Anushka Shetty: నటిగా సూపర్ అనిపించుకుని ఇరవై యేళ్ళు...

ABN , Publish Date - Jul 21 , 2025 | 01:43 PM

స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి నటిగా ఇరవై సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఆమె నటించిన తొలి తెలుగు సినిమా 'సూపర్' సరిగ్గా రెండు దశాబ్దాల క్రితం ఇదే రోజు జనం ముందుకొచ్చింది.

మంగళూరు భామ అనుష్క శెట్టి (Anushka Shetty) రెండు దశాబ్దాలుగా సినీ ప్రేక్షకుల్ని మంత్రముగ్థుల్ని చేస్తూనే ఉంది. ఏ ముహూర్తాన దర్శకుడు పూరి జగన్నాథ్‌ ఆమెకు 'సూపర్' (Super) సినిమాలో ఛాన్స్ ఇచ్చి స్వీటీ శెట్టి పేరును అనుష్కగా మార్చాడో ఆ వేళావిశేషం... రెండు దశాబ్దాలుగా అనుష్క శెట్టి ప్రేక్షకులను మెప్పిస్తూనే ఉంది. ప్రముఖ యోగా గురు భరత్ ఠాకూర్ దగ్గర విద్యను అభ్యసించి యోగా ఇన్ స్ట్రక్టర్ గా కెరీర్ ప్రారంభించిన అనుష్కకు పూరి జగన్నాథ్‌ రూపంలో సినిమా అవకాశం దక్కింది. నాగార్జున హీరోగా నటించి, నిర్మించిన 'సూపర్' సినిమా కోసం ఇటు అనుష్కను, అటు ఆయేషా టకియాను ఎంపిక చేసుకున్నారు పూరి జగన్నాథ్‌. ఈ సినిమా కోసం నాగార్జున ప్రత్యేకంగా మేకోవర్ అయ్యారు. అలానే అప్పుడప్పుడే తెలుగు సినిమాల్లో నటిస్తున్న సోనూసూద్ కూ ఇందులో కీలక పాత్రను ఇచ్చారు పూరి. ఇరవై యేళ్ళ క్రితం 2005 జూలై 21న విడుదలైన 'సూపర్' సినిమా ఆశించిన స్థాయిలో ఆడకపోయినా... అనుష్కకు మాత్రం వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం కలగలేదు.

అప్పట్లో 'సూపర్' మూవీ ప్రెస్ మీట్ లో మహానటుడు అక్కినేని నాగేశ్వరరావు అనుష్క గురించి మాట్లాడుతూ, 'ఆమె అందం, చందం తనని సైతం మంత్రముగ్ధుడ్ని చేశాయ'ని కితాబిచ్చారు. అవకాశం దొరికితే ఆమె సరసన నటించడానికి తాను సిద్థమంటూ సరదాగా కామెంట్ చేశారు. ఆ రకంగా అక్కినేని నుండి ప్రశంసలు అందుకున్న అనుష్క 'సూపర్' (Super) సినిమా జయాపజయాలతో నిమిత్తం లేకుండా వరుసగా అవకాశాలు అందిపుచ్చుకుంది. ఆ వెంటనే సుమంత్ సరసన 'మహానది' (Mahanadi) లో నటించింది. ఇక ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో 'విక్రమార్కుడు' (Vikramarkudu) మూవీ చేసిన తర్వాత, ఆమె ఒక్కసారిగా స్టార్ డమ్ ను అందుకుంది.


'విక్రమార్కుడు' విడుదలైన 2006లోనే 'రెండు' సినిమాతో కోలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది అనుష్క. కెరీర్ ప్రారంభ దినాలలో తెలుగు సినిమాలకే అనుష్క ప్రాధాన్యం ఇస్తూ వచ్చింది. 'లక్ష్యం, డాన్, శౌర్యం, కింగ్' వంటి ఫక్తు కమర్షియల్ సినిమాల్లో నటించి మెప్పించిన అనుష్క కెరీర్ ను పూర్తి స్థాయిలో మలుపుతిప్పిన సినిమా 'అరుంధతి' (Arundhathi). కోడి రామకృష్ణ దర్శకత్వంలో శ్యాంప్రసాద్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాతో అనుష్క పేరు జేజమ్మగా మారిపోయింది. 'వెండితెర జేజమ్మ'గా ఆమెను అభిమానులు సంభోదించడం మొదలు పెట్టారు. ఆ సినిమాతో తొలిసారి నటిగా నంది స్పెషల్ జ్యూరీ అవార్డును అందుకుంది అనుష్క. ఆ తర్వాత వచ్చిన 'సింగం, వేదం, పంచాక్షరి, ఖలేజా' చిత్రాలు ఆమెను మరింత బెటర్ పొజిషన్ కు తీసుకెళ్ళాయి. నటిగా కెరీర్ ప్రారంభించిన సరిగ్గా పదేళ్ళకు మూడు అద్భుతమైన పాత్రలు అనుష్కను వరించాయి. అవే 'బాహుబలి, రుద్రమదేవి, సైజ్ జీరో' చిత్రాలు. 'బాహుబలి' ఆమెకు జాతీయ స్థాయిలో నటిగా గుర్తింపు తెచ్చిపెడితే... 'రుద్రమదేవి' తెలుగు ప్రేక్షకుల హృదయసీమలో సుస్థిర స్థానం కల్పించింది. ఇక అదే సంవత్సరం వచ్చిన 'సైజ్ జీరో' ఆమెను ఉత్తమ నటిగా నంది అవార్డుకు అర్హురాలిని చేసింది.


నటిగా ఉన్నత శిఖరాలను అధిరోహించిన అనుష్క శెట్టికి 2017లో వచ్చిన 'బాహుబలి -2' తో దేవసేనగా మరోసారి జాతీయ స్థాయిలో సినీ అభిమానుల మనసుల్ని దోచుకుంది. ఆ తర్వాత సంవత్సరమే వచ్చిన 'భాగమతి' కూడా అనుష్కకు చక్కని విజయాన్ని అందించింది. 'సైజ్ జీరో' చిత్రం కోసం మేకవర్ అయిన అనుష్క ఆ తర్వాత ఎంత ప్రయత్నించినా... పాత రూపులోకి రాలేకపోయింది. అంతేకాదు... నిదానంగా సినిమాలను తగ్గించుకుంది. ఆచితూచి అడుగులు వేయడం మొదలు పెట్టింది. గడిచిన ఐదేళ్ళలో ఆమె కేవలం రెండే సినిమాలు చేసింది. అందులో ఒకటి పాన్ ఇండియా మూవీ 'నిశ్శబ్దం' కాగా మరొకటి 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి'. ప్రస్తుతం మరో లేడీ ఓరియంటెడ్ మూవీ 'ఘాటీ'తో ప్రేక్షకుల ముందుకు త్వరలో అనుష్క రాబోతోంది. అలానే మలయాళంలోనూ ఓ సినిమా చేస్తోంది. ఇప్పటికీ అనుష్క అంగీకరించాలే కానీ ఆమెతో సినిమాలు నిర్మించడానికి పలువురు నిర్మాతలు సిద్థంగా ఉన్నారు. మరి నటిగా ఇరవై యేళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా అనుష్క కొత్త ప్రాజెక్ట్స్ కు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందో లేదో చూడాలి.

Also Read: Pawan Kalyan: నాకు కలక్షన్స్ రావు.. ఆ హీరోల కన్నా చాలా తక్కువ నేను

Also Read: Samantha New Movie: సామ్‌ మరో ప్రయత్నం.. ముచ్చటగా మూడోసారి

Updated Date - Jul 21 , 2025 | 01:43 PM