Allari Naresh: రేపు నాదే.. ఇది మామూలు నమ్మకం కాదు నరేషా
ABN , Publish Date - Nov 20 , 2025 | 10:11 PM
‘నాకు డైరెక్షన్ చేయాలని ఎప్పటినుంచో కోరిక. దానికి చాలా సమయం కావాలి. తప్పకుండా సినిమా డైరెక్షన్ చేస్తాను.
‘నాకు డైరెక్షన్ చేయాలని ఎప్పటినుంచో కోరిక. దానికి చాలా సమయం కావాలి. తప్పకుండా సినిమా డైరెక్షన్ చేస్తాను. అది డీడీఎల్‌జే లాగా గుర్తుండిపోయేలా ఉండాలి’ అని అన్నారు అల్లరి నరేష్ (allari Naresh). ఆయన నటించిన తాజా చిత్రం ‘12A రైల్వే కాలనీ’ (12A Railway colony) . నాని కాసరగడ్డ దర్శకత్వంలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాసా చిట్టూరి నిర్మించారు. నవంబర్ 21న ఈ సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా అల్లరి నరేశ్ విలేకర్లతో మాట్లాడారు.
ఇందులో కార్తీక్ అనే క్యారెక్టర్ చేశా. లోకల్ ఎమెల్యే దగ్గర పని చేసే పాత్ర అతనిది. అక్కడ ఒక గ్యాంగ్ ఉంటుంది. సరదాగా జరిగిపోతున్నప్పుడు ఒక సంఘటన ఎదురవుతుంది. ఆ సంఘటన తన జీవితంలో ఎలాంటి మలుపు తీసుకుంది అనేది మిగతా కథ. ఓ కొత్త జానర్ చేద్దామని ఉద్దేశం ఈ సినిమా చేశా. ఇప్పటిదాకా సస్పెన్స్ థ్రిల్లర్ చేయలేదు. ఇందులో పారానార్మల్ టింజ్ చాలా బాగుంటుంది. యదార్థంగా జరిగిన సంఘటన ఆధారంగా తీసిన సినిమా ఇది. హైదరాబాదులో ఆ సంఘటన జరిగింది. దాన్ని సినిమాకు తగ్గట్టుగా చాలా అద్భుతమైన స్క్రీన్ ప్లే తో తెరకెక్కించారు. ఇది వరంగల్లో జరిగే కథ. తెలంగాణ యాస కోసం అజయ్ అనే ఒక వ్యక్తి వచ్చారు. తనతో వర్క్ షాప్స్ చేశా. మొదటిసారి తెలంగాణ యాస మాట్లాడుతున్నాను. శ్రద్థ తీసుకున్నాను. ప్రతి సినిమాకి ఒక రోజులో డబ్బింగ్ చెబితే ఈ సినిమాకు నాలుగు రోజులు పట్టింది. నా 63వ చిత్రమిది. ప్రతి సినిమా విడుదలకి ఎంత ఎగ్జైట్‌మెంట్ ఉంటుందో అంతకుమించి టెన్షన్ కూడా ఉంటుంది. కానీ ఈసారి చాలా నమ్మకంగా ఉన్నాం. రేపు నాదే అన్న పాజిటివ్ ఫీలింగ్ ఉంది.
స్క్రీన్ ప్లే గురించి మాట్లాడతారు
అనిల్ కథ చెప్పినప్పుడు షాకయ్యా. సెకండ్ హాఫ్ ఎలా ఉండబోతుందో అనిపించింది. మహారాజా సినిమా తీసుకుంటే అందులో స్ర్కీన్‌ప్లే చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఎక్కడో మొదలైన సీన్‌కి చివర్లో కనెక్షన్ ఉంటుంది. అలాగే ఈ సినిమాలో ఒక మూడు నాలుగు కథలు సమాంతరంగా జరుగుతుంటాయి. మైండ్ గేమ్ ఉంటుంది. ఇలాంటి స్క్రీన్ ప్లే తో తెలుగులో చాలా తక్కువ సినిమాలొచ్చాయి. ఈ సినిమా సక్సెస్ అయితే తప్పకుండా స్క్రీన్ ప్లే గురించి మాట్లాడుకున్నప్పుడు ఈ సినిమా గురించి చర్చిస్తారు. నా కెరీర్‌లో మంచి సినిమా ఇదని ఆడియన్స్ చెబుతారని నమ్ముతున్నా.
రైల్వే కాలనీ బ్యాక్ డ్రాప్‌లో
ఇది 12ఎ అనే ఇంట్లో జరిగే కథ. అందుకే మొదటే ఈ టైటిల్ ఫిక్స్ అయ్యాం. రైల్వే కాలనీ అని కూడా పెడితే అందరికీ కనెక్టింగ్‌గా ఉంటుంని చెప్పారు. సినిమా రైల్వే కాలనీ బ్యాక్ డ్రాప్‌లో జరుగుతుంది. హీరోయిన్ కామాక్షి గారి నాన్నగారు మా నాన్నగారి దగ్గర వర్క్ చేశారు. తను ఇంటర్ చదువుతున్న ఇంటర్ చదివేటప్పుడు నా సినిమాల షూటింగ్ కి వచ్చేది. ఇంతకుముందు నా మారేడుమిల్లి సినిమాలో చేసింది. ఈ సినిమాకి ఒక మిడిల్ క్లాస్, పక్కింటి అమ్మాయిలా కనిపించే హీరోయిన్ కావాలి. అనిల్ గారితో కామాక్షి పొలిమేర సినిమా చేసినప్పటికీ కూడా ఈ సినిమా కోసం ప్రత్యేకంగా ఫోటో షూట్ చేశాము. ఈ సినిమాకు ఆమె పర్ఫెక్ట్ ఛాయిస్. తను తెలుగమ్మాయి. భాష పరంగా ఎలాంటి అడ్డంకి ఉండదు. తనకి రైటింగ్, డైరెక్షన్ ఇలా అన్నింటిలో టచ్ ఉంది. మంచి ఆర్టిస్టు. శీనివాస చిట్టూరి గారితో ‘నా సామిరంగా’ సినిమా చేశాను. మంచి ప్రొడ్యూసర్స్. ముక్కు సూటిగా మాట్లాడుతారు.
ఆ రెండు రకాల జానర్స్ చేయాలి
నా వరకు కామెడీ చేయడమే కష్టం. కామెడీకి చాలా టైమింగ్ కావాలి. అలాగే సీన్ చేస్తున్నప్పుడు కూడా మనం సీరియస్‌గా ఉండాలి. చూస్తున్న ఆడియన్స్‌కి నవ్వు రావాలి. ఆ టైమింగ్ బ్యాలెన్స్ చేయడం చాలా టఫ్. నాకు డైరెక్షన్ చేయాలని ఎప్పటినుంచో ఉంది. కానీ దానికి చాలా సమయం కావాలి. ఒక సినిమా డైరెక్షన్ చేస్తాను. అది డీడీఎల్‌జే లాగా గుర్తుండిపోవాలనేది నా కోరిక. అలాగే ఒక హారర్ సినిమా, మూకీ సినిమా చేయా?నుంది. డైలాగ్ లేకుండా నవ్వించాలి. ఈ మధ్యనే మూడు వెబ్ సిరీస్ కథలొచ్చాయి. నాకు నచ్చలేదు. ఒక కామెడీ వెబ్ సిరీస్ కథ వస్తే కచ్చితంగా చేస్తా.
విన్న జోక్ చెప్పకూడదు
నా దృష్టిలో కామెడీ రాయడం, తీయడం రెండు కష్టమే. ఇప్పుడు అన్ని సెన్సిటివ్ అయిపోయాయి. ఈరోజుల్లో సీమశాస్ర్తి తీస్తే అది రిలీజ్ అవ్వదు. ఇప్పుడంతా ఆర్గానిక్ కామెడీ. ప్రత్యేకంగా జోకులంటూ వర్కౌట్ అవ్వవు. విన్న జోక్ చెప్పకూడదు. ఏదో కొత్త జోక్ చెప్పాలి. ఈ మధ్యన వరుసగా సీరియస్ సినిమాలు చేశాను. తర్వాత రాబోయే రెండు సినిమాలే వినోదాత్మకంగా సాగేవే. ఆల్కహాల్ జనవరిలో ప్రేక్షకుల ముందుకొస్తుంది. హాస్య, అన్నపూర్ణ బ్యానర్లో ఒక సినిమా ఈ నెల ప్రారంభమవుతోంది. జనవరి నుంచి మరో కొత్త సినిమా మొదలుకానుంది.