Srivishnu: గీతా ఆర్ట్స్ లో రెండు సినిమాలు
ABN, Publish Date - May 17 , 2025 | 02:09 PM
ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ హీరో శ్రీవిష్ణుకు బంపర్ ఆఫర్ ఇచ్చారు. 'సింగిల్' మూవీ ఫస్ట్ కాపీ చూడగానే రెండు సినిమాలు చేస్తానని మాట ఇస్తూ బ్లాంక్ చెక్ కూడా ఇచ్చారు.
తెలుగు సినిమా హీరోల్లో శ్రీవిష్ణు (Srivishnu) ది ఓ ప్రత్యేక శైలి. వినోదంతో పాటు చిన్నపాటి సందేశాన్ని కూడా తన చిత్రాల ద్వారా ఇవ్వాలని చూస్తుంటాడు. అయితే ఒక్కోసారి అవి టార్గెట్ ఆడియెన్స్ ను మెప్పించడంలో విఫలం కూడా అవుతుంటాయి. అయినా తన పంథాను మార్చుకోడు. 'సమ జవర గమన' (Samajavara Gamana) తర్వాత సరైన విజయం లేని శ్రీవిష్ణును 'హ్యాష్ ట్యాగ్ సింగిల్' (#Single) మూవీ సక్సెస్ గొప్ప ఓదార్పును ఇచ్చింది. ఈ సినిమాకు తొలుత డివైడ్ టాక్ వచ్చినా... సమ్మర్ సీజన్ లో విడుదలైన ఇతర చిత్రాలేవీ ఈ స్థాయిలో కూడా ప్రేక్షకులను ఆకట్టుకోకపోవడం '#సింగిల్' మూవీకి కలిసొచ్చింది. ఓ రకంగా ఇందులో హీరోయిన్లుగా నటించిన కేతిక శర్మ (Kethika Sharma) , ఇవానా (Ivana) కు కూడా '#సింగిల్' మెమొరబుల్ మూవీ అనుకోవచ్చు. కేతిక శర్మ కెరీర్ లోనే ఈ స్థాయిని అందుకున్న సినిమా మరొకటి లేదు. అలానే తమిళ నటి, 'లవ్ టుడే' (Love today) ఫేమ్ ఇవానాకు ఇదే తొలి తెలుగు సినిమా. ఈ చిత్రం విజయాన్ని ఆమె కూడా బాగా ఆస్వాదిస్తోంది. ఇక 'వెన్నెల' కిశోర్ (Vennela Kishor) ఇటీవల చాలా చిత్రాలలో కీలక పాత్రలు పోషించాడు. 'శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్' సినిమాలో హీరోగానూ చేశాడు. అయితే ఆ చిత్రాలేవీ పెద్దంతగా విజయాలను అందుకోలేదు. 'వెన్నెల' కిశోర్ కష్టానికి తగ్గ పేరు కూడా రాలేదు. కానీ '#సింగిల్' మూవీ విడుదలైన దగ్గర నుండి హీరో శ్రీవిష్ణుతో సరిసమానంగా 'వెన్నెల' కిశోర్ కామెడీని పండించాడని, అతనే ఇందులో సెకండ్ హీరో అని ప్రచారం జరిగింది. సో.. ఆ రకంగా 'వెన్నెల' కిశోర్ సైతం ఈ సినిమా విజయంతో హ్యాపీ!
ఇదిలా ఉంటే... '#సింగిల్' మూవీ సమర్పకులు అల్లు అరవింద్ (Allu Aravind) ఈ సినిమా విజయోత్సవంలో ఓ కీలక ప్రకటన చేశారు. '#సింగిల్' మూవీ తొలి కాపీ చూసిన వెంటనే శ్రీవిష్ణుతో ఒకటి కాదు రెండు సినిమాలు తీయాలనే నిర్ణయానికి వచ్చానని, అడ్వాన్స్ గా బ్లాంక్ చెక్ సైతం ఇచ్చానని అన్నారు. ఇవాళ సినిమా విడుదలైన తర్వాత హీరోలు, నిర్మాతలు ఎడముఖం పెడముఖంగా ఉండిపోతున్నారు. ప్రాఫిట్ వచ్చినా... లాస్ వచ్చినా... కూడా వారి మధ్య సంబంధాలు సజావుగా సాగడం లేదు. అలాంటి టైమ్ లో సినిమా జనంలోకి కూడా వెళ్ళకముందే అల్లు అరవింద్... శ్రీవిష్ణుతో మరో రెండు సినిమాలకు కమిట్ కావడం విశేషమే అని అంటున్నారు. సినిమాలో యాక్ట్ చేయడమే కాకుండా... ప్రమోషన్స్ విషయంలోనూ శ్రీవిష్ణు ప్రత్యేక శ్రద్ధ చూపడం అల్లు అరవింద్ కు బాగా నచ్చేసినట్టుంది. ఏదేమైనా... ప్రతిష్ఠాత్మక గీతా ఆర్ట్స్ లో లేదా జీఏ 2లో శ్రీవిష్ణు మరో రెండు సినిమాలు చేయబోతున్నాడు.
శ్రీవిష్ణు పై క్రైస్తవ సంఘాల ఆగ్రహం
శ్రీవిష్ణు సినిమాల్లోని కామెడీ ఇటీవల కొంత వివాదాలకూ తెర తీస్తోంది. '#సింగిల్' మూవీ ట్రైలర్ విడుదల కాగానే... అందులో కొన్ని సంభాషణలు మంచు ఫ్యామిలీని కించపరిచే విధంగా ఉన్నాయనే విమర్శలు వచ్చాయి. ఈ విషయమై 'మా' అధ్యక్షుడు కూడా అయిన మంచి విష్ణు సీరియస్ గా తీసుకున్నాడని అనుకున్నారు. ఈ వివాదం చినికి చినికి గాలివానగా మారకముందు శ్రీవిష్ణు ఆ సంభాషణలను తొలగిస్తున్నానని చెబుతూ, బేషరతుగా క్షమాపణలూ తెలిపాడు. అయితే... '#సింగిల్' తో పాటు దానికి ముందు వచ్చిన కొన్ని సినిమాల్లోనూ శ్రీవిష్ణు క్రైస్తవం మీద కామెడీ చేశాడు. దానిని ఆ వర్గం సీరియస్ గా తీసుకుంది. శ్రీవిష్ణు కావాలనే తమని టార్గెట్ చేస్తున్నాడని ఆరోపించింది. అతని చిత్రాలను బహిష్కరించాలని కూడా కొన్ని సంస్థలు సోషల్ మీడియాలో ప్రచారం మొదలు పెట్టాయి. అయితే శ్రీవిష్ణు అభిమానులు మాత్రం... ఈ విషయాన్ని తేలికగా కొట్టిపారేస్తున్నారు. అన్ని మతాల పట్ల అతనికి గౌరవం ఉందని, అయితే కొన్నింటిపై జరిగే ప్రచారాన్ని దృష్టిలో పెట్టుకునే కామెడీగా శ్రీవిష్ణు చేస్తాడు తప్పితే ఎవరినీ కించపర్చాలనే ఉద్దేశ్యం అతనిది కాదని సర్దుబాటు చేసే ప్రయత్నం చేస్తున్నారు.
Also Read: Comedian Praveen: బకాసుర రెస్టారెంట్ ట్రైలర్ విడుదల
Also Read: Hari Hara Veera Mallu: రెట్టించిన ఉత్సాహంతో...
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి