Tollywood: చిరపుంజీలో తెలుగు సినిమా షూటింగ్ ఎలా సాగుతోందంటే...
ABN , Publish Date - Nov 08 , 2025 | 02:57 PM
ట్రెండీ క్రైమ్ కామెడీ మూవీ 'బా బా బ్లాక్ షీప్' షూటింగ్ ప్రస్తుతం మేఘాలయలోని చిరపుంజీలో జరుగుతోంది. మేఘాలయ లో పూర్తి షూటింగ్ జరుపుకుంటున్న తొలి తెలుగు సినిమాగా 'బా బా బ్లాక్ షీప్' నిలువబోతోంది.
చిత్రాలయం స్టూడియోస్ పతాకంపై వేణు దోనేపూడి (Venu Donepudi) నిర్మిస్తున్న ట్రెండీ క్రైమ్ కామెడీ మూవీ 'బా బా బ్లాక్ షీప్' (Baa Baa Black Sheep). ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం మేఘాలయలో శరవేగంగా సాగుతోంది. దీని షూటింగ్ అక్టోబర్ లో మొదలైంది. టిన్నూ ఆనంద్ (Tinnu Anand), ఉపేంద్ర లిమాయే (Upendra Limaye), జార్జ్ మరియన్, రాజా రవీంద్ర (Raja Ravindra), అక్షయ్ లఘుసాని, విష్ణు ఓ ఐ, కార్తీకేయ దేవ్ తదితరులు ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు.
మేఘాలయలోనే పూర్తిగా షూటింగ్ జరుపుకున్న తొలి తెలుగు సినిమా 'బా బా బ్లాక్ షీప్' నిలువబోతోంది. ఒక రోజులో జరిగే కథతో ఈ సినిమాను తీస్తున్నారు. ఆరుగురు వ్యక్తుల జీవితాలకు సంబంధించిన స్టోరీ ఇది. గన్స్, గోల్డ్, హంట్ అంటూ సింపుల్ గా ఈ కథ గురించి నిర్మాత చెబుతున్నారు. వేణు దోనేపూడి ఈ మూవీ మేకింగ్ గురించి చెబుతూ, 'ఈ కథ మొత్తం నార్త్ ఈస్ట్ ఇండియాలో జరుగుతుంది. అందుకే మేఘాలయాను మేం షూటింగ్ స్పాట్ కు ఎంచుకున్నాం. దేశంలో అత్యధిక వర్షపాతం ఉండే నగరాల్లో చిరపుంజీ కూడా ఒకటి. ఇక్కడి సోహ్రాలో ఎప్పుడూ వర్షం కురుస్తూనే ఉంటుంది. ఇలాంటి చోట నిజానికి షూటింగ్ చేయడం కష్టమే. కావాల్సిన లైటింగ్ కూడా ఉండదు. అయితే అందమైన జలపాతాలు, కొండలు ఉండటంతో ఇక్కడ రెక్కీ చేసి, మేఘాలయానే మా సినిమాకు కరెక్ట్ అని ఇక్కడే తీస్తున్నాం' అని చెప్పారు.

మేఘాలయలో షూటింగ్ జరుగుతున్న సందర్భంగా ఈ చిత్ర బృందం చీఫ్ మినిస్టర్ కాన్రాడ్ కె సంగ్మాను కలిసింది. ఆయన తమ ప్రభుత్వం నుండి సంపూర్ణ సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ సినిమా ద్వారా గుణి మాచికంటి ని దర్శకుడిగా పరిచయం చేస్తున్నారు.
Also Read: K-Ramp: ఓటీటీలోకి ఈ ఏడాది బుర్ర పాడు చేసిన ఎంటర్టైనర్
Also Read: Dies Irae Review: ప్రణవ్ మోహన్ లాల్ ‘డీయస్ ఈరే’ ఎలా ఉందంటే...