Atharva : తెలుగులో రాబోతున్న తమిళ డి.ఎన్.ఎ.
ABN , Publish Date - Jul 04 , 2025 | 06:48 PM
అధర్వ మురళీ నటించిన 'డి.ఎన్.ఎ.' చిత్రం తమిళంలో ఇప్పటికే విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇప్పుడా సినిమా తెలుగులో 'మై బేబి' పేరుతో డబ్ అవుతోంది.
ఇటీవల తమిళంలో విడుదలై మంచి విజయాన్ని అందుకున్న 'డి.ఎన్.ఏ.' (DNA) సినిమాను ఎస్. కె. పిక్చర్స్ ద్వారా సురేష్ కొండేటి (Suresh Kondeti) తెలుగు ప్రేక్షకులకు అందించనున్నారు. ఈ సినిమా తెలుగులో ‘మై బేబి’ (My Baby) పేరుతో జూలై 11న విడుదల కానుంది. గతంలో ‘ప్రేమిస్తే’, ‘జర్నీ’ 'షాపింగ్ మాల్ ' 'పిజ్జా' వంటి విజయవంతమైన 15 చిత్రాలను నిర్మాతగా విడుదల చేసిన సురేష్ కొండేటి గతంలో డిస్ట్రిబ్యూటర్ గా 85 పైగా చిత్రాలను విడుదల చేశారు. ఇప్పుడు నిర్మాతగా 16వ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు సిద్ధం అవుతున్నారు.
ఈ మూవీ గురించి సురేశ్ కొండేటి మాట్లాడుతూ, 'మామూలుగా మనం హాస్పిటల్స్ లో పిల్లల్ని మాయం చెయ్యడం, వారిని వేరే చోట అమ్మేయడం వంటి వార్తలని వింటున్నాం. టీవీ న్యూస్ లో చూస్తాం. ఇలాంటి వార్తలు ఇప్పుడు కాదు కొన్ని సంవత్సరాలుగా వింటూనే ఉన్నాం. ఈ సినిమా మరొక్కసారిగా మనం సొసైటీలో ఎంత జాగ్రత్తగా ఉండాలో తెలియచేస్తుంది. అధర్వ మురళి, నిమిషా సజయన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ క్రైమ్ థ్రిల్లర్, భావోద్వేగాలతో కూడిన గ్రిప్పింగ్ కథాంశంతో ఆకట్టుకుంది. 2014లో ఒక సాఫ్ట్వేర్ ఆర్కిటెక్ట్ జీవితంలో జరిగిన దుర్ఘటన నేపథ్యంలో ఈ కథ సాగుతుంది' అని అన్నారు. ప్రొడ్యూసర్ గా 'మై బేబి’ తనకు తెలుగులో 16వ చిత్రమని, ఇది కూడా సూపర్ హిట్ అవుతుందనే నమ్మకం ఉందని సురేష్ కొండేటి తెలిపారు. ఈ సినిమాను నెల్సన్ వెంకటేశన్ తెరకెక్కించారు.
Also Read: Show Time: షో టైమ్ మూవీ రివ్యూ
Alsr Read: 3 BHK Review: సిద్థార్థ్ ‘3 బీహెచ్కే’ ఎలా ఉందంటే