3 BHK Review: సిద్థార్థ్ ‘3 బీహెచ్‌కే’ ఎలా ఉందంటే
ABN , Publish Date - Jul 04 , 2025 | 04:57 PM
సిద్థార్థ్ జయాపజయాలతో పని లేకుండా వరుస సినిమాలు చేస్తూనే ఉన్నారు. తాజాగా ఆయన హీరోగా వచ్చిన చిత్రం ‘3 బీహెచ్‌కే’. శ్రీ గణేష్ దర్శకత్వం వహించారు సొంత ఇంటి కల నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుందో చూద్దాం
సినిమా రివ్యూ: 3బీహెచ్‌కే (3 bhk Review)
విడుదల తేది: 4–7–2025
సిద్థార్థ్ (Siddharth) జయాపజయాలతో పని లేకుండా వరుస సినిమాలు చేస్తూనే ఉన్నారు. తాజాగా ఆయన హీరోగా వచ్చిన చిత్రం ‘3 బీహెచ్‌కే’. శ్రీ గణేష్ దర్శకత్వం వహించారు. శరత్‌కుమార్, దేవయాని, సిద్ధార్థ్ తల్లిదండ్రులుగా నటించారు. చైత్ర జె ఆచార్ హీరోయిన్. తమిళ, తెలుగు భాషల్లో ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సొంత ఇంటి కల నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుందో చూద్దాం.
కథ (3 bhk Review)
వాసుదేవ్ (శరత్ కుమార్), శాంతి (దేవయాని) మధ్యతరగతి దంపతులు. వీరికి ఇద్దరు పిల్లలు, ప్రభు (సిద్థార్థ్), ఆర్తి (మీథా రఘునాథ్). సొంత ఇల్లు కొనుక్కోవాలనేది వాళ్ళ కల. ప్రభు పదో తరగతిలో ఉన్నప్పటి నుంచి బీటెక్ పూర్తి చేేస వరకు...ఆ తర్వాత ప్రభు పెళ్లి వరకు... వాసుదేవ్ కుటుంబం ఎన్నో సార్లు ఇల్లు కొనాలని అడ్వాన్స్ ఇవ్వడానికి వెళ్లి ఆర్థిక పరిస్థితి సహకరించక , ఆ కల కలగానే ఉండిపోతుంది. ఇంతకీ ప్రభు ఇల్లు కొన్నాడా? సొంత ఇల్లు అనేది ఓ గౌరవం అని నమ్మే తన తండ్రి కోరిక నెరవేరిందా? ఈ మధ్యలో ఆర్తి పెళ్లి ఆ తర్వాత వచ్చిన సమస్య, ఐశ్వర్యతో ప్రభు ప్రేమ ఇవన్నీ ఎలా నడిచాయి అన్నది తెరపైనే చూడాలి.
విశ్లేషణ:
ప్రతి మధ్య తరగతి కుటుంబం ఎదుర్కొనే సవాళ్లే ఈ సినిమా. సొంత ఇంటి కలను నెరవేర్చుకోవాలనే ఓ మధ్య తరగతి కుటుంబం కథ ఇది. కథగా కొత్తది ఏమీ కాదు. కానీ దర్శకుడు ఆధ్యంతం మిడిల్ క్లాస్ ఎమోషన్ మీద కథ కనిపించాడు. దిగువ మధ్య తరగతి కుటుంబం పడే స్ట్రగుల్స్, సొంత ఇల్లు ఏర్పాటు చేసుకోవడం, పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వాలి అనే తల్లిదండ్రులు ఎలా ఆలోచిస్తారు అనేది దర్శకుడు చాలా హృద్యంగా చూపించారు. అలాగే జాబ్ సంపాదించుకోవడం, చెల్లి కోసం త్యాగం, నచ్చిన పని చేస్తే అందులో ఉండే కిక్కు ఇలాంటి ఎమోషన్స్ ఎన్నో ఈ సినిమాలో ఉన్నాయి. ఈ జానర్ కథలన్నీ దాదాపుగా ఇలాగే ఉంటాయి. దర్శకుడు ఈ కథలో ఎమోషన్స్ క్యారీ చేయగలిగారు కానీ అంతకుమించి కొత్తగా ఏమీ చూపించలేదు. సమస్యలు అన్నీ వరుసగా రావడం.. ఇలా మధ్య తరగతి కుటుంబాలు ఎదుర్కొనే సమస్యలన్నీ ఈ చిత్రంలో చూపించి ఎమోషన్స్ ఓవర్ డోస్ అన్న భావన కలిగేలా చేశారు. అయితే ప్రారంభం నుంచి చివరి వరకూ కథ స్లోగా సాగుతుంది. శరత్ కుమార్ సన్నివేశం వచ్చిన ప్రతిసారీ సాగదీతగానే అనిపిస్తుంది. చిన్నప్పటి నుంచి తండ్రి మాటే విని బలవంతంగా నచ్చని పని చేస్తూ ఉండే కుర్రాడు ఫైనల్‌గా తనకు నచ్చిన పని చేసి ఎలా సక్సెస్ అయ్యాడు అనే దానితో సినిమాకు ముగింపు పలికారు. ఇక ఆర్టిస్ట్‌ల విషయానికొస్తే.. మిడిల్ క్లాస్ అబ్బాయిగా సిద్ధార్థ్ ఒదిగిపోయారు. స్కూల్, కాలేజ్, ఆఫీస్ వయసుల వారీగా సిద్ధార్థ్ లుక్ రంగా వేరియేషన్ చూపించారు. శరత్ కుమార్ కూడా అంతే! నటుడిగానూ ఆయన పాత్రలో జీవించారు. సిద్ధార్థ్ భార్యగా చైత్ర జే ఆచార్ కనిపించారు. నిడివి తక్కువే అయినా సాధారణ అమ్మాయిగా చక్కగా నటించింది. ఆమె కంటే సిద్ధార్థ్‌కు చెల్లెగా నటించిన మీథా రఘునాథ్‌కు సినిమాలో ఎక్కువ స్పేస్ దక్కింది. యోగిబాబు కనిపించింది మూడు సీన్లే అయిన నవ్వించాడు. దినేష్ బి కృష్ణన్ సినిమాటోగ్రఫీ బావుంది. అమిత్ర్ రామ్‌నాథ్ సంగీతం సినిమాకు ఎసెట్ అయింది. ఎడిటర్ మాత్రం కాస్త షార్ప్‌గా పని చేసి ఉంటే సినిమా సాగదీతలా ఉండేది కాదు. ఆర్ట్ వర్క్, నిర్మాణ విలువలు బావున్నాయి. మిడిల్ క్లాస్ కథను పూర్తిగా భావోద్వేగాలతో నింపేశాడు దర్శకుడు. దానిని కాస్త స్పీడ్ స్ర్కీన్‌ప్లేతో తీసుంటే ఎక్కువ మంది ప్రేక్షకులను ఆకట్టుకునే అవకాశం ఉంది. ఈ 3బీహెచ్‌కే ఇంట్లోకి వెళ్లాలంటే కాస్త ఓపిక కావాలి.
ట్యాగ్‌లైన్: 3 బీహెచ్‌కే.. వెరీ స్లో..
రేటింగ్: 2.5/5