తో డైరెక్టర్ అయిన దాసరి
దాసరి నూరవ చిత్రం 'లంకేశ్వరుడు'
దాసరి 150వ సినిమా 'పరమవీరచక్ర'
నటనతోనూ ఆకట్టుకున్న దర్శకరత్న
బహుముఖ ప్రజ్ఞతో సాగిన దాసరి నారాయణరావు
అత్యధిక చిత్రాల దర్శకునిగా వరల్డ్ రికార్డ్! ప్రపంచంలో అత్యధిక చిత్రాలు తెరకెక్కించిన ఘనత దర్శకరత్న దాసరి నారాయణరావు సొంతం... మే 4న దాసరి జయంతి... ఈ సందర్భంగా దాసరి చలనచిత్ర వైభవాన్ని మననం చేసుకుందాం..
(దాసరి నారాయణ రావు జయంతి (మే 4న))
దర్శకరత్నగా జనం మదిలో నిలచిన దాసరి నారాయణరావు 151 చిత్రాలు తెరకెక్కించి 'వరల్డ్ రికార్డ్' సృష్టించారు... తొలి సినిమా 'తాత-మనవడు' మొదలు చివరి చిత్రం 'ఎర్రబస్సు' దాకా తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషలతో కలిపి మొత్తం 151 సినిమాలు రూపొందించారు... దర్శకునిగానే కాదు కథకునిగా, నటునిగా, నిర్మాతగా, గీత రచయితగా తన బహుముఖ ప్రజ్ఞను చాటుకుంటూ సాగారు దాసరి... ఆయన తెరకెక్కించిన అనేక చిత్రాలలో స్త్రీ సమస్యలను చర్చించారు... వాటికి తగ్గ పరిష్కారాలూ చూపించారు... అందుకే అప్పట్లో మహిళలకు అభిమాన దర్శకునిగా జేజేలు అందుకున్నారు దాసరి...
దాసరి వరల్డ్ రికార్డ్!
శతాధిక చిత్రాలు తెరకెక్కించిన తొలి దర్శకునిగా గిన్నిస్ బుక్ లో చోటు సంపాదించారు దాసరి... ఆ పై ప్రపంచంలోనే అత్యధిక సినిమాలు రూపొందించిన డైరెక్టర్ గానూ చరిత్ర సృష్టించారు... దాసరి మార్కు డైలాగ్స్ ఆ రోజుల్లో జనాన్ని విశేషంగా అలరించేవి... ఆయన కలం పలికించిన సంభాషణలకు థియేటర్లు చప్పట్లతో మారుమోగిన పోయిన రోజులున్నాయి...
ఎగసిపడిన కెరటం...
దాసరి నారాయణరావు కెరీర్ లో ఎన్నెన్నో మైలురాళ్ళు... అంబరమంటే సంబరాలు చేసుకొనే విజయాలు సాధించారు... కొన్నిసార్లు అభిమానులను నిరాశ పరచిన సందర్భాలూ ఉన్నాయి... అయితే కిందపడ్డా అంతకంటే రెట్టింపు వేగంతో ఎగసిపడేలా దాసరి సినిమాలు రూపొందించారు... దాసరి పేరు తలచుకోగానే 'మనుషులంతా ఒక్కటే, సర్దార్ పాపారాయుడు, శ్రీవారి ముచ్చట్లు, ప్రేమాభిషేకం, బొబ్బిలిపులి, ఒసేయ్ రాములమ్మ" వంటి ఘన విజయాలు ముందుగా గుర్తుకు వస్తాయి... వీటితో పాటు లో-బడ్జెట్ లో ఆయన తెరకెక్కించిన 'స్వర్గం-నరకం, ఇదెక్కడి న్యాయం, శివరంజని, అమ్మరాజీనామా" వంటి సినిమాలూ గుర్తుకు రాకమానవు... నటునిగానూ ఆయన అనేక చిత్రాలలో తనదైన బాణీ పలికించారు... 'మామగారు'తో ఉత్తమ నటునిగా నంది అవార్డునూ సొంతం చేసుకున్నారు... డైరెక్టర్ ఈజ్ ద కెప్టెన్ అని దర్శకునికి మళ్ళీ గౌరవాన్ని సంపాదించిన దాసరి సినీ వైభవం అనితరసాధ్యం అనే చెప్పాలి... నేడు దాసరి లేకున్నా ఆయన చిత్రాలు జనం మదిలో నిలచే ఉన్నాయి.