Chitrapuri Colony Issue: చిత్రపురి కాలనీలో.. రూ.300 కోట్ల స్కాం! కార్మికుల ధర్నా
ABN, Publish Date - Aug 13 , 2025 | 05:57 PM
చిత్రపురి కాలనీ హౌసింగ్ సొసైటీ భూ కుంబకోణం విషయంలో ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుని చర్యలు తీసుకోవాలంటూ సినీ కార్మికులు FDC కార్యాలయం ఎదుట ధర్నా చేశారు.
గత కొంతకాలంగా చిత్రపురి కాలనీ హౌసింగ్ సొసైటీ (Chitrapuri colony issue)భూ కుంబకోణం విషయంలో అధికారులు, ప్రభుత్వం స్పందించి ప్రత్యేక చొరవ తీసుకుని చర్యలు తీసుకోవాలంటూ బుధవారం పలువురు సినీ కార్మికులు హైదరాబాద్ FDC కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. చిత్రపురి హౌసింగ్ సొసైటీలో రూ.300 కోట్ల భారీ కుంభకోణం జరిగిందని సొసైటీ అధ్యక్షుడు వల్లభనేని అనిల్ కుమార్ (vallabhaneni anil) అవినీతి పెరిగిపోతోందని, ఆయన నేతృత్వంలో ఏకంగా రూ.300 కోట్ల కుంభకోణం జరిగిందని కార్మిక సంఘాలు ఆరోపించాయి. అనిల్ ను తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, దశాబ్దాలుగా ఇండస్ట్రీలో కష్టపడుతున్న నిజమైన సినీ కార్మికులకు ఇళ్లు అందడం లేదని, బదులుగా హౌసింగ్ ప్రాజెక్టులను వాణిజ్య ప్రయోజనాల కోసం వాడుతున్నారని తీవ్రంగా విమర్శించారు. వల్లభనేని అనిల్ కుమార్‌ను వెంటనే అరెస్ట్ చేయాలని, ఈ అవినీతి కుంభకోణంపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. కార్మికుల కోసం కేటాయించిన 2.5 ఎకరాల స్థలంలో 1200 నుంచి 4400 చదరపు అడుగుల విస్తీర్ణంలో భారీ కమర్షియల్ కాంప్లెక్స్‌ల నిర్మాణం జరుగుతోందని తెలిపారు. ఇవి బయట వ్యక్తులకు అమ్మకానికి సిద్ధం చేస్తున్నారని, ఈ వ్యవహారంలో హెచ్‌ఎండీఏ, సీఎంఓ కార్యాలయ అధికారులు సైతం కుమ్మక్కై ఉంటారని ఆరోపించారు.
అయితే.. వల్లభనేని అనిల్ కుమార్‌పై ఇప్పటివరకు 15 ఎఫ్‌ఐఆర్‌లు, 10 ఛార్జ్‌షీట్‌లు నమోదవగా రెండు సార్లు జైలు శిక్ష అనుభవించినప్పటికీ అక్రమాలు ఆగలేదని నిరసనకారులు తెలిపారు. న్యాయస్థానం రిట్ పిటిషన్ నెంబర్లు 18225/2021, 7642/2024, 9335/2025లో ప్రస్తుత కమిటీపై చర్యలు తీసుకోవాలని స్పష్టంగా ఆదేశించినా, అధికారులు పట్టించుకోవడం లేదని, దీంతో అవినీతి మరింత పెరిగిందనన్నారు. గత ప్రభుత్వం మాదిరే ప్రస్తుత పాలకులు కూడా వారిని రక్షిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి స్వయంగా జోక్యం చేసుకుని అవినీతి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
అంతేగాక.. 20-25 ఏళ్లుగా డబ్బులు చెల్లించి ఎదురుచూస్తున్న 6,000 మంది సభ్యులకు వెంటనే ఇళ్లు కేటాయించాలని, కొత్తగా ప్రకటించిన 1,000 సభ్యత్వాల నిర్ణయాన్ని రద్దు చేయాలని, ప్రస్తుత కమిటీని రద్దు చేసి, అడ్-హాక్ కమిటీని నియమించాలన్నారు. అదేవిధంగా కొత్తగా నిర్మించబోయే ట్విన్ టవర్స్‌లో కేవలం సింగిల్, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు మాత్రమే నిర్మించి అర్హులైన సినీ కార్మికులకే ఇవ్వాలని, కోర్టు ఆదేశాలను అమలు చేయని అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ వారు తమ డిమాండ్లను వెళ్లడించారు.ఈ మహా ధర్నాలో చిత్రపురి పోరాట సమితి అధ్యక్షుడు కస్తూరి శ్రీనివాస్, జూనియర్ ఆర్టిస్ట్ సీఐటీయూ నాయకులు సహా పలువురు పాల్గొన్నారు.