Beauty Movie: ఎవరి మనసుకైనా హత్తుకునే సినిమా ‘బ్యూటీ’
ABN, Publish Date - Sep 21 , 2025 | 06:12 PM
సెప్టెంబర్ 19న విడుదలైన ‘బ్యూటీ’ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. సక్సెస్ మీట్‌లో వీకే నరేష్, అంకిత్ కొయ్య, నీలఖి, దర్శకుడు జె.ఎస్.ఎస్. వర్ధన్, నిర్మాత విజయ్ పాల్ రెడ్డి మాట్లాడుతూ హృదయానికి హత్తుకునే అనుభూతులు పంచుకున్నారు. పూర్తి వివరాలు చదవండి.
అంకిత్ కొయ్య, నీలఖి, వీకే నరేష్, వాసుకి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘బ్యూటీ’. విజయ్ పాల్ రెడ్డి అడిదల – ఉమేష్ కుమార్ భన్సల్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాను ఏ మారుతి టీమ్ ప్రొడక్ట్, వానరా సెల్యూలాయిడ్, జీ స్టూడియోస్ బ్యానర్లపై రూపొందించారు. ఆర్.వి. సుబ్రహ్మణ్యం కథ, స్క్రీన్‌ప్లే అందించగా, జె.ఎస్.ఎస్. వర్ధన్ దర్శకత్వం వహించారు. సెప్టెంబర్ 19న విడుదలైన ఈ చిత్రం బ్లాక్‌బస్టర్ విజయాన్ని సాధించగా విజయోత్సవ సభ నిర్వహించారు.
ఈ సందర్భంగా వీకే నరేష్ మాట్లాడుతూ.. “‘బ్యూటీ’లోని ఆత్మీయతే మా అందరినీ ప్రమోషన్స్‌లో ఎక్కువగా మాట్లాడేలా చేసింది. అదే ఇప్పుడు ప్రేక్షకుల హృదయాలకు కనెక్ట్ అవుతోంది. నా కెరీర్‌లో ఎన్నో సినిమాలు చేశాను, కానీ ఇంత అద్భుతమైన రివ్యూలు నాకు ఇంతవరకు రాలేదు. అన్ని వర్గాల ప్రేక్షకులను తాకే సినిమా ఇది. దర్శకుడు వర్ధన్ తీసిన తీరు గర్వంగా అనిపించింది. నిర్మాత విజయ్ పాల్ రెడ్డి ఎక్కడా రాజీ పడలేదు. నీలఖి, అంకిత్ కొయ్య అద్భుతంగా నటించారు. విజయ్ బుల్గానిన్ సంగీతం, సాయి కుమార్ విజువల్స్ సినిమాకు ప్రత్యేక ఆకర్షణలుగా నిలిచాయి” అన్నారు.
అంకిత్ కొయ్య మాట్లాడుతూ.. “క్లైమాక్స్ తర్వాత ప్రేక్షకులు కన్నీళ్లు తుడుచుకుంటే అదే మా విజయం. ప్రీమియర్‌ల నుంచే మీడియా మాకు అండగా నిలిచింది. నేను నటించే ప్రతి సినిమా ప్రేక్షకులకు కనీసం గ్యారెంటీ ఎంటర్టైన్‌మెంట్ ఇస్తుంది. మన మీద ఎంత రాళ్లు విసిరినా వాటితోనే ఇల్లు కట్టుకోవాలి. మా సినిమాను ఇంతగా ఆదరిస్తున్న అందరికీ ధన్యవాదాలు” అన్నారు. నీలఖి మాట్లాడుతూ..“నా పాత్రకు లభిస్తున్న ప్రశంసలు ఆనందాన్ని ఇస్తున్నాయి. ఇంతగా ఆదరిస్తున్న ప్రేక్షకులకు, మీడియాకు ధన్యవాదాలు” అన్నారు.
దర్శకుడు జె.ఎస్.ఎస్. వర్ధన్, నిర్మాత విజయ్ పాల్ రెడ్డిలు మాట్లాడుతూ..“15 థియేటర్లకు వెళ్లి ప్రేక్షకుల స్పందన చూసాను. ప్రతి ఒక్కరూ కనెక్ట్ అవుతున్నారు. సాయి ఇచ్చిన విజువల్స్, విజయ్ బుల్గానిన్ మ్యూజిక్ సినిమాకు బలం అయ్యాయి. మీడియా, ప్రేక్షకులకు కృతజ్ఞతలు” అన్నారు.‘బ్యూటీ’ కేవలం సినిమా కాదు, ఇది జీవితం. ప్రతి ఒక్కరూ ఫోన్ చేసి ప్రశంసిస్తున్నారు. గుండెలను తాకే కంటెంట్ ఇచ్చామన్న సంతోషం ఉంది” అన్నారు.