Dhruv Vikram: కబడ్డీ నేర్చుకుని.. బైసన్ సినిమా చేశా
ABN, Publish Date - Oct 21 , 2025 | 08:00 PM
ధృవ్ విక్రమ్, అనుపమ పరమేశ్వరన్ నటించిన “బైసన్” సినిమా అక్టోబర్ 24న తెలుగులో రిలీజ్ కానుంది. మారి సెల్వరాజ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం తమిళంలో హిట్ అవగా, ఇప్పుడు తెలుగు ఆడియెన్స్‌ను ఆకట్టుకోవడానికి సిద్ధంగా ఉంది.
తమిళంలో ఘన విజయాన్ని సాధించిన బైసన్ (Bison) సినిమా ఇప్పుడు తెలుగులో ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్ధమైంది. అప్లాజ్ ఎంటర్టైన్మెంట్స్, నీలం స్టూడియోస్ బ్యానర్‌పై పా. రంజిత్ సమర్పణలో, సమీర్ నాయర్, దీపక్ సెగల్, పా. రంజిత్, అదితి ఆనంద్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రాన్ని మారి సెల్వరాజ్ (Mari Selvaraj) తెరకెక్కించారు. హీరోగా ధృవ్ విక్రమ్ (Dhruv Vikram), హీరోయిన్‌గా అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) నటించారు. సంగీతం నివాస్ కె. ప్రసన్న అందించారు. ఈ చిత్రాన్ని తెలుగులో జగదంబే ఫిల్మ్స్ బ్యానర్ ద్వారా అక్టోబర్ 24న విడుదల చేయనున్నారు.
ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన ప్రెస్ మీట్‌లో చిత్ర బృందం తమ అనుభవాలు పంచుకున్నారు. ఈ సందర్భంగా హీరో ధృవ్ విక్రమ్ మాట్లాడుతూ .. తెలుగులో బైసన్ ప్రమోషన్ కోసం హైదరాబాదుకు రావడం నాకు చాలా స్పెషల్. ఈ సినిమాలో నేను మూడు సంవత్సరాలు కష్టపడ్డాను. కబడ్డీ నేర్చుకున్నాను. నంబర్ల గురించి కాదు, ప్రేక్షకుల ప్రేమ గురించి మాత్రమే ఆలోచిస్తున్నాను. నా నాన్న విక్రమ్ గారు ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా స్టార్ అయ్యారు. నేను కూడా ఆయనలాగే కష్టపడి, తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని పొందాలని కోరుకుంటున్నాను. అక్టోబర్ 24న మా సినిమాను తప్పకుండా చూడండి,” అని అన్నారు.
హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ మాట్లాడుతూ.. “మారి సెల్వరాజ్ గారి మొదటి సినిమా నుంచే ఆయనతో పనిచేయాలని అనుకున్నాను. ఆ అవకాశం బైసన్ ద్వారా దక్కింది. ఈ మూవీ ద్వారా చాలా నేర్చుకున్నాను. ధృవ్ ప్యాషన్, డెడికేషన్ చూసి నిజంగా ఇంప్రెస్ అయ్యాను. తమిళంలో ఇప్పటికే మంచి స్పందన వచ్చింది. ఇప్పుడు తెలుగులో కూడా పెద్ద హిట్ అవుతుందని నమ్ముతున్నాను,” అని తెలిపారు.
నిర్మాత వీపీ సెల్వన్ బాలాజీ మాట్లాడుతూ.. లింగుస్వామి, చంద్రబోస్ గార్ల సపోర్ట్ వల్లే ఈ సినిమాను తెలుగులోకి తీసుకొచ్చాం. సినిమా చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుంది. తెలుగు ప్రేక్షకుల హృదయాలను తాకుతుంది. అక్టోబర్ 24న రిలీజ్ అవుతున్న ఈ చిత్రాన్ని తప్పకుండా చూడండి అన్నారు.
సంగీత దర్శకుడు నివాస్ కె. ప్రసన్న మాట్లాడుతూ.. బైసన్ తమిళ్‌లో హిట్ అయ్యింది. ఇప్పుడు తెలుగు వర్షన్ కూడా అదే రేంజ్‌లో విజయాన్ని సాధిస్తుందని నమ్ముతున్నాను. ఈ మూవీ ద్వారా నాకు మంచి ఫ్రెండ్స్ దొరికారు. తెలుగు ఆడియెన్స్, మీడియా మా సినిమాను సపోర్ట్ చేస్తారని నమ్మకం ఉందని చెప్పారు.
మారి సెల్వరాజ్ దర్శకత్వం వహించిన బైసన్ అర్జున అవార్డు గ్రహీత మణతి గణేశన్ జీవితంపై ఆధారంగా రూపొందించ బడింది. సామాజిక భావాలు, క్రీడా స్ఫూర్తి, మానవ విలువల మేళవింపుతో తెరకెక్కిన ఈ సినిమా తమిళనాడులో హిట్ అయి, ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకోవడానికి సిద్ధమవుతోంది.