NTRNEEL: ఎన్టీఆర్ కోసం యానిమల్ ఫాదర్ ని దింపిన నీల్..
ABN, Publish Date - Nov 29 , 2025 | 06:22 PM
ప్రశాంత్ నీల్ (Prashanth Neel) తెరకెక్కించిన 'కేజీఎఫ్'(KGF) రెండు భాగాలు పాన్ ఇండియా మూవీస్ గా రిలీజై ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఆ తరువాత సలార్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నీల్.. ప్రస్తుతం ఎన్టీఆర్ తో ఒక సినిమా చేస్తున్నాడు.
NTRNEEL: ప్రశాంత్ నీల్ (Prashanth Neel) తెరకెక్కించిన 'కేజీఎఫ్'(KGF) రెండు భాగాలు పాన్ ఇండియా మూవీస్ గా రిలీజై ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఆ తరువాత సలార్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నీల్.. ప్రస్తుతం ఎన్టీఆర్ తో ఒక సినిమా చేస్తున్నాడు. మొదట్లో యన్టీఆర్(NTR) - ప్రశాంత్ నీల్ మూవీకి 'డ్రాగన్ (Dragon)' అన్న టైటిల్ విశేషంగా వినిపించింది. అయితే ఎందువల్లో ప్రస్తుతం 'యన్టీఆర్-నీల్ మూవీ'గానే ఈ ప్రాజెక్ట్ ను పిలుస్తున్నారు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ తో కలసి యన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో రుక్మిణీ వసంత్ నాయికగా నటించనుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది.
తాజాగా యన్టీఆర్ - నీల్ సినిమా గురించి ఒక వార్త సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. దాదాపు నలభై ఐదేళ్ళ తరువాత బాలీవుడ్ సీనియర్ స్టార్ అనిల్ కపూర్ .. యన్టీఆర్- నీల్ సినిమాతో తెలుగులో రీఎంట్రీ ఇస్తున్నాడట. ఒకప్పుడు బాలీవుడ్ లో టాప్ స్టార్ గా రాజ్యమేలిన అనిల్ కపూర్ తొలిసారి ఫుల్ లెన్త్ రోల్ లో కనిపించిన చిత్రం తెలుగు మూవీ కావడం విశేషం. బాపు దర్శకత్వంలో తెరకెక్కిన 'వంశవృక్షం'లో అనిల్ కపూర్ మొదటిసారి కీలక పాత్ర ధరించారు. ఈ సినిమా తరువాతే బాపు తెరకెక్కించిన హిందీ సినిమా 'హమ్ పాంచ్', 'వో సాత్ దిన్' చిత్రాల్లో కీ రోల్స్ లో అలరించారు అనిల్ కపూర్ .. ఈ సినిమాలతోనే అనిల్ కు మంచి గుర్తింపు లభించింది... అలా 45 ఏళ్ళ క్రితం తెలుగు సినిమాతోనే నటునిగా వెలుగు చూసిన అనిల్ కపూర్ ఇన్నేళ్ళకు ఓ తెలుగు మూవీలో నటించబోవడం విశేషంగా మారింది.
ఇప్పటికే యానిమల్ సినిమాలో రణబీర్ కపూర్ కు తండ్రిగా నటించి మెప్పించిన అనిల్ కపూర్.. ఇప్పుడు యన్టీఆర్ - నీల్ సినిమాలో ఎంతో కీలకమైన పాత్ర చేయబోతున్నాడట. అనిల్ కపూర్ తో యన్టీఆర్ నటించే రెండో చిత్రమిదే అవుతుంది. ఇంతకు ముందు హిందీ మూవీ 'వార్-2'లో అనిల్ కపూర్ తో యన్టీఆర్ నటించిన సంగతి తెలిసిందే. ఆ సినిమా పరాజయం పాలయినా, ఉత్తరాదిన యన్టీఆర్ కు క్రేజ్ సంపాదించి పెట్టింది. అలాగే అనిల్ కపూర్ లాంటి సీనియర్ ఆర్టిస్ట్ ధరించవలసిన పాత్ర ఉన్నందున నీల్ ఆయనను ఎంచుకున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే 'కేజీఎఫ్' రెండో భాగంలో ఓ నాటి బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ ను విలన్ గా నటింప చేశారు నీల్. మరి యన్టీఆర్ తో తాను తీస్తోన్న చిత్రంలో అనిల్ కపూర్ తో ఏలాంటి కేరెక్టర్ వేయిస్తారో అన్న ఆసక్తి కలుగుతోంది... 'వార్ 2'లో అనిల్ కపూర్ పాజిటివ్ కేరెక్టర్ లోనే కనిపించారు. అందువల్ల ఈ సారి యన్టీఆర్ తో అనిల్ కపూర్ నటించనున్న సినిమాలో విలక్షణమైన పాత్రలో కనిపిస్తారనీ ఇన్ సైడ్ టాక్. మరి యన్టీఆర్-నీల్ మూవీలో అనిల్ కపూర్ ఏ తరహా పాత్రలో అలరిస్తారో చూడాలి.