Kingdom: విజయ్ ఇప్పుడైనా అధిగమిస్తాడా...
ABN , Publish Date - May 06 , 2025 | 09:37 AM
విజయ్ దేవరకొండ సినిమాల టైటిల్స్ కు సంబంధించి ఓ సెంటిమెంట్ ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతూ ఉంది. అతని సినిమాకు ఇంగ్లీష్ పేరు పెడితే అచ్చిరాదట!
రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) తాజా చిత్రం 'కింగ్ డమ్' (Kingdom) ఈ నెల 30న జనం ముందుకు రాబోతోంది. సితార ఎంటర్ టైన్ మెంట్స్ పై సూర్యదేవర నాగవంశీ (Suryadevara Nagavamsi) నిర్మిస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. అంతేకాదు... దీనికి ముందు వచ్చిన సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో విజయ్ దేవరకొండ, ఆయన అభిమానులు సైతం దీని మీదనే ఆశలు పెట్టుకున్నారు. దర్శకుడు గౌతమ్ తిన్ననూరి (Gowtham Tinnanuri) ట్రాక్ రికార్డ్, మూవీ మేకింగ్ పట్ల అతనికి ఉన్న అంకిత భావం ఈసారి ఎలాగైనా విజయ్ దేవరకొండను గట్టెక్కిస్తుందని అంతా అనుకుంటున్నారు. పైగా ఇటీవల వచ్చిన పాట మూవీ గోయర్స్ లో పాజిటివ్ వైబ్స్ ను నింపింది. విజయ్ దేవరకొండ సమ్ థింగ్ డిఫరెంట్ క్యారెక్టర్ ఇందులో చేశాడని, అందులోని ఇంటెన్సిటీ జనాలను మెప్పిస్తుందని నమ్ముతారు. అనిరుధ్ రవిచందర్ (Anirudh Ravichander) స్వర పరిచిన ఆ పాట సైతం స్లో పాయిజన్ లాగా జనాలకు ఎక్కేస్తోంది.
ఇదిలా ఉంటే... గత కొన్ని సంవత్సరాలుగా విజయ్ దేవరకొండ మూవీ టైటిల్స్ విషయంలో ఓ సెంటిమెంట్ నడుస్తోంది. విజయ్ దేవరకొండ మూవీకి ఇంగ్లీష్ టైటిల్ పెట్టిన ప్రతిసారి అతనికి బ్యాడ్ ఎక్స్ పీరియన్స్ ఎదురైందని కొందరు చెబుతున్నారు. 'పెళ్ళిచూపులు'తో సోలో హీరోగా విజయ్ దేవరకొండ కెరీర్ ప్రారంభించిన తర్వాత ఇంగ్లీష్ టైటిల్ తో వచ్చిన మొదటి సినిమా 'నోటా' (Nota). అది తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కింది. ఆ సినిమా విజయ్ కు కోలీవుడ్ లో చేదు అనుభవాన్ని ఇచ్చింది. అలానే ఆ తర్వాత 'డియర్ కామ్రేడ్' (Dear Comrade) మూవీ కూడా ఇంగ్లీష్ టైటిల్ తో వచ్చిందే. ఆ సినిమా మేకింగ్ పరంగా, యాక్టింగ్ పరంగా విజయ్ కు గుర్తింపు తెచ్చిపెట్టినా... కమర్షియల్ గా ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఆ తర్వాత వచ్చిన 'వరల్డ్ ఫేమస్ లవర్' (World Famous Lover) మూవీ అయితే... ఏ విషయంలోనూ తన అంచనాలను అందుకోలేక బాక్సాఫీస్ బరిలో చతికల పడింది. ఇక పాన్ ఇండియా మూవీగా భారీ హంగామాతో వచ్చిన 'లైగర్' (Liger) గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఇవి చాలవన్నట్టుగా దిల్ రాజు నిర్మాణంలో విజయ్ దేవరకొండ చేసిన 'ది ఫ్యామిలీస్టార్' (The Family Star) సైతం నిరాశ పర్చింది. దీనికి ముందు దర్శకుడు పరశురామ్ తో విజయ్ దేవరకొండ 'గీత గోవిందం' లాంటి సూపర్ హిట్ మూవీ చేశాడు. కానీ అది 'ది ఫ్యామిలీ స్టార్'కు హెల్ప్ కాలేదు. ఇలా ఇంగ్లీష్ టైటిల్ పెట్టిన ప్రతిసారి విజయ్ దేవరకొండకు ఎదురుదెబ్బే తగులుతోంది. ప్రస్తుతం రాబోతున్న 'కింగ్ డమ్' సైతం ఇంగ్లీష్ టైటిల్ కావడంతో ఎలాంటి ఫలితాన్ని తమ హీరో ఎదుర్కొంటాడో అనే సందేహాన్ని కొందరు వ్యక్తం చేస్తున్నారు.
స్టోరీ, టేకింగ్, ప్రొడక్షన్ వాల్యూస్ ఇవి పర్ ఫెక్ట్ గా ఉంటే... ఇలాంటి సెంటిమెంట్స్ ను పట్టించుకోనక్కర్లేదని కొందరు చెబుతున్నారు. కానీ సినిమా రంగం అంటేనే సెంటిమెంట్ మయం. ఒకవేళ... ఊహించని విధంగా 'కింగ్ డమ్'కు ప్రతికూల ఫలితం వస్తే మాత్రం ఇక మీదట విజయ్ దేవరకొండ మూవీకి పేరు పెట్టేప్పుడు దర్శక నిర్మాతలు ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తారేమో!
Also Read: Super Star: ఘట్టమనేని జయకృష్ణ తెరంగేట్రానికి సర్వం సిద్థం
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి