Kantara Chapter 1: తెలుగోళ్ల ఆగ్రహం.. ట్రెండ్‌లో ‘బాయ్‌కాట్ కాంతార చాప్టర్ 1’
ABN, Publish Date - Sep 29 , 2025 | 01:01 PM
తెలుగు సినిమాలపై కర్ణాటకలో అడ్డంకులపై ఆగ్రహం ఉధృతమైంది. రిషబ్ శెట్టి నటించిన కాంతార చాప్టర్ 1పై #BoycottKantaraChapter1 ట్రెండ్ అవుతోంది.
కర్ణాటకలో గత కొంతకాలంగా ఇతర భాషా సినిమాల విషయంలో కన్నడ (Kannada) భాషా ఉద్యమం పేరుతో చేస్తున్న రాద్దాంతం ఇప్పుడు అటు తిరిగి ఇటు తిరిగి వాళ్లకే తగిలింది. ముఖ్యంగా తెలుగు సినిమాలకు అక్కడ వరుస అడ్డంకులు ఎదురవుతుండటంతో, తెలుగు ప్రేక్షకుల్లో ఆగ్రహం ఉధృతమవుతోంది. తెలుగు సహా, ఇతర ఏ బాషాల నుంచి సినిమా వచ్చినా క్ననడలో పేరు లేదంటూ కొంతమంది అందోళన కారులు థియేటర్ల వద్ద నిరసనలకు దిగుతున్నారు. సంబంధిత పోస్టర్లుకు పెయింట్ పూయడం లేకుంటే పూర్తిగా చించి వేయడం చేస్తూ నానా యాగీ చేసి సినిమా కలెక్షన్ల విషయంలో తీవ్ర సమస్యలు వచ్చేలా చేస్తున్నారు.
రీసెంట్‌గా పవన్ కల్యాణ్ హరిహర వీరమల్లు, ఓజీ సినిమాల విషయంలోనూ కన్నడ నాట నుంచి ఇలాంటి వ్యతిరేఖతే ఎదురైంది. ఓజీ పోస్టర్లు, బ్యానర్లు తగులబెట్టారు. ఈ విషయం కాస్త తెలుగు ప్రేక్షకులను తీవ్రంగా ముఖ్యంగా పవన్ ఫ్యాన్స్‌ను తీవ్రంగా నొప్పించింది. దీంతో తెలుగు నెటిజన్లు సైతం యాక్టీవ్ అయి ఒక తాటిపైకి వచ్చి మనం కూడా కన్నడ సినిమాలను ఇలానే అడ్డకోవాలి, ఇక్కడికి ప్రమోషన్లకు వస్తే తెలుగులోనే మాట్లాడాలంటూ నినాదం తీసుకున్నారు. మరుక్షణమే ఆచరణలో పెట్టి “మన సినిమాలను కర్ణాటకలో అడ్డుకుంటే, మనం వారి సినిమాలను ఎందుకు ప్రోత్సహించాలి?”. అంటూ #BoycottKantaraChapter1 హ్యాష్‌ట్యాగ్ సోషల్ మీడియాలో వేగంగా ట్రెండ్ చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో సరిగ్గా మరో రెండు రోజుల్లో రిషబ్ శెట్టి నటించిన ‘కాంతార చాప్టర్ 1’ ( Kantara Chapter 1) అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుండగా ఇప్పుడు ఈ చిత్రాన్ని తెలుగు వారు అంతా బాయ్‌కాట్ చేయాలని సోషల్ మీడియాలో భారీ ఎత్తున పిలుపును ఇస్తున్నారు. దానికి తోడు తాజాగా ఆదివారం జరిగిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్‌లో దాదాపు రిషబ్ భార్య ప్రగతి , కథానాయిక రుక్మిణీ సహా అంతా తెలుగులో మాట్లాడినా హీరో మాత్రం కన్నడలో మాట్లాడం ప్రస్తుతం సమస్యకు అగ్గి రాజేసినట్లైంది. దీంతో నెటిజన్లు ఓ రేంజ్‌లో రిషబ్‌ను, కన్నడ సినిమాలను ట్రోల్ చేస్తున్నారు.
“మాకూ టైమ్ వచ్చింది, మన సత్తా చూపిద్దాం. కాంతారను బాయ్‌కాట్ చేయడం ద్వారా టాలీవుడ్ ఐకమత్యం చూపించాలి అంటూ పిలుపునిస్తున్నారు. అయితే.. ఇదే అదనుగా కొంతమంది యాంటి ఎన్టీఆర్ ఫ్యాన్స్ సైతం రంగంలోకి దిగి జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR)పై విమర్శలు చేస్తున్నారు. “మన సినిమాలను కన్నడ వాళ్లు అడ్డుకుంటుంటే ఆయన ఎందుకు వారి సినిమాల ఈవెంట్లకు వెళ్తారు?” అంటూ కావాలని ట్రోల్స్ చేస్తున్నారు. అయితే.. దీనికి జూనియర్ ఫ్యాన్స్ గట్టిగానే బదులిస్తున్నారు. కాంతారాను అడ్డుకుంటే ఓజీకి అడ్డు ఉండదని, కలెక్షన్లు నిలబడుతాయని కొత్తగా ఈ ఫ్లాన్ ముందు వేసుకున్నారని పోస్టులు పెడుతున్నారు. లేకుంటే గత ఐదారేండ్లుగా కన్నడ నాట ఈ సమస్య ఉంటే వీళ్లకు ఇప్పుడే తెలుగు సినిమాలకు అవమానం జరుగుతుందని గుర్తొచ్చిందా, ఈ మధ్య వచ్చిన తమిళ సినిమాల విడుదల సమయంలో ఎందుకఈ బాయ్‌కాట్ తీసుకురాలేదు అంటూ రివర్స్ లో పోస్టులు పెడుతున్నారు.
ఇదిలాఉంటే.. గతంలో వచ్చిన కాంతార సినిమా జాతీయ స్థాయిలో భారీ విజయాన్ని సాధించింది. అదే జోష్‌లో రిషబ్ శెట్టి ఈసారి అంతకుమించి అనే రేంజ్‌లో ప్రీక్వెల్‌గా కాంతార చాప్టర్ 1 తీసుకొస్తున్నారు. ఈ సినిమా కోసం దేశవ్యాప్తంగా విపరీతమైన ఆసక్తి నెలకొని ఉంది. అయితే తెలుగు నెటిజన్ల బాయ్‌కాట్ పిలుపు ఈ హైప్‌పై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి. ఒకవైపు కన్నడ అభిమానులు తమ భాషా, గౌరవం మన సినిమాలపై పడడం, మరోవైపు తెలుగు ప్రేక్షకులు తమ సినిమాల గౌరవం కోసం బాయ్‌కాట్ బాట పట్టారు. ఈ వివాదం కాంతార చాప్టర్ 1 కలెక్షన్లపై ఎంత ప్రభావం చూపుతుందో, లేక ఈ హడావుడి అంతా కేవలం సోషల్ మీడియా స్థాయిలోనే ఆగిపోతుందో అనేది ఎదురు చూడాల్సిన అంశం.