Brahmanandam: రాష్ట్రపతితో బ్రహ్మానందం భేటీ..
ABN, Publish Date - Dec 21 , 2025 | 09:19 PM
హాస్య బ్రహ్మా బ్రహ్మానందం (Brahmanandam) నేడు భారత రాష్ట్రపతి ద్రౌపటి ముర్ము (Droupadi Murmu)తో భేటీ అయ్యారు.
Brahmanandam: హాస్య బ్రహ్మా బ్రహ్మానందం (Brahmanandam) నేడు భారత రాష్ట్రపతి ద్రౌపటి ముర్ము (Droupadi Murmu)తో భేటీ అయ్యారు. హైదరాబాద్ లోని రాష్ట్రపతి నిలయంలో రాష్ట్రపతి ద్రౌపటి ముర్ము.. బ్రహ్మానందంను మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయనకు పుష్పగుచ్చం అందించి శాలువతో సత్కరించారు. బ్రహ్మీ సైతం.. ద్రౌపటి ముర్ముకి తాను లిఖించిన ఆంజనేయ స్వామి చిత్రాన్ని బహుకరించారు. అనంతరం ఇద్దరూ కొద్దిసేపు మాట్లాడుకున్నారు. అయితే ఈ భేటీకి కారణం ఏంటి అనేది ఇంకా తెలియలేదు కానీ, ప్రస్తుతం ఈ ఫోటోలు మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
హాస్య బ్రహ్మా బ్రహ్మానందం పేరు తెలియని వారుండరు అని చెప్పడంలో అతిశయోక్తి కాదు. కమెడియన్ గా ఆయన చేసిన సినిమాలు ఒక రికార్డ్ నే సృష్టించాయి. ఇప్పుడున్న సోషల్ మీడియాలో మీమర్స్ బ్రతుకుతున్నారు అంటే అది బ్రహ్మీ వలనే అని చెప్పొచ్చు. చిరంజీవి, నాగార్జునలా.. తమ ఫోటోలను తమ అనుమతి లేకుండా వాడకూడదు అని కానీ, బ్రహ్మీ ఒక్క కేసు వేస్తే.. మీమ్స్ అనేవి కనిపించవు అని చెప్పొచ్చు. వరుస సినిమాలతో అలరించిన బ్రహ్మానందం ఈ మధ్య కాస్తా జోరు తగ్గించారు. అప్పుడప్పుడు అలా అలా కొన్ని సినిమాల్లో కనిపించి మెప్పిస్తున్నారు. తాజాగా రిలీజ్ అయిన గుర్రం పాపిరెడ్డి సినిమాలో ఆయన కనిపించారు.
ఇక బ్రహ్మీ కేవలం కమెడియన్ మాత్రమే కాదు మంచి చిత్రకారుడు. చిత్రలేఖనంలో ఆయనకు ఆయనే సాటి అని చెప్పొచ్చు. ఇంట్లో ఉన్నప్పుడు తన మనసుకు నచ్చిన చిత్రాన్ని గీస్తూ ఉంటారు. ముఖ్యంగా పెన్సిల్ ఆర్ట్ తో దేవుళ్ల చిత్రాలను ఎంతో అద్భుతంగా లిఖిస్తారు. ఆ చిత్రాలనే ఎవరైనా తనను కలవడానికి వచ్చిన స్టార్స్ కి బహుమతిగా అందిస్తుంటారు. కృష్ణంరాజు దగ్గర నుంచి రామ్ చరణ్ వరకు ఎంతోమందికి ఈ చిత్రాలను ఆయన బహుకరించారు. ఇప్పుడు తాను గీసిన ఆంజనేయ స్వామి చిత్రాన్ని రాష్ట్రపతికి బహుకరించారు హాస్య బ్రహ్మా.