Actress: అయ్యో పాపం... భాగ్యశ్రీ బోర్సే...

ABN , Publish Date - Nov 14 , 2025 | 02:03 PM

భాగ్యశ్రీ బోర్సే మొదటి రెండు సినిమాలు కమర్షియల్ గా సక్సెస్ కాలేదు. దాంతో తన ఆశలన్నీ 'కాంత' సినిమా మీదే పెట్టుకుంది. బట్... నటిగా భాగ్యశ్రీకి మంచి పేరు తెచ్చిపెట్టిన 'కాంత' సైతం కమర్షియల్ గా సక్సెస్ కావడం కష్టమే అంటున్నారు ట్రేడ్ పండిట్స్.

Bhagyasri Borse

భాగ్యశ్రీ బోర్సే (Bhagyasri Borse)... తెలుగు సినిమా రంగానికి దక్కిన గొప్ప వరం. ఆమె ఫస్ట్ మూవీ 'మిస్టర్ బచ్చన్' (Mr Bachchan) విడుదలైనప్పుడు అందరూ ఆమెను విపరీతంగా ఆరాధించారు. గొప్ప నటి కాకపోయినా... అద్భుతంగా డాన్స్ చేసిందని మెచ్చుకున్నారు. మాస్ మహరాజా రవితేజ (Raviteja) తో పోటీ పడి ఆమె చేసిన డాన్సులు చూసి ఫిదా అయిపోయారు. ఆ సినిమా పరాజయంతో సంబంధం లేకుండానే భాగ్యశ్రీకి మరిన్ని అవకాశాలు లభించాయి. అలా ఆమె నటించగా విడుదలైన రెండో సినిమా 'కింగ్ డమ్' (Kingdom). విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) సరసన ఈ సినిమాలో డాక్టర్ పాత్రను భాగ్యశ్రీ బోర్సే పోషించింది. ఈ సినిమా కూడా కమర్షియల్ గా నిరాశ పర్చింది. అయితే నటిగా భాగ్యశ్రీ బోర్సే ఓ మెట్టు పైకి ఎక్కింది. డాన్స్ మాత్రమే కాదు... నటనలో కూడా భాగ్యశ్రీ బెటరే అని అంతా అనుకున్నారు.


ఇక తాజాగా భాగ్యశ్రీ నటించిన మూడో సినిమా 'కాంత' విడుదలైంది. ఈ సినిమాతోనే ఆమె తమిళ చిత్రసీమలోకి అడుగుపెట్టింది. చిత్రం ఏమిటంటే... భాగ్యశ్రీ బోర్సే సైన్ చేసిన మొదటి సినిమా ఇదే! ఆ తర్వాతే మిగిలిన సినిమాల్లో ఆమెకు అవకాశాలు వచ్చాయి. 1950 నేపథ్యంలో తెరకెక్కబోతున్న ఈ సినిమాలో కుమారి అనే నూతన నటి పాత్రకు ఆమె సరిగ్గా సరిపోతుందని దర్శకుడు సెల్వమణి సెల్వరాజ్ నమ్మాడు. అయితే నిర్మాతల్లో ఒకరైన రానా దగ్గుబాటి ఫస్ట్ టైమ్ భాగ్యశ్రీ బోర్సేను చూసి పెదవి విరిచాడట. అందంగానే ఉంది కానీ ఆమె దుల్కర్ సల్మాన్ తో సరి సమానంగా నటించగలదా అని అనుమాన పడ్డాడట. కానీ ఇవాళ 'కాంత' సినిమా చూసిన ప్రతి ఒక్కరూ భాగ్యశ్రీ బోర్సే నటన గురించి మాట్లాడుతున్నారు.


అలనాటి నటి సావిత్రిని తలపించేలా భాగ్యశ్రీ ఉందని, కళ్ళతోనే చక్కటి హావభావాలను ప్రదర్శించిందని కితాబిస్తున్నారు. 'కాంత' సినిమా ప్రథమార్థంలో అద్భుతంగా నటించి, మెప్పించిన భాగ్యశ్రీకి... ద్వితీయార్థంలో పెద్దంత స్కోప్ లేకపోయింది. ఫ్లాఫ్ బ్యాక్ సీన్స్ లో మాత్రమే ఆమె కనిపిస్తుంది. అయినా... ముచ్చటగా మూడో సినిమాకే ఆమె టైటిల్ రోల్ ప్లే చేయడం విశేషం. ఇటు పక్కన దుల్కర్ సల్మాన్, అటు పక్కన సముతిరకని నడుమ భాగ్యశ్రీ బోర్సే! ఇద్దరు దిగ్గజ నటుల పక్కన ఆమె ఎక్కడా తగ్గకుండా నటించి, మెప్పించింది. కానీ ఏం లాభం... భాగ్యశ్రీ శ్రమకు తగ్గ ఫలితం మాత్రం దక్కలేదు. 'కాంత' సినిమాలో నటీనటులు అద్భుతంగా నటించారనే ప్రశంసలు దక్కుతున్నా ఇది కమర్షియల్ గా సక్సెస్ అయ్యే దాఖలాలు లేవని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. సో... 'కాంత'తో అయినా సక్సెస్ ట్రాక్ ఎక్కుతానని భావించిన భాగ్యశ్రీ బోర్సే ఆశలు అడియాసలైనాయి. అయితే ఆమె నాయికగా నటించిన మరో సినిమా 'ఆంధ్ర కింగ్ తాలుకా' ఈ నెల 28న విడుదల కాబోతోంది. ఇది కూడా రెట్రో మూవీనే. దాదాపు పాతికేళ్ళ క్రితం నాటి కథతో తెరకెక్కింది. మరి రామ్ పోతినేని హీరోగా నటించిన ఈ సినిమా అయినా భాగ్యశ్రీకి విజయాన్ని అందిస్తుందేమో చూడాలి.

Also Read: Kaantha Review: 'కాంత' మూవీ రివ్యూ

Also Read: Saturday TV Movies: శ‌నివారం, Nov 15.. తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో వ‌చ్చే సినిమాలివే

Updated Date - Nov 14 , 2025 | 02:03 PM