NTR - Balakrishna: చిలుకలూరి పేటలో నందమూరి హవా
ABN , Publish Date - Jul 05 , 2025 | 05:32 PM
ప్రస్తుతం బాలకృష్ణకు అరుదైన రికార్డును అందించిన డాకూ మహరాజ్ చిలుకలూరి పేటలోనే సిల్వర్ జూబ్లీ జరుపుకోవడంతో నందమూరి అభిమానులు గత వైభవాన్నీ మననం చేసుకుంటున్నారు. చిలుకలూరి పేటలో పలు మొదటి విజయోత్సవాలకు నందమూరి ఫ్యామిలీ అంకురార్పణ చేయడం విశేషం!
చిలుకలూరి పేట కేంద్రంలో తొలిసారి వంద రోజులు చూసిన చిత్రం 'గుండమ్మ కథ' (Gundamma Kadha). ఇందులో మరో హీరోగా ఏయన్నార్ (ANR) ఉన్నప్పటికీ ఈ చిత్రం యన్టీఆర్ (NTR) 100వ సినిమా విజయఢంకా మోగించడంతో క్రెడిట్ రామారావుకే దక్కింది. ఈ సినిమా లేట్ రిలీజ్ లో చిలుకలూరి పేటలోని విశ్వనాథ్ థియేటర్ లో శతదినోత్సవం జరుపుకుంది. అదే యేడాది యన్టీఆర్ 'లవకుశ' (Lavakusa) కూడా ఆలస్యంగానే విడుదలై చిలుకలూరి పేటలోని నాగార్జున కళామందిర్ లో నూరు రోజులు ప్రదర్శితం కావడం విశేషం! ఒకటిన్నర దశాబ్దం తరువాత 1979లో మళ్ళీ యన్టీఆర్ 'వేటగాడు'తోనే చిలుకలూరి పేట డైరెక్ట్ హండ్రెడ్ డేస్ చూడడం విశేషం! మధ్యలో ఏ సినిమా కూడా ఇక్కడ వంద రోజులు ప్రదర్శితం కాలేదు.ఇక చిలుకలూరి పేటలో తొలి రజతోత్సవ చిత్రంగా యన్టీఆర్ 'కొండవీటి సింహం' నిలచింది. ఈ సినిమా వెంకటేశ్వర థియేటర్ లో రోజూ 3 ఆటలతో 177 రోజులు ప్రదర్శితమై మరో 12 రోజులు ఉదయం ఆటలతో సాగి మొత్తం 189 రోజులు పూర్తి చేసుకుంది. ఇక యన్టీఆర్ నటించిన "జస్టిస్ చౌదరి, బొబ్బిలిపులి, చండశాసనుడు, బ్రహ్మంగారి చరిత్ర" చిత్రాలు నూన్ షోస్ తో శతదినోత్సవాలు చూశాయి. యన్టీఆర్ చిత్రసీమలో ఉండగా చిలుకలూరి పేటలో అత్యధిక శతదినోత్సవాలు కలిగిన ఏకైక హీరోగా ఉన్నారు. ఇదే కేంద్రంలో ఏయన్నార్ 'ప్రేమాభిషేకం' నూన్ షోస్ తో వంద రోజులు చూసింది.
తరువాతి రోజుల్లో డైరెక్ట్ గా రెగ్యులర్ షోస్ తో వంద రోజులు చూసిన సినిమాగా నాగార్జున 'శివ' (Siva) నిలచింది. చిలుకలూరి పేటలోని విశ్వనాథ్ లో 'శివ' శతదినోత్సవం చూసింది. తరువాత చిరంజీవి (Chiranjeevi) 'జగదేకవీరుడు - అతిలోకసుందరి' చిత్రం నాగార్జున కళామందిర్ లో రెగ్యులర్ షోస్ తో వంద పూర్తి చేసుకుంది. బాలకృష్ణకు ఈ సెంటర్ లో రెగ్యులర్ షోస్ తో 100 రోజులు చూసిన తొలి చిత్రం 'పెద్దన్నయ్య'. అంతకు ముందు బాలయ్య 'రౌడీ ఇన్ స్పెక్టర్' సింగిల్ షిఫ్ట్ తో నూరు రోజులు పూర్తి చేసుకుంది. 'పెద్దన్నయ్య' వంద రోజులు ఆడిన తరువాత నుంచీ చిరంజీవి, వెంకటేశ్, నాగార్జున వంటి హీరోల సినిమాలు కూడా వరుసగా చిలుకలూరి పేటలో శతదినోత్సవాలు చూడడం ఊపందుకుంది. ఇక చిలుకలూరి పేటలో రోజూ 4 ఆటలతో సిల్వర్ జూబ్లీ చూసిన మొదటి చిత్రంగా బాలకృష్ణ 'సమరసింహారెడ్డి' నిలచింది. నాగార్జున కళామందిర్ లో 'సమరసింహారెడ్డి' 177 రోజులు ప్రదర్శితమయింది. తరువాత నాగార్జున కళామందిర్ లోనే చిరంజీవి 'ఇంద్ర' 175 రోజులు నాలుగు ఆటలతో ఆడింది. జూనియర్ యన్టీఆర్ 'సింహాద్రి' కూడా అదే నాగార్జున కళామందిర్ లో రోజూ 4 ఆటలతో 175 రోజులు చూసింది. ఈ సెంటర్ లో రామకృష్ణ థియేటర్ లో మహేశ్ బాబు 'పోకిరి' నూన్ షోస్ తో సిల్వర్ జూబ్లీ జరుపుకుంది.
చిలుకలూరి పేట సెంటర్ లో తరువాత ఎంతోమంది యంగ్ హీరోస్ మూవీస్ సైతం వంద రోజులు ప్రదర్శితమయ్యాయి. అయితే 'అఖండ' (Akhanda) చిత్రం రామకృష్ణ థియేటర్ లో రోజూ 4 ఆటలతో 181 రోజులు పూర్తి చేసుకుంది. అదే కేంద్రంలో రామకృష్ణ థియేటర్ లో రోజూ 4 ఆటలతో 'భగవంత్ కేసరి' (Bhagawanth Kesari) 211 రోజులు ప్రదర్శితమయింది. ఇప్పుడు చిలుకలూరి పేటలోనే వెంకటేశ్వర థియేటర్ లో రోజూ 4 ఆటలతో 'డాకూ మహరాజ్' (Daku Maharaaj) 175 రోజులు పూర్తి చేసుకోవడం విశేషం! అలా చిలుకలూరి పేటలో మొత్తం నాలుగు చిత్రాలు (సమరసింహారెడ్డి, అఖండ, భగవంత్ కేసరి, డాకూ మహరాజ్) రోజూ 4 ఆటలతో సిల్వర్ జూబ్లీ జరుపుకోవడం ఓ అరుదైన రికార్డ్ గా నిలచింది. అలాగే నందమూరి ఫ్యామిలీలోని మూడు తరాల హీరోలు ఈ కేంద్రంలో రెగ్యులర్ షోస్ తో డైరెక్ట్ సిల్వర్ జూబ్లీస్ చూడడం కూడా ఓ అరుదైన అంశమనే చెప్పాలి.
Also Read: Nandamuri Balakrishna: బాలయ్యా... మజాకా...
Also Read: Fish Venkat: ప్రభాస్ సాయం.. అంతా మోసం