సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Vaaranaasi: వారణాసిలో ఛిన్నమస్తా దేవి.. ఎవరీ దేవత.. అంత భయంకరంగా ఎందుకు ఉంది

ABN, Publish Date - Nov 21 , 2025 | 09:46 AM

దర్శక ధీరుడు రాజమౌళి (Rajamouli) ఒక సినిమా తెరకెక్కిస్తున్నాడు అంటే.. అది మొదలైనప్పటి నుంచి రిలీజ్ అయ్యి థియేటర్ నుంచి బయటకు వెళ్లిపోయేవరకు దాని గురించే మాట్లాడుకోవాలి.

Vaaranaasi

Vaaranaasi: దర్శక ధీరుడు రాజమౌళి (Rajamouli) ఒక సినిమా తెరకెక్కిస్తున్నాడు అంటే.. అది మొదలైనప్పటి నుంచి రిలీజ్ అయ్యి థియేటర్ నుంచి బయటకు వెళ్లిపోయేవరకు దాని గురించే మాట్లాడుకోవాలి. అలా ప్రమోషన్స్ చేస్తాడు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. బాహుబలి సినిమా చివరలో కట్టప్ప బహుబాలిని ఎందుకు చంపాడు అనే ఒక్క డైలాగ్ తో బాహుబలి 2 రిలీజ్ అయ్యేవరకు మాట్లాడుకున్నారు అని చెప్పడంలో ఆశ్చర్యం లేదు.

ఇక ఇప్పుడు జక్కన్న.. మహేష్ బాబుతో కలిసి వారణాసి సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇక ఈ మధ్యనే ఈ సినిమా టైటిల్ గ్లింప్స్ ను రిలీజ్ చేశారు. అందరిలా వీడియోని రిలీజ్ చేయకుండా సినిమా కథను తెలిపే ప్లేసెస్, షాట్స్ ను చూపించి వారణాసి టైటిల్ ను రిలీజ్ చేశారు. ఇక ఈ గ్లింప్స్ అంతా బావుంది. కానీ, అందులో ఒక్క షాట్ ఇండస్ట్రీ మొత్తాన్ని షేక్ చేసింది. అదే ఒక దేవత షాట్.. ఆ దేవత చాలా భయంకరంగా కనిపిస్తుంది. నగ్నంగా ఉన్న ఆ దేవత ఒక చేతిలో కత్తి.. ఇంకో చేతిలో తన తలను పట్టుకొని.. సంభోగంలో ఉన్న స్త్రీపురుషల మీద కాళ్లు పెట్టి.. తన మెడ నుంచి మూడు రక్తధారల్లో.. రెండు కింద ఉన్న ఇద్దరు ఆడవారు చెరో వైపు తాగుతుండగా.. మూడో రక్తధార.. డైరెక్ట్ గా చేతిలో ఉన్న తల నోట్లోకి వెళ్తున్నట్లు కనిపించింది.

నిజంగా ఏ దేవతను ప్రజలు ఇంత భయంకరంగా చూసి ఉండరు. దీంతో ఆమె ఎవరు.. ? అసలు ఆమె కథ ఏంటి.. ? ఇంత భయంకరంగా ఎందుకు ఉంది.. ? అని ఆరాలు తీయడం మొదలుపెట్టారు. ఇక దేవతలందరిలో చాలా పవర్ ఫుల్ దేవతగా కొలవబడే ఛిన్నమస్తా దేవినే ఆ షాట్ లో కనిపించే దేవత. ఈమె గురించి చాలా మందికి తెలియదు. కానీ, పురాణాల్లో ఆమె గురించి చాలా గొప్పగా చెప్పుకొచ్చారు. అసలు ఆమె ఇలా కనిపించడం వెనుక చాలా పెద్ద కథ ఉంది.

ఛిన్నా అంటే ఖండించినా అని అర్ధం.. మస్తా అంటే తల.. తన తలను తానే ఖండించుకోవడంతో ఆమెకు ఛిన్నమస్తా దేవి అనే పేరు వచ్చింది. ఇక అలా ఖండించడం వెనుక ఉన్న కథను చాలామంది చాలారకాలుగా చెప్పుకొస్తారు. అందులో ఒకటి.. మందాకినీ నదిలో పార్వతి దేవి స్నానం ఆచరిస్తుండగా ఆ నీటిలో ఉన్న మాయనో ఏమో తెలియదు కానీ దేవికి కామ కోరిక రగులుతూ ఉంటుంది. సమయం కానీ సమయంలో ఇలాంటి కోరిక రావడంతో పార్వతి దేవి కోపోద్రికురాలు అవుతుంది. ఇంకోపక్క తనతో పాటు స్నానం ఆచరిస్తున్న చెలికత్తెలు అయిన డాకిని, వర్ణినిలకు తీవ్ర ఆకలి వేస్తుంటుంది. వారు దేవిని తమకు చాలా ఆకలి వేస్తుందని అడుగుతారు.

ఇక అన్నపూర్ణాదేవి అయిన పార్వతి దేవి.. ఆకలి అన్నవారి ఆకలి తీర్చడానికి తనను తానే ఆహారంగా మార్చుకుంది. శరీరంలో రగులుతున్న కామాన్ని ఆపడానికి.. రతీ మన్మథుల శరీరాల మీద నిలబడి.. తన తలను తానే ఖండించుకొని.. డాకిని, వర్ణినిలకు రక్తాన్ని ఇచ్చి ఆకలి తీరుస్తోంది. మరో రక్తధార నేలమీద పడితే.. తన రక్తంతో సృష్టి నాశనం అవుతుందని.. తన నోటికే ఆ రక్తధారను అందిస్తుంది. పార్వతి దేవిని అలా చూస్తే ఎవరికైనా గగుర్పాటు పుడుతుంది అని చెప్పొచ్చు.

పార్వతి దేవి యొక్క ఈ రూపాన్ని రౌద్ర రూపంగా పూజిస్తారు. సృష్టి- వినాశనం రెండు ఒకేసారి చూపిస్తూ ఉంటుంది. ఇక ఈ దేవతను ఎక్కువగా తంత్ర విద్యలు అభ్యసించేవాళ్ళు పూజిస్తారు. భూత భవిష్యత్ కాలాలను చూసే శక్తిని ఈ దేవత ప్రసాదిస్తుంది. అలా తెలుసుకోవాలనుకొనేవారు ఈ దేవతను పూజిస్తారు. ఎలాంటి శక్తిమంతులను అయినా చీల్చి చెండాడే శక్తిని ఆమె ప్రసాదిస్తుంది.

ఇక వారణాసికి ఛిన్నమస్తా దేవికి సంబంధం ఏంటి అంటే.. రణ కుంభ( పృథ్వీరాజ్ సుకుమారన్) ఈ సినిమాలో ఒక తంత్ర విద్యను అభ్యసిస్తాడు. అందులో భాగంగానే ఈ దేవతకు పూజ చేస్తాడు. ఇక ఆ శక్తితో మందాకినీ(ప్రియాంక చోప్రా)ను అంతమొందించే ప్రయత్నంలో రుద్ర( మహేష్ బాబు) ఆమెను కాపాడడానికి వస్తాడు..అని నెటిజన్స్ చెప్పుకుంటున్నారు. మరి ఇందులో నిజం ఎంత అనేది తెలియాలంటే సినిమా వచ్చేవరకు ఆగాల్సిందే.

Updated Date - Nov 21 , 2025 | 10:25 AM