Pawan Kalyan: తప్పుడు.. ప్రచారం చేస్తున్నారు! హైకోర్టుకు.. పవన్ కళ్యాణ్
ABN , Publish Date - Dec 12 , 2025 | 01:25 PM
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, టాలీవుడ్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) సోషల్ మీడియాలో జరుగుతున్న వ్యక్తిత్వ హక్కుల ఉల్లంఘనలపై ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు.
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, టాలీవుడ్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) సోషల్ మీడియాలో జరుగుతున్న వ్యక్తిత్వ హక్కుల ఉల్లంఘనలపై ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తన ప్రైవసీ, వ్యక్తిగత ప్రతిష్ఠకు నష్టం కలిగించే విధంగా సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్‌లు మరియు కొన్ని ఇ-కామర్స్ సైట్లలో అనేక పోస్టులు, కంటెంట్ చక్కర్లు కొడుతున్నాయని ఆయన పిటిషన్‌లో పేర్కొన్నారు.
పవన్ తరఫున సీనియర్ అడ్వకేట్ సాయి దీపక్ ఈ పిటిషన్‌ను దాఖలు చేసి. వ్యక్తిగత హక్కులను దెబ్బతీసే కంటెంట్‌పై తక్షణ చర్యలు తీసుకోవాలని కోర్టును కోరారు. వాదనలు విన్న హైకోర్టు, ఉల్లంఘనలకు సంబంధించిన వివరాలను వారం రోజుల్లో సమర్పించాలని ఆదేశిస్తూ, నోటీస్ జారీ చేసింది. దీనికి 48 గంటల గడువు ఇచ్చింది. అలాగే పవన్ కళ్యాణ్ హక్కులను అతిక్రమించేలా ఉన్న లింకులు, పోస్టులను ఏడు రోజులలోపు తొలగించాలని కోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. కేసు తదుపరి విచారణను డిసెంబర్ 22కు వాయిదా వేసింది.
ఇటీవల పలువురు ప్రముఖులు కూడా ఇలాంటి హక్కుల పరిరక్షణ కోసం కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. టాలీవుడ్ సీనియర్ నటులు నాగార్జున, చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్‌తో పాటు బాలీవుడ్ స్టార్‌లు అమితాబ్ బచ్చన్, ఐశ్వర్యరాయ్, అభిషేక్ బచ్చన్, కరణ్ జోహార్ వంటి సెలబ్రిటీలు కూడా తమ వ్యక్తిగత హక్కుల సంరక్షణ కోసం ఇలాంటి పిటిషన్‌లు వేసిన వారిలోనే ఉన్నారు. క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ కూడా వారిలో ఒకరు.