Cinema Vs Web Series: 'తండేల్' కథే వెబ్ సీరిస్ గా...
ABN , Publish Date - Jul 28 , 2025 | 03:00 PM
'తండేల్' కథాంశంతోనే ఇప్పుడు 'అరేబియా కడలి' వెబ్ సీరిస్ రాబోతోంది. నిజ సంఘటనల ఆధారంగా ఈ వెబ్ సీరిస్ రూపుదిద్దుకుంది.
ఒకే కథాంశంతో రూపుదిద్దుకునే సినిమాలు మనకు కొత్తేమీ కాదు. అయితే... వాటిని తెరకెక్కించే విధానంలో తేడా ఉండటంతో ప్రేక్షకులు సర్థుకు పోతుంటారు. ఈ మధ్య వచ్చిన నవీన్ చంద్ర నటించిన రెండు సినిమాల మెయిన్ ప్లాట్ ఒక్కటే అనే విమర్శ వచ్చింది. ఒకే హీరో ఇలా ఒకే కథాంశంతో రెండు సినిమాలు ఎలా చేస్తాడు? అనే ప్రశ్న కూడా కొందరు వేశారు. అయితే ఈ రెండు సినిమాల షూటింగ్స్ వేరు వేరు సమయాలలో జరిగి.... టైమ్ బాగోక ఈ రెండు బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ కావడంతో దీనిని విమర్శించారు. అలానే ఆ మధ్య జీ 5లో వచ్చిన 'విరాట పాలెం' వెబ్ సీరిస్ కథ... తాము రూపొందిస్తున్న 'కానిస్టేబుల్ కనకం' కథకు కాపీ అని ఈటీవీ విన్ వాళ్ళు ఆరోపించారు. ఈ రెండు వెబ్ సీరిస్ కథలకు సంబంధం లేదని జీ5 యాజమాన్యం వివరణ ఇచ్చింది. ఇప్పుడు అటువంటి చిత్రమైన సంఘటనే మరొకటి వెలుగులోకి వచ్చింది.
నాగచైతన్య (Naga Chaitanya), సాయిపల్లవి (Saipallavi) జంటగా నటించిన 'తండేల్' (Thandel) మూవీ ఫిబ్రవరిలో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. రూ. 100 కోట్లకు పైగా గ్రాస్ ను ఈ సినిమా వసూలు చేసింది. చందు మొండేటి (Chandu Mondeti) దర్శకత్వంలో అల్లు అరవింద్ (Allu Aravind) ఈ సినిమాను నిర్మించారు. విశాఖ తీరం ప్రాంతంలోని జాలర్లు కొందరు గుజరాత్ లోని అరేబియా సముద్రంలో చేపల వేటకు వెళ్ళినప్పుడు పొరపాటున పాకిస్తాన్ సరిహద్దుల్లోకి వెళ్ళిపోతారు. దాంతో అక్కడి నేవీ అధికారులు వీరిని అరెస్ట్ చేస్తారు. అక్కడ వారు ఎలాంటి కష్టాలను ఎదుర్కొన్నారు? భారత ప్రభుత్వం చొరవతో తిరిగి ఎలా స్వదేశానికి వచ్చారు? అనే అంశాలతో 'తండేల్' మూవీ రూపుదిద్దుకుంది. నిజ సంఘటనల స్ఫూర్తితో తెరకెక్కిన సినిమా ఇది. పాకిస్తాన్ లో జైలు జీవితాన్ని గడిపి వచ్చిన జాలర్లకు గీతా ఆర్ట్స్ సంస్థ రాయితీ ఇచ్చి, ఈ హక్కుల్ని తీసుకున్నట్టు తెలిపారు. అయితే... ఈ నిజ సంఘటనల ఆధారంగా సీనియర్ జర్నలిస్ట్, రచయిత చింతకింద శ్రీనివాస్ రాసిన రచన ఇప్పుడు వెబ్ సీరిస్ గా రాబోతోంది. ప్రముఖ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి సైతం ఈ ప్రాజెక్ట్ లో ఇన్ వాల్వ్ అయ్యారు. ఈ వెబ్ సీరిస్ ను వై. రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి నిర్మించారు. ఈ సర్వైవల్ డ్రామాను వి. వి. సూర్యకుమార్ డైరెక్ట్ చేశారు. 'అరేబియా కడలి' (Arabia Kadali) అనే ఈ వెబ్ సీరిస్ లో సత్యదేవ్ (Satyadev), ఆనంది (Anandi) ప్రధాన పాత్రలు పోషించారు. ఇతర పాత్రలలో నాజర్, రఘుబాబు, దలీప్ తాహిర్, పూనమ్ బజ్వా, రవివర్మ, అమిత్ తివారి, నిహార్ పాండ్యా, అలోక్ జైన్ తదితరులు కనిపించ బోతున్నారు. 'అరేబియా కడలి' వెబ్ సీరిస్ ఆగస్ట్ 8వ తేదీ నుండి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కాబోతోంది.
'అరేబియా కడలి' గురించి మేకర్స్ చెబుతూ,'ఈ కల్పిత కథానికలో ప్రత్యర్థి గ్రామాల నుండి వచ్చిన మత్స్యకారులు అనుకోకుండా అంతర్జాతీయ జలాల్లోకి ప్రవేశించి, ఓ విదేశీ ప్రాంతంలో బందీలుగా మారిన విషాదకర సంఘటనను హృదయానికి తాకేలా చిత్రీకరించాం. ఈ కథలో రెండు ప్రధాన ప్రయాణాలు ఉంటాయి. బదిరి, అతని సహచర మత్స్యకారుల సముద్రపు ప్రమాదాలు, బందీ జీవితం; అలాగే వ్యవస్థను ఎదిరించే ధైర్యవంతమైన మహిళగా గంగ ఎదుగుదల.. ఈ ప్రయాణాల్లో వారు అనుకోని స్నేహాలు ఏర్పరచుకుంటారు, కొత్త సంబంధాలు నిర్మించుకుంటారు' అని చెప్పారు. 'ఈ 'అరేబియా కడలి' అనేది అసాధారణ పరిస్థితుల్లో చిక్కుకున్న సాధారణ వ్యక్తుల ధైర్యాన్ని, సహనాన్ని ప్రశంసించే తెలుగు డ్రామా' అని ప్రైమ్ వీడియో ఇండియా డైరెక్టర్, హెడ్ ఆఫ్ ఒరిజినల్స్ నిఖిల్ మాధోక్ తెలిపారు. మొత్తం మీద ఇదే కథాంశంతో 'తండేల్' మూవీ రూపుదిద్దుకోగా, ఇప్పుడు అదే కథాంశంతో 'అరేబియా కడలి' వెబ్ సీరిస్ గా రాబోతోందన్న మాట.
Also Read: Vishwambhara - Vassista: కీరవాణి సలహాతోనే అలా.. స్పెషల్ సాంగ్‌పై క్లారిటీ
Also Read: AM Rathnam Vs Ambati: అంబటి రాంబాబుకు.. ఏఎం రత్నం అదిరిపోయే కౌంటర్