Gaddar Awards: గద్దర్ అవార్డులు... తదనంతర పరిణామాలు...

ABN , Publish Date - Jun 03 , 2025 | 01:23 PM

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డుల ప్రదానంపై దృష్టి పెట్టారు. కమిటీలతో అవార్డులను ప్రకటించడంతో పాటు జూన్ 14న వాటిని విజేతలకు అందించ బోతున్నారు.

తెలంగాణ ప్రభుత్వం (Telangana Govenment) చిత్ర పరిశ్రమను ప్రోత్సహిస్తూ గద్దర్ అవార్డు (Gaddar Awards) లను ఇవ్వనున్నట్లు చెప్పి ఇటీవల కమిటీలను వేసి అవార్డ్ విజేతలను ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ అవార్డ్ విన్నర్స్ విషయంలో సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన లభిస్తోంది. వీటికి ప్రతికూలంగా ఒకరిద్దరూ తప్ప ఎవరూ బయటకు మాట్లాడలేదు.

ప్రత్యేకించి అడవుల పరిరక్షణ, పర్యావరణం కోసం తన జీవితమంతా ధారపోసిన గద్దర్ పేరిట ఏర్పాటు చేసిన అవార్డ్ లలో ఉత్తమ నటుడు కేటగిరిలో ఎర్రచందనం స్మగ్లర్ పాత్రకు అవార్డ్ ఇవ్వడంపై సోషల్ మీడియాలో అనేక కార్టూన్స్ హల్ చల్ చేస్తున్నాయి. నిజానికి ఆ పాత్రను అల్లు అర్జున్ (Allu Arjun) అద్బుతంగా పోషించినా, పాత్ర నైజం దృష్ట్యా ఆ ఎంపిక సరికాదన్నది ఆ కార్టూన్స్ సారాంశం. ఇక అవార్డుల కమిటీ ఛైర్మన్ పర్సన్ కు… కమిటీలో ఉన్న మాజీ నటి, ప్రస్తుత బిజెపి (BJP) సభ్యురాలికి మధ్య ఇగో క్లాష్ వల్ల వివాదం చెలరేగినట్లు వినికిడి. బిజెపి సభ్యురాలైన ఆ నటి సభ్యులను ఇంటికి పిలిపించుకుని పార్టీలు ఇవ్వడం ఛైర్ పర్సన్ కు నచ్చలేదట. ఈ వివాదం ముదరటంతో ఒకానొక దశలో ఛైర్ పర్సన్ రాజీనామాకు కూడా సిద్దపడినట్లు వార్తలు వినిపించాయి. దీంతో 'దిల్' రాజు (Dil Raju) ఎంటరై వివాదాన్ని సద్దుమణిగేలా చేశారట.


ఇవి తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న అవార్డులు కావటంతో తెలంగాణ సినిమాలకు సముచిత న్యాయం దక్కాలని ఒకరిద్దరు సభ్యలు వాదించినా తెలంగాణకు సంబంధించిన సినిమాలు లేకపోవడంతో వారు మిన్నకుండి పోవలసి వచ్చిందట.

స్పెషల్ అవార్డుల విషయానికి వస్తే ముందుగా గత పదేళ్ళకు సంబంధించి ఒక్కో సినిమాను ఉత్తమ చిత్రంగా ఎంపిక చేయాలని భావించినప్పటికీ అసంతృప్తి ఎక్కువగా ఉంటుందని భావించి కమిటీ సూచన మేరకు ప్రథమ, ద్వితీయ, తృతీయ సినిమాలను ఎంపిక చేసి సత్కరించేందుకు ప్రభుత్వం అంగీకరించటం గమనార్హం. అయినప్పటికీ చిరంజీవి (Chiranjeevi) నటించి నిర్మించిన ‘సైరా నరసింహారెడ్డి’ కి అందులో చోటు దక్కకపోవడం చర్చనీయాంశం అయింది. రాయలసీమ కథాంశంతో కూడిన సినిమా కావటంతో దానిని పక్కకు పెట్టినట్టు విశ్వసనీయ సమాచారం. ఇక ఎన్టీఆర్ అవార్డ్ (NTR Award) విషయంలోనూ కమిటీ ప్రాపబుల్స్ గా చిరంజీవి, మోహన్ లాల్ (Mohanlal) ను ఎంపిక చేసినప్పటికీ బాలకృష్ణ (Balakrishna) పేరు తెరమీదకు వచ్చింది. అయితే తండ్రికి తగ్గ తనయుడుగా అన్ని రకాల జానర్స్ లో నటించటమే కాకుండా అటు రాజకీయపరంగా తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తుండటం, బసవతారకరామం ఆసుపత్రితో సామాజిక సేవ చేస్తుండటంతో బాలకృష్ణను ఎన్టీఆర్ అవార్డ్ కు ఎంపిక చేసినట్లు అంతర్గత సమాచారం. మిగిలిన అవార్డులలో రఘుపతి వెంకయ్య (Raghupathi Venkaiah) అవార్డ్ కు యండమూరి వీరేంద్రనాధ్ (Yandamuri Veerendranath) ను ఎంపిక చేయటం కొద్దిగా ఆశ్చర్యాన్ని కలిగించింది. దీనిని చిత్ర పరిశ్రమలో ఇన్ ఫ్రాస్ట్రక్చర్ అభివృద్దికి కృషి చేసిన వారికి ఇస్తూ వస్తుండటం ఆనవాయితీ. యండమూరి ప్రతిభావంతుడే అయినా ఈ కేటగిరిలో కాకుండా వేరే కేటగిరిలో ఇచ్చిఉండాల్సిందని పలువురి అభిప్రాయం. ఏది ఏమైనా అవార్డుల విషయంలో ఎవరూ బాహాటంగా విమర్శలకు దిగకపోవడంతో చిత్ర పరిశ్రమలో ఈ గద్దర్ అవార్డుల ద్వారా సాధ్యమైనంత ఎక్కువ మందిని సంతృప్తి పరిచినట్లు భావించవచ్చు.

Also Read: Rishab Sheetty: ఫిల్మ్ యూనివర్స్ గా మారుతున్న 'కాంతార'

Also Read: Movies In Tv: అప‌రిచితుడు, వైశాలి, బేబీ, పొలిమేర‌2.. ఈ రోజు (జూన్‌3) తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో టెలికాస్ట్ అయ్యే సినిమాలివే

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Updated Date - Jun 03 , 2025 | 01:37 PM