Peddi: పెద్ది చికిరి చికిరి.. పాట వచ్చేసింది! ఆ తప్పులు.. కాస్త చూసుకోవాలిగా మాస్టారు
ABN, Publish Date - Nov 07 , 2025 | 12:16 PM
తెలుగు ప్రజలు చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్న చిత్రం పెద్ది (Peddi) సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ చికిరి చికిరి వచ్చేసింది.
తెలుగు ప్రజలు చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్న చిత్రం పెద్ది (Peddi). వచ్చే మార్చిలో ప్రేక్షకుల ఎదుటకు రానుంది. ఈక్రమంలో ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ విడుదల చేస్తున్నట్లు ఇటీవల ప్రకటించిన మేకర్స్ ఓ వీడియో సైతం క్రియేట్ చేసి మంచి హైప్ తీసుకు వచ్చారు. ఈ వీడియో కాస్త ప్రజల్లోకి వెళ్లి సోషల్ మీడియాను దున్నేయడం ప్రారంభించింది. ముఖ్యంగా రామ్ చరణ్ (Ram Charan) స్టెప్పును లక్షల మంది రీ క్రియేట్ చేసి సామాజిక మాధ్యమాలకు పట్టిన బూజును దులిపేశారు.
ఈ నేపథ్యంలో తాజాగా శుక్రవారం ఉదయం చికిరి చికిర అంటూ సాగే పూర్తి పాటను విడుదల చేశారు. ఈ పాటకు బాలాజీ సాహిత్యం అందించగా అస్కార్ విన్నర్ రెహమాన్ (AR Rahman) స్వర కల్పనలో మోహిత్ చౌహన్ (Mohit Chauhan) ఆలపించాడు. జానీ మాస్టర్ నృత్యం సమకూర్చాడు. ఓ మారుమూల పల్లె యువకుడు తను చూసిన అమ్మాయిని గుర్తు చేసుకుంటూ ఆమె అందాన్ని పొగుడుతూ ఈ పాట సాగింది.
నాలుగున్నర నిమిషాలకు పైగా ఉన్న పాట డాన్స్, విజువల్స్‌తో వీక్షకులను, పాటతో శ్రోతలను ఇట్టే ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు. మధ్యలో కథానాయిక పరువాలను, ఒంపుసొంపులను సైతం కొత్త తరహాలో ప్రజంట్ చేసి ఆడియన్స్‌కు మంచి కిక్ ఇచ్చారనడంలో సందేహం లేదు. జాన్వీ సైతం సమాజ అందంతో మంత్రముగ్గులను చేసింది. పాట అసాంతం సిగ్నేచర్ స్టెప్స్, క్రికెట్ షాట్లను కూడా మిక్స్ చేసిన విధానం అదరహో అనేలా ఉంది. అంతేగాక శ్రీలంకలోని ప్రకృతి దృశ్యాలు సైతం అబ్బుర పరిచేలా ఉన్నాయి.
అయితే.. పాటలో కొన్ని పదాల్లో మాత్రం ఆక్షర దోషాలు దొర్లినప్పుడు స్పష్టంగా తెలుస్తుంది, వినిపిస్తుంది. అంతేగాక పాట బ్యాగ్రౌండ్ మ్యూజిక్ సైతం చాలా స్పీడ్‌గా సాగినట్లు అనిపించి, చివరకు ఎదో తెలియని అసంతృప్తి, పాట ఇంతసేపు ఉందేంటి అనే భావన కలిగేలా ఉంది. మీరూ ఓ సారి వినండి. మీకూ తెలుస్తుంది. కాగా ఈ వీడియో సాంగ్‌లో సంగీత దర్శకుడు రెహమాన్, గాయకుడు చౌహాన్, దర్శకుడు బుచ్చిబాబు కూడా కాసేపు కనిపించి మెప్పించారు. అయితే.. ఈ పాట ఒక సారి కాదు నాలుగైదు మార్లు వింటే ఎక్కడం ఖాయమనేలా ఉండడం విశేషం.