సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

HBD NBK: అనితరసాధ్యుడు నటసింహ బాలకృష్ణ!

ABN, Publish Date - Jun 09 , 2025 | 07:30 PM

తన తరం హీరోల్లో పౌరాణిక, జానపద, చారిత్రక, సాంఘిక చిత్రాలలో జయకేతనం ఎగురవేసిన ఏకైక కథానాయకునిగా నిలిచారు నటసింహ నందమూరి బాలకృష్ణ. ఇక భావితరాలకు స్ఫూర్తినీ కలుగజేస్తూ సాగుతున్నారు బాలకృష్ణ.

తన తరం హీరోల్లో పౌరాణిక, జానపద, చారిత్రక, సాంఘిక చిత్రాలలో జయకేతనం ఎగురవేసిన ఏకైక కథానాయకునిగా నిలిచారు నటసింహ నందమూరి బాలకృష్ణ (NBK). ఇక భావితరాలకు స్ఫూర్తినీ కలుగజేస్తూ సాగుతున్నారు బాలకృష్ణ (BalaKrishna). ఆయన సాధించిన అరుదైన విజయాలు ఈ నాటికీ చెక్కుచెదరకుండా నిలచి ఉండడం విశేషం! ఆ కోణంలో చూస్తే బాలయ్య సమకాలికులైన కథానాయకులే కాదు నవతరం హీరోలు సైతం సాధించలేని అరుదైన ఘనవిజయాలు ఆయనకే దక్కాయి.

తెలుగులోనే కాదు దక్షిణ భారతదేశంలోనే వెయ్యి రోజులకు పైగా ప్రదర్శితమైన చిత్రంగా బాలకృష్ణ 'లెజెండ్' నిలచింది. ఇక ఈ నాటికీ తెలంగాణలో అత్యధిక రోజులు ప్రదర్శితమైన తెలుగు చిత్రంగా బాలయ్య 'మంగమ్మగారి మనవడు' నిలచే ఉండడం విశేషం! ఈ చిత్రం హైదరాబాద్ లో షిఫ్టుపై 560 రోజులు ప్రతి రోజూ 3 ఆటలో ప్రదర్శితమై చెక్కుచెదరని రికార్డును నమోదు చేసింది. ఇక రోజూ 4 ఆటలతో 425 రోజులు డైరెక్ట్ గా ప్రదర్శితమైన ఏకైక తెలుగు చిత్రంగా 'లెజెండ్' నిలచింది. ఎమ్మిగనూరులోని మినీ శివలో 'లెజెండ్' ఈ రికార్డును నమోదు చేసింది. అంతేకాదు, మరోవైపు ప్రొద్దుటూరులోనూ ఈ సినిమా డైమండ్ జూబ్లీ జరుపుకోవడం విశేషం! ఇలా రెండు కేంద్రాలలో డైమండ్ జూబ్లీ చూసిన చిత్రంగానూ 'లెజెండ్' నిలచింది. ఓ హీరో నటించిన రెండు సినిమాలు - మంగమ్మగారి మనవడు, లెజెండ్ - 500 రోజులకు పైగా రోజూ మూడు ఆటలతో ప్రదర్శితం కావడం కూడా అరుదైన రికార్డు! తెలుగునాట ఈ రికార్డ్ మరొకరికి లేదు. ఇక ముందు వస్తుందో లేదో చెప్పలేం.

యన్టీఆర్ తరువాత తెలుగు చిత్రసీమలో కోటి రూపాయల ఓపెనింగ్ చూపించిన మొదటి హీరో బాలకృష్ణ. 1986లో 'ముద్దుల క్రిష్ణయ్య'తో తొలిసారి కోటి రూపాయల ఓపెనింగ్ చూసిన ఘనత ఆయనదే! ఇక తెలుగు చిత్రసీమలో పాతిక కోట్లు, ముప్పై కోట్లు వసూళ్ళు చూసిన తొలి చిత్రాలు బాలయ్య నటించిన 'సమరసింహారెడ్డి', 'నరసింహనాయుడు' అనే చెప్పాలి. తెలుగునాట 100 కేంద్రాలలో తొలిసారి శతదినోత్సవం చూసిన చిత్రంగా బాలయ్య 'నరసింహనాయుడు' నిలచింది.

మరో విశేషమేంటంటే 'సమరసింహారెడ్డి' చిత్రం 30 కేంద్రాలలోనూ, 'నరసింహనాయుడు' సినిమా 19 కేంద్రాలలోనూ డైరెక్ట్ గా సిల్వర్ జూబ్లీ చూశాయి. ఇలా 19 కేంద్రాలకు పైగా రెండు చిత్రాలు రోజూ నాలుగు ఆటలతో రజతోత్సవం చూడడం అన్నది ఒక్క బాలయ్య కెరీర్ లోనే సాధ్యమయింది. ఒకే యేడాది ఆరు సినిమాలు హిట్ టాక్ తో భారీ ఓపెనింగ్స్ చూసింది కూడా ఒక్క బాలయ్యకే దక్కింది. ఆ ఫీట్ ను 1986లో "ముద్దుల క్రిష్ణయ్య, సీతారామ కళ్యాణం, అనసూయమ్మగారి అల్లుడు, దేశోద్ధారకుడు, కలియుగ కృష్ణుడు, అపూర్వ సహోదరులు" చిత్రాలతో సాధించారు బాలయ్య.


తండ్రి యన్టీఆర్ లాగే ఆల్ రౌండర్ గా సాగిన బాలయ్య 'శ్రీరామరాజ్యం'తో పౌరాణికంలోనూ, 'గౌతమీపుత్ర శాతకర్ణి' ద్వారా చారిత్రకంలోనూ, 'భైరవద్వీపం' వల్ల జానపదంలోనూ డైరెక్ట్ గా శతదినోత్సవాలు చూశారు. ఇక సాంఘికాల్లో ఎన్నెన్నో అరుదైన శతదినోత్సవాలు బాలయ్య సొంతం. ఈ రికార్డు ఒక్క నటరత్న యన్టీఆర్ కు తప్ప తెలుగునాట మరెవ్వరికీ లేకపోవడం గమనార్హం!

'అఖండ', 'వీరసింహారెడ్డి', 'భగవంత్ కేసరి' చిత్రాలతో వరుసగా రోజూ నాలుగు ఆటలతో డైరెక్ట్ గా సిల్వర్ జూబ్లీస్ చూస్తూ వస్తున్నారు బాలకృష్ణ. 'డాకూ మహరాజ్' సైతం అదే దిశగా అడుగులు వేస్తోంది. ఇలా హిట్ టాక్ సంపాదించి కేవలం వసూళ్ళు వచ్చాయని చెప్పుకోవడమే కాదు, రన్నింగ్ లోనూ సత్తా చాటడంలో బాలయ్య బాణీయే వేరు. అందుకు ఆయన అభిమానులనూ అభినందించి తీరాలి. తమ హీరో సినిమాను ఒకటికి పదిసార్లు చూస్తూ సక్సెస్ మూవీస్ ను రన్నింగ్ లోనూ రికార్డ్ స్థాయిలో సాగేలా చూస్తున్నారు బాలయ్య ఫ్యాన్స్. మునుముందు బాలయ్య చిత్రాలు ఏ తీరున మురిపిస్తాయో - వాటిని ఆయన అభిమానులు ఏ రీతిన ఆదరిస్తూ సాగుతారో చూద్దాం.

Updated Date - Jun 09 , 2025 | 08:24 PM