Akhanda2: అఖండ2.. ఎంత పని చేసింది! బాలయ్య సినిమా ఎఫెక్ట్.. ఆ సినిమాలు వాయిదా
ABN, Publish Date - Dec 09 , 2025 | 09:39 AM
ఈ ఏడాది నెలాఖరు, క్రిస్మస్ హాలీడేస్ వీటన్నింటిని పురస్కరించుకుని ఈ వారం థియేటర్లకు సినిమాలు లైన్ కట్టిన విషయం తెలిసిందే.
ఈ ఏడాది నెలాఖరు, క్రిస్మస్ హాలీడేస్ వీటన్నింటిని పురస్కరించుకుని ఈ వారం థియేటర్లకు సినిమాలు లైన్ కట్టిన విషయం తెలిసిందే. ముఖ్యంగా తెలుగులోనే 16 చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉండగా అందులో కార్తీ అన్నగారు వస్తారు (Annagaru Vostaru), రోషన్ కనకాల మోగ్లీ (Mowgli), ఆది పినిశెట్టి డ్రైవ్, హెబ్బా పటేల్, త్రిగుణ్ ఈషా (Isha), నందు సైక్ సిద్ధార్థ (PsychSiddhartha) వంటి పేరున్న నటులు నటించిన మూవీస్ ఉన్నాయి. ఎలాంటి పెద్ద సినిమాల రిలీజ్‌లు లేకపోవడంతో ఈ చిత్రాలన్నా పోటీపడి మరి విడుదలకు సిద్ధమయ్యాయి.
అయితే వీటన్నింటి ఆశలపై నీళ్లు చల్లుతూ బాలకృష్ణ అఖండ2 (Akhanda2 Thaandavam) చిత్రం సడన్‌గా ప్రేక్షకుల ఎదుటకు వచ్చేందుకు సిద్ధమైంది. గతవారమే విడుదల కావాల్సిన ఈ చిత్రం ఫైనాన్స్ సంబంధిత సమస్యలతో రిలీజ్ వాయిదా పడగా.. ఇప్పుడు అవన్నీ ఓ కొలిక్కి వచ్చాయి. దీంతో తాజాగా డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ సినిమాను ఎక్కువ రోజులు పోస్ట్‌పోన్ చేయకుండా తక్షణమే విడుదల చేయాలని ఒత్తిడులు రావడంతో అఖండ2 మేకర్స్ కూడా సినిమాను విడుదల చేయాలని నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. అయితే.. సినిమా రిలీజ్‌పై మంగళవారం ఉదయం వరకు ఈ చిత్రబృందం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఈరోజు సాయంత్రం ప్రెస్మీట్‌లో వివరాలు వెల్లడించనున్నారు.
అయితే.. సడన్‌గా అఖండ2 సినిమా ఎంట్రీతో ఇప్పుడు చిన్న చిత్రాల పరిస్దితి అగమ్య గోచరంగా తయారైంది. ఓ వైపు ఈ సినిమాల నిర్మాతలు అఖండ2 మేకర్స్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తూనే తమ సినిమాలను వాయిదా వేసుకోవాలా లేక రిలీజ్ చేయాలా అనే సందిగ్దంలో పడిపోయారు. అఖండ2 వచ్చేది రానిది చెబితే మేం మా ప్రత్యామ్నాయాలు చూసుకుంటామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందిగ్ద పరిస్థితులు ఇలా ఉంటే.. రోషన్ కనకాల, సందీప్ రాజ్ మోగ్లీ, బన్నీ వాస్ రిలీజ్ చేస్తున్న హర్రర్ సినిమా ఈషా రెండు చిత్రాలు తమ విడుదలలను అధికారికంగా వాయిదా వేసుకున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే మోగ్లీలో కీ రోల్ చేసిన నటుడు , దర్శకుడు బండి సరోజ్ అఖండ మేకర్స్ పై సీరియస్ అవుతూ నిద్ర లేకుండా చేస్తూన్నారని, ఎన్నో వందల మంది కష్టం బూడిద పాలు అయ్యేలా ఉందని, రిలీజ్ డేట్ చెప్పాలంటూ ఫైర్ అయ్యారు. అయితే. .ఈ సినిమాల వాయిదాపై కూడా అధికారిక సమాచారం రావాల్సి ఉంది.