ANR: 'దేవదాసు' పాత్ర గురించి అభిమానికి జవాబు
ABN, Publish Date - Jul 27 , 2025 | 10:56 AM
అభిమానుల అభినందనలే అభినయమూర్తులకు అసలైన ఉత్తేజం కలిగించే ఔషధం! సదా ప్రశంసల జల్లులే కాదు సద్విమర్శలనూ కళాకారులు స్వీకరించాలి.
అభిమానుల అభినందనలే అభినయమూర్తులకు అసలైన ఉత్తేజం కలిగించే ఔషధం! సదా ప్రశంసల జల్లులే కాదు సద్విమర్శలనూ కళాకారులు స్వీకరించాలి. అప్పుడే వారిలోని అసలైన ప్రతిభ వెలుగొందుతుంది. ఈ అంశాన్ని తు.చ. తప్పక పాటించిన వారెందరో కళారంగంలో రాణించారు. చిత్రసీమలో మహానటులుగా జేజేలు అందుకున్నవారు, ప్రేక్షకుల అభిమానం చూరగొన్నవారు ఈ పంథాలోనే పయనించారు. అందుకే ఈ నాటికీ వారి కళను చర్చించుకుంటున్నాం. తెలుగు చిత్రసీమలో ఎందరో నటరత్నాలు తమదైన బాణీ పలికించారు. చిత్తూరు నాగయ్య, యన్టీఆర్, ఏయన్నార్(ANR), యస్వీఆర్, రేలంగి, అల్లు రామలింగయ్య, భానుమతి, సావిత్రి, అంజలీదేవి, జమున- ఇలా చెప్పుకుంటూ పోతే చేంతాడంత జాబితా సిద్ధమవుతుంది. వీరందరూ అభిమానులను అలరించడానికి ఎంతో శ్రమించినవారే! (ANR Letter to Fan)
ప్రస్తుత విషయానికి వస్తే మహానటుడు అక్కినేని నాగేశ్వరరావును తలచుకోగానే ఈ నాటికీ ఆయన అభిమానులు ముందుగా 'దేవదాసు' పాత్రనే గుర్తు చేసుకుంటారు.1953లో రూపొందిన 'దేవదాసు' చిత్రంతో ఏయన్నార్ జనం మదిలో చెరగని ముద్ర వేశారు. ఈ తరం ప్రేక్షకులు సైతం ఆ చిత్రాన్ని వీక్షిస్తే అక్కినేని అభినయాన్ని అభినందించకుండా ఉండలేరు. ఆ రోజుల్లోనే ఆరిపాక సూరిబాబు అనే అభిమాని అక్కినేని నాగేశ్వరరావుకు 'దేవదాసు' (Devadasu)పాత్ర గురించి ఓ ఉత్తరం రాశారు. అందుకు ఏయన్నార్ స్వదస్తూరితో రాసిన లేఖ ప్రస్తుతం లభ్యమవుతోంది. ఆ లేఖ సారాంశం ఇది...
'మిత్రులు ఆరిపాక సూరిబాబు గారికి నమస్తే... మీరు ప్రేమతో రాసిన కార్డు చేరింది. చాలా సంతోషం. మీరు నా పట్ల చూపిన అభిమానానికి నా కృతజ్ఞతలు తెల్పుతున్నా.
మహాకవి శరశ్చంద్రుడు సృష్టించిన దేవదాసు కథలో (నా దృష్టిలో) అతిక్లిష్టమైన దేవదాసు పాత్రను నేను నటించపోవడం, ఆ భయంతోనే దేవదాసు పాత్ర నటించడానికి అంగీకరించాను. పట్టుదలతో పనిచేశాను. నేనే కాకుండా, డైరెక్టరూ, కెమెరామన్, తదితర మిత్రులు, ఆ పాత్ర విజయవంతం కావడానికి సర్వవిధాలా సహాయం చేశారు. అనేక మంది ఏదో అనుకున్నా, అందరి సహాయంతో అతి కష్టమైన పాత్రతో, మీ బోటి సద్విమర్శకుల మెప్పు పొందానంటే మీరన్నట్లు ఈ పాత్ర దొరకడం నా అదృష్టంగానే భావిస్తున్నా. ఇకముందు కూడా, నా నటనద్వారా మీకింకా దగ్గర కావడానికి ప్రయత్నిస్తా'
సెలవు - మీ నాగేశ్వరరావు'