Chiranjeevi: ఏపీ అసెంబ్లీలో బాలయ్య వ్యాఖ్యలపై చిరంజీవి స్పందన..
ABN, Publish Date - Sep 25 , 2025 | 08:12 PM
ఏపీ అసెంబ్లీలో శాసనసభ్యులు కామినేని శ్రీనివాస్, నందమూరి బాలకృష్ణ తన పేరును ప్రస్తావిస్తూ మాట్లాడటంపై అగ్ర కథానాయకుడు చిరంజీవి స్పందించారు.
ఏపీ అసెంబ్లీలో (AP Assembly)శాసనసభ్యులు కామినేని శ్రీనివాస్, నందమూరి బాలకృష్ణ (Balakrishna) తన పేరును ప్రస్తావిస్తూ మాట్లాడటంపై అగ్ర కథానాయకుడు చిరంజీవి స్పందించారు. ‘కామినేని శ్రీనివాస్ చెప్పినట్లు చిరంజీవి(Chiranjeevi) గట్టిగా అడిగితే అప్పుడు ఈయన వచ్చాడు అన్నది అబద్థం. గట్టిగా ఎవడు అడగలేదు అక్కడ. ఆయనంత గట్టిగా చెబితే ఈయన దిగొచ్చాడంట. లేకపోతే సినిమాటోగ్రఫీ మినిస్టరును కలవనన్నాడట’ అంటూ ఒకింత వ్యంగ్యంగా చెప్పడాన్ని నేను టీవీ చానల్‌లో లైవ్‌లో చూశాను. దీనిపై ప్రజలకు వివరణ ఇవ్వాలనుకుంటున్నా అంటూ రెండున్నరేళ్ల క్రితం సినిమా పరిశ్రమ సమస్యలపై అప్పటి సీఎం వైఎస్ జగన్ కలిసినప్పటి పరిస్థితులను చెబుతూ చిరంజీవి ఓ ప్రకటన విడుదల చేశారు.
‘బాలకృష్ణ అసెంబ్లీలో మాట్లాడిన మాటలను టీవీలో లైవ్‌లో చూశా. ఏపీలో జగన్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పరిశ్రమలోని దర్శకనిర్మాతలు కొందరు నన్ను కలిశారు. టికెట్ ధరల పెంపుపై ప్రభుత్వంతో మాట్లాడాలని కోరారు. ఈ విషయమై అప్పటి సినిమాటోగ్రఫీ మంత్రి పేర్నినానితో ఫోన్‌లో మాట్లాడాను. ముఖ్యమంత్రి మీతో వన్ టు వన్ మాట్లాడతానని, భోజనానికి రావాలని సీఎం చెప్పారంటూ నాని నాతో చెప్పారు. దానికి టైమ్ కూడా ఇచ్చారు. ముఖ్యమంత్రి ఆహ్వానం మేరకు నేను ఆయన నివాసానికి వెళ్లాను. ్ఘభోజనం చేస్తున్న సమయంలో సినీ పరిశ్రమ ఇబ్బందులు సీఎంకు వివరించా. ఇండస్ర్టీకి మీకు మధ్య గ్యాప్ ఉందని అందరూ అనుకుంటున్నారని సీఎంకు చెప్పా. సమయం ఇస్తే అందరం కలిసి వస్తామని కోరాను. కొన్ని రోజుల తర్వాత పేర్ని నాని ఫోన్ చేసి ‘కొవిడ్ రెండో దశ కారణంగా ఐదుగుర్ని మాత్రమే రమ్మన్నారు’ అని చెప్పారు. అప్పుడు నేను బాలకృష్ణ గారిని ఫోన్ ద్వారా సంప్రదించడానికి ప్రయత్నించాను. ఆయన అందుబాటులోకి రాలేదు. జెమిని కిరణ్‌ను వెళ్లి బాలకృష్ణను కలవమని చెప్పా. ఆయన మూడు సార్లు ప్రయత్నించినా బాలకృష్ణను కలవలేకపోయారు. ప్రత్యేక విమానం ఏర్పాటు చేసి ఆర్.నారాయణమూర్తితో సహా దర్శకనిర్మాతలు, హీరోలు సీఎంను కలిశాం. సీఎంతో సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని వివరించాను. సినీ పరిశ్రమకు ప్రభుత్వ సహకారం అందించాలని కోరాం. అప్పుడు అక్కడున్న వారందరూ సాక్ష్యమే. నేను చొరవ తీసుకోవడం వల్లే ప్రభుత్వం టికెట్ల ధరల పెంపునకు అంగీకరించింది. ప్రభుత్వ నిర్ణయం సినీ పరిశ్రమకు ఎంతో కొంత మేలు చేసింది. ‘వీరసింహా రెడ్డి’, ‘వాల్తేరు వీరయ్య’ చిత్రాలకు టికెట్ ధరలు పెరిగాయి. నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్లు లాభం చేకూరింది. ముఖ్యమంత్రితో నైనా, సామాన్యుడితో నైనా సహజ సిద్థమైన ధోరణిలో మాట్లాడుతా. పరస్పరం గౌరవం ఇచ్చిపుచ్చుకునే విధానంలోనే మాట్లాడతా. ప్రస్తుతం నేను ఇండియాలో నేను కనుక పత్రికా ప్రకటన ద్వారా జరిగిన దాన్ని అందరికీ తెలియచేస్తున్నాను’ అని పేర్కొన్నారు.