Chiranjeevi: ఇంటి ఇష్యూ.. తెలంగాణ హైకోర్టు మెట్లెక్కిన చిరంజీవి
ABN, Publish Date - Jul 15 , 2025 | 02:46 PM
మెగాస్టార్ చిరంజీవి ఇంటికి సంబంధించిన విషయంలో తెలంగాణ హైకోర్టు జీహెచ్‌ఎంసీ కీలక ఆదేశాలు జారీ చేసింది.
మెగాస్టార్ చిరంజీవి ఇంటికి సంబంధించిన విషయంలో తెలంగాణ హైకోర్టు జీహెచ్‌ఎంసీ కీలక ఆదేశాలు జారీ చేసింది. అయితే గతంలో చిరంజీవి (Chiranjeevi) జూబ్లీహిల్స్‌లోని తన ఇంటి పునరుద్ధరణలో భాగంగా చేపట్టిన నిర్మాణాలను పరిశీలించి.. క్రమబద్దీకరణ చేయాలనీ జీహెచ్‌ఎంసీ (గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్)కి దరఖాస్తు చేసుకున్నారు. కానీ, చాలా కాలంగా జీహెచ్‌ఎంసీ దీనిపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో చిరంజీవి హైకోర్టు (High Court for the State of Telangana)ను ఆశ్రయించారు. తన దరఖాస్తును త్వరగా పరిష్కరించాలని కోరుతూ పిటిషన్ వేశారు.
ఈమేరకు జస్టిస్ బీ విజయ్‌సేన్‌రెడ్డి ఇటీవలే దీనిపై విచారణ జరపగా ఇరుతరుపు న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. పిటీషనర్ తరపు న్యాయవాది.. 2022లో ఇంటి పునరుద్ధరణలో భాగంగా జీ+2 నిర్మాణానికి జీహెచ్‌ఎంసీ నుంచి అనుమతి తీసుకున్నట్లు తెలిపారు. ఆ తర్వాత నిర్మాణాన్ని తనిఖీ చేసి క్రమబద్ధీకరన చేయాలని కోరగా అధికారులు పట్టించుకోలేదని న్యాయస్థానికి వివరించాడు. మరోవైపు జీహెచ్‌ఎంసీ తరపు న్యాయవాది చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. వాదోపవాదనలు విన్న హైకోర్టు చిరంజీవి దరఖాస్తును చట్టం ప్రకారం నాలుగు వారాల్లోగా పరిశీలించి తగు నిర్ణయం తీసుకోవాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ను ఆదేశించింది.