Siva Shakthi Datta: శివశక్తి దత్తకు ప్రముఖుల నివాళి..
ABN, Publish Date - Jul 08 , 2025 | 01:27 PM
ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి తండ్రి, రచయిత శివశక్తి దత్తా సోమవారం కన్నుమూశారు. ఆయన మరణం తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని లోటని సినీ ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు.
ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి తండ్రి(MM Keeravani Father) రచయిత శివశక్తి దత్తా (Siva Shakthi Datta) సోమవారం కన్నుమూశారు. రైతు కుటుంబం నుంచి వచ్చిన ఆయన ‘కళ లేనిదే నా జీవితం లేదు’ అంటూ చిన్నప్పటినుంచే కళపై మక్కువ పెంచుకున్నారు. అర్ధాంగి, చంద్రహాస్ సినిమాలకు దర్శకత్వం వహించారు. టాలీవుడ్‌లో ఎన్నో హిట్ పాటలకు ఆయన సాహిత్యం అందించారు. ఆయన మరణం తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని లోటని సినీ ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు. రాజమౌళి, మహేశ్‌బాబు, గుణ్ణం గంగరాజు తదితరులు ఆయన ఇంటికి చేరుకుని నివాళులు అర్పించారు.
శివశక్తి దత్త మరణవార్త తెలుసుకున్న చిరంజీవి (Chiranjeevi) తీవ్ర దిగ్ర్భాంతికి గురయ్యారు. సోషల్ మీడియా వేదికగా ఆయనకు నివాళులు అర్పించారు. చిత్రకారుడు, సంస్కృత భాషా సంపన్నుడు, రచయిత, బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన శ్రీ శివశక్తి దత్తగారు శివైక్యం చెందారన్న వార్త నన్ను దిగ్భ్రాంతి కి గురిచేసింది. వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుణ్ణి ప్రార్ధిస్తూ, మిత్రుడు కీరవాణి గారికి, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను’’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు.
అలాగే యువ సంగీత దర్శకుడు హరి గౌర ఆయనతో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు.
మీరు నాకు చెప్పిన కథలు..
నేను మీతో పంచుకున్న కవితలు..
మీరు నాకు ఆప్యాయంగా వడ్డించిన భోజనం..
నేను మీతో పంచుకున్న సంగీతం..
మీరు ఆసువుగా రాసి ఇచ్చిన అంజనాద్రిపై అనే సాహిత్యం..
అది పామరుడైన నావంటి వాడు సైతం బాణీ కట్టగలిగేంత సులువుగా, రాయగలిగేంత లాలిత్యం..
మనము ఒకరికొకరం పంచుకున్న కొన్ని మనోగతాలు ఇవి ఏ జన్మ రుణానుబంధం 'సుబ్బారావు' గారు. అంటూ భావోద్వేగానికి లోనయ్యారు.