Samyuktha Menon: ఇన్ని పాత్రల్లో ఇమిడిపోగలుగుతానని అనుకోలేదు.
ABN, Publish Date - Nov 09 , 2025 | 11:06 AM
భీమ్లానాయక్’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన సంయుక్తా మేనన్... ‘బింబిసార’, ‘విరూపాక్ష’ తదితర చిత్రాలతో విలక్షణ నటిగా గుర్తింపు పొందారు. ‘
భీమ్లానాయక్’ (bhemmla Nayak)చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన సంయుక్తా మేనన్ (Samyuktha Menon)... ‘బింబిసార’, ‘విరూపాక్ష’ తదితర చిత్రాలతో విలక్షణ నటిగా గుర్తింపు పొందారు. ‘అఖండ తాండవం’ లాంటి తెలుగు సినిమాలతో పాటు ఇతర భాషా చిత్రాలతోనూ బిజీగా ఉన్న ఆమె... తన గురించి, తన కెరీర్ గురించి ‘నవ్య’తో ప్రత్యేకంగా మాట్లాడారు.
మీరిప్పుడు ఎలాంటి పాత్రల్లో నటిస్తున్నారు?
నేను పోషిస్తున్న పాత్రలన్నీ వేటికవే ప్రత్యేకమైనవి. ‘బ్లాక్ గోల్డ్’ సినిమాలో పోలీస్ ఆఫీసర్ పాత్ర పోషించాను. ప్రస్తుతం పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో నా పాత్ర పూర్తి భిన్నంగా ఉంటుంది. అలాగే ‘అఖండ తాండవం’లో కూడా నా పాత్ర వినూత్నంగా ఉండబోతోంది. ఇన్ని వైవిధ్యమైన పాత్రల్లో ఇమిడిపోగలుగుతానని నేను కూడా అనుకోలేదు. కానీ ప్రతి పాత్రనూ ఆస్వాదిస్తాను. ఒక పాటలో భాగంగా చక్కని డాన్స్‌ను ప్రదర్శించవలసి వచ్చినా, సన్నివేశంలో భాగంగా భావోద్వేగాలను ప్రదర్శించవలసి వచ్చినా... పూర్తి ప్రతిభను కనబరచడానికి శాయశక్తులా ప్రయత్నిస్తాను.
ఇన్ని భిన్నమైన పాత్రల్లో నటించడం, వరుస షూటింగ్‌లు.. ఇదంతా మీకు కష్టంగా ఉంటుందా?
లేదు. నేనెప్పుడూ అలా అనుకోను. చేస్తున్న పనిని ప్రేమించడం నా నైజం. మక్కువ కలిగిన పని చేసేటప్పుడు ప్రతి క్షణం ఆనందాన్ని అనుభవిస్తాం. ఆ పని శ్రమలా తోచదు. ఒక్కో రోజు షూటింగ్‌తో ఒంట్లో ఉన్న శక్తినంతా ఖర్చు చేయాల్సిన అవసరం ఉందనిపిస్తుంది. కానీ షూటింగ్ ముగించుకుని, సాయంత్రం జిమ్‌లో వ్యాయామం చేసి, ఇంటికి వచ్చి, గంట సేపు పెంపుడు కుక్కలతో ఆడుకున్న తర్వాత కూడా... అలసిపోయిన భావన కలగదు.
మీరు ఎక్కడికి వెళ్లినా...పెంపుడు కుక్కలను కూడా వెంటబెట్టుకు వెళ్తూ ఉంటారా?
నాకు మూడు పెంపుడు కుక్కలున్నాయి. నోవా, ఆర్య, రుద్ర వాటి పేర్లు. మూడు భిన్నమైన కుక్కలే! మూడిటిలో రుద్ర పెద్దది. 45 కిలోల బరువు ఉండే రుద్ర... నా మీదకు దూకేసి ఆటలాడే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. మేము మా పెంపుడు కుక్కలను కూడా కుటుంబ సభ్యుల్లాగే పరిగణిస్తాం.
సినీనటిగా, కథానాయికగా ఎదుగుతానని చిన్నప్పుడు అనుకున్నారా?
లేదు. ఎప్పుడూ అనుకోలేదు. నాకసలు అలాంటి ఆలోచనే ఉండేది కాదు. ఇదంతా విధి ఫలితమే! నేను కేరళలోని ఒక అందమైన గ్రామంలో పుట్టాను. ఆ గ్రామం కేరళ, తమిళనాడు సరిహద్దులో ఉంది. అంత మారుమూల గ్రామం నుంచి సినీ రంగంలోకి ప్రవేశించే మార్గమే లేనప్పుడు, దాని గురించి ఆలోచించే అవకాశం కూడా ఉండదు కదా? కాబట్టి బాగా చదువుకొని, డాక్టరు కావాలని కోరుకునేదాన్ని. ప్రపంచమంతా చుట్టి రావాలని అనుకునేదాన్ని. బడిలో చదువుకునే రోజుల్లో సాంస్కృతిక కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొనేదాన్ని. పుస్తకాలు ఎక్కువగా చదివేదాన్ని. చిన్మయ స్కూల్‌లో చదివే రోజుల్లో వేదాలతో పరిచయం ఏర్పడింది. నేను పెద్దయ్యాక నటిని అవుతానని నా కుటుంబం, స్నేహితులు, బంధువులు ఎవరూ ఊహించలేదు.
సినిమాల్లోకి ఎలా ప్రవేశించారు?
యాదృచ్ఛికంగా జరిగింది. ఇంటర్ పూర్తయ్యాక కాలేజీలో చేరాలని అనుకుంటూ ఉండేదాన్ని. మా గ్రామ ప్రజలు కొన్ని వార్షిక సంచికలు ముద్రించేవారు. గ్రామీణుల కథలు, అనుభవాలు వాటిలో ప్రచురితమవుతూ ఉండేవి. ఒక సందర్భంలో ఆ సంచిక ముఖచిత్రం కోసం వాళ్లు నన్ను సంప్రతించారు. నా ఫొటో ఆ సంచిక ముఖ చిత్రంగా అచ్చయింది. అలాగే నేను సందర్శించే ఒక బ్యూటీ పార్లర్... పాలక్కాడ్‌లో బ్యుటీషియన్స్ కోసం ఒక మేకప్ సెమినార్‌ను నిర్వహించింది. ఆ సెమినార్‌కు ఒక సెలబ్రిటీ మేకప్ ఆర్టిస్ట్ ఆధ్వర్యం వహించింది. ఆ ఆర్టిస్ట్ కు మోడల్‌గా వ్యవహరించవలసిన అమ్మాయి సమయానికి సెమినార్‌కు చేరుకోలేకపోయింది. దాంతో మా అమ్మ బలవంతం మీద... నేను మోడల్‌గా వ్యవహరించవలసి వచ్చింది. అప్పుడు నన్ము పోర్ట్‌ఫోలియా తయారుచేసుకోవాలనీ, మోడలింగ్ అవకాశాల కోసం ప్రయత్నించాలనీ ఆ మేకప్ ఆర్టిస్ట్ సలహా ఇచ్చింది. ప్రొఫెషనల్ మేక్‌పలో నేను భిన్నంగా కనిపిస్తున్నట్టు మొదటిసారిగా గ్రహించాను. ఆ తర్వాత ఆ మేకప్ ఆర్టిస్ట్, నేనూ ఫేస్‌బుక్ ఫ్రెండ్స్‌గా మారిపోయాం. ‘వనిత’ అనే మ్యాగజైన్‌కు ఫొటోగ్రాఫర్‌గా వ్యవహరించే ఒక వ్యక్తి... ఓనమ్ పండుగ కోసం నన్ను ఫొటోషూట్ చేస్తానని అడిగారు. ఆ ఫొటోలు పబ్లిష్ అయిన తర్వాత, నాకు సినిమా అవకాశాలు రావడం మొదలుపెట్టాయి. అప్పటివరకూ నాకు సినీ వాతావరణం గురించి ఏమాత్రం తెలీదు. షూటింగ్‌లు ఎలా జరుగుతాయో, లొకేషన్లు ఎలా ఉంటాయో కూడా తెలీదు. అయితే రెండో సినిమా తరువాత... ఈ రంగంతో ప్రేమలో పడిపోయాను. అనంతరం గొప్ప దర్శకుల దర్శకత్వంలో రూపొందిన అంతర్జాతీయ సినిమాలు చూశాను. గొప్ప నటుల ప్రతిభను అర్థం చేసుకుకోవడానికి, నటిగా నన్ను నేను ఆవిష్కరించుకోవడానికి ప్రయత్నించాను. అయితే నాలోని నటిని వెలికి తీయడానికి తగిన దర్శకుడు, తగిన కథ, తగిన సహనటులు అవసరమనే విషయాన్ని కూడా గ్రహించాను. అలా అంశాలన్నీ అనుకూలించినప్పుడు, కచ్చితంగా నటనా ప్రతిభను చాటుకోవచ్చని నేను నమ్ముతాను. ‘విరూపాక్ష’ సినిమా విషయంలో అదే జరిగింది.
సున్నితమైన నటన, సాంస్కృతిక మూలాలు, ప్రాంతీయతలను ప్రతిబింబించే కథాంశాలు మలయాళ సినిమాకు ఆయువుపట్లు. కానీ ఇక్కడ వినోదమే ప్రధానం. ఈ రెండు ప్రపంచాలకు సమన్యాయం ఎలా చేస్తున్నారు?
భారతదేశంలో ఒక నటిగా సినిమా పరిశ్రమను అన్వేషించేటప్పుడు... భిన్నమైన రాష్ట్రాకు చెందిన భిన్నమైన సినీ పరిశ్రమల లోతుపాతులను అన్వేషించాలి. వాటిని యథాతథంగా స్వీకరించాలి. భిన్న రాష్ట్రాల ప్రేక్షకుల ఇష్టాయిష్టాలు కూడా భిన్నంగానే ఉంటాయి. భారతీయ సినీ పరిశ్రమ ఒకటే అయినప్పటికీ ప్రేక్షకులు భిన్నంగా ఉంటారు. అలాగని సినిమా కమర్షియల్ అయినంత మాత్రాన దానికి తగ్గట్టు మన నటనను మార్చుకోవలసిన అవసరం లేదని భావిస్తాను. అయితే ఒక పాత్ర నాకు తగినది కాదని అనిపించినప్పుడు... దాన్ని అంగీకరించడానికి వెనకాడతాను. అలా వద్దనుకున్న పాత్రలు కూడా ఉన్నాయి. నేను తెలుగు సినీ రంగంలోకి అడుగు పెట్టిన ఈ రెండేళ్ల కాలంలో తెలుగు ప్రేక్షకులు చక్కని నటనను, కథను చూడాలనుకుంటున్న విషయాన్ని గ్రహించాను. ప్రేక్షకులకు నచ్చినప్పుడే నటులకు భవిష్యత్తు ఉంటుంది. కాబట్టి వాళ్లకు నచ్చినది అందించగలగాలి.
మీరు తెలుగు ఎలా నేర్చుకున్నారు?
నటనా ప్రతిభ కనబరచాలంటే మొదట భాష తెలుసుకోవాలి. నా సహనటులు చెప్తున్న డైలాగ్స్ నాకు అర్థమైనప్పుడే... నేను మెరుగైన ప్రతిభ కనబరచగలుగుతాను. ‘విరూపాక్ష’ సినిమా రూపొందే సమయంలో కొవిడ్ వల్ల ఒక నెల ఖాళీ సమయం చిక్కిం ది. ఆ సమయంలో ‘జూమ్’ ద్వారా నేను తెలుగు భాష నేర్చుకున్నాను. మొదట్లో రెండు వాక్యాలతో మొదలుపెట్టాను. మొదట్లో తప్పు లు మాట్లాడేదాన్ని. అయినా సిగ్గు పడకుండా మాట్లాడుతూనే తెలుగు భాష మీద పట్టు పెంచుకున్నాను. నేనిప్పుడు కొన్ని మాండలికాలను కూడా అనుకరించగలుగుతున్నాను.
మీ ఎమోషనల్ సపోర్ట్ ఎవరు?
నా కుటుంబానికి నేనే ఎమోషనల్ సపోర్ట్. నా ఎమోషనల్ సపోర్ట్... శివుడు. ‘శైవ కాశ్మీర్ స్కూల్’లో కాశ్మీర్ శైవిజం గురించి నేర్చుకున్నాను.
మీరు చేయబోతున్న తెలుగు ప్రాజెక్టులు?
‘స్వయంభూ’, ‘అఖండ తాండవం’ రిలీజ్ కాబోతున్నాయి. పూరీ జగన్నాథ్ గారి సినిమా ఎంతో ఆసక్తికరంగా ఉండబోతోంది. ఈ సినిమాలన్నీ విజయం సాధించాలని కోరుకుంటున్నా! ఫిమేల్ సెంట్రిక్ మూవీ ‘బ్లాక్ గోల్డ్’ కూడా విడుదల కాబోతోంది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కలిసి ఒక సినిమాలో నటిస్తున్నాను. తమిళంలో కూడా ఒక సినిమాలో నటిస్తున్నాను.
ఖాళీ సమయాల్లో ఏం చేస్తారు?
నేను పుస్తకాలు ఎక్కువగా చదువుతాను. షూటింగ్‌లో ఖాళీ ఉంటే.. ‘కిండిల్’లో పుస్తకాలు చదువుతాను. ఖాళీ సమయాల్లోనే కాదు, సంతోషంగా ఉన్నా, విచారంగా ఉన్నా, ప్రయాణం చేయవలసివచ్చినా పుస్తకాలనే ఎంచుకుంటాను.