Akhanda 2 Thaandavam: స్పీడు పెంచిన అఖండ.. అస్సలు ఆగేదేలే
ABN, Publish Date - Nov 24 , 2025 | 05:55 PM
బాలకృష్ణ(Nandamuri Balakrishna) తన తొలి పాన్ ఇండియా మూవీ 'అఖండ-2-తాండవం (Akhanda 2 Thaandavam)' ను జనాల్లోకి తీసుకువెళ్ళడానికి విశేషంగా కృషి చేస్తున్నారు
Akhanda 2 Thaandavam: బాలకృష్ణ(Nandamuri Balakrishna) తన తొలి పాన్ ఇండియా మూవీ 'అఖండ-2-తాండవం (Akhanda 2 Thaandavam)' ను జనాల్లోకి తీసుకువెళ్ళడానికి విశేషంగా కృషి చేస్తున్నారు. మొన్న ముంబైలో, తరువాత వైజాగ్ లో, ఆ పై చిక్కబల్లాపూర్ లో 'అఖండ-2- తాండవం' జనం మధ్య సాగింది. ఉత్తరప్రదేశ్ లో మాత్రం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ను కలసి ఆయనకు సినిమాలో అఖండ ఉపయోగించే త్రిశూలాన్ని బహూకరించారు. బాలయ్యతో పాటు చిత్ర కథానాయిక సంయుక్తా మీనన్(Samyukta Menon), డైరెక్టర్ బోయపాటి శ్రీను (Boyapati Sreenu), నిర్మాతల్లో ఒకరైన గోపీ ఆచంట కూడా ముఖ్యమంత్రి యోగిని కలుసుకున్నవారిలో ఉన్నారు. యోగి 'అఖండ-2' యూనిట్ ను అభినందించారు. ప్రస్తుతం ఉత్తరాదిన సైతం 'అఖండ-2- తాండవం' కోసం జనం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
'అఖండ' చిత్రం 2021 డిసెంబర్ 2వ తేదీన విడుదలై విజయఢంకా మోగించింది. ఈ సినిమాలోని హైందవ ధర్మ ప్రచారం అందరినీ ఆకర్షించింది. తరువాత 'అఖండ'ను హిందీలోనూ డబ్ చేసి విడుదల చేయగా, ఉత్తరాదిన సైతం మంచి ఆదరణ పొందింది. దీనిని దృష్టిలో పెట్టుకొనే ఇప్పుడు 'అఖండ-2- తాండవం'ను పాన్ ఇండియా మూవీగా రూపొందించారు. ఈ చిత్రంలో సనాతన ధర్మం గొప్పతనాన్ని విశేషంగా చాటుతున్నారని తెలుస్తోంది. డిసెంబర్ 5వ తేదీన 'అఖండ-2' విడుదలవుతోంది. తెలుగునేలపై, అమెరికాలోనూ ఓ రోజు ముందుగానే అంటే డిసెంబర్ 4వ తేదీ రాత్రి ప్రీమియర్ షోస్ ప్రదర్శించనున్నారు. ఈ సినిమా బాలయ్య కెరీర్ లోనే హయ్యెస్ట్ ఓపెనింగ్స్ చూస్తుందని ట్రేడ్ పండిట్స్ అప్పుడే లెక్కలు వేస్తూ ఉండడం విశేషం!
'అఖండ-2- తాండవం' ప్రచారం హంగామా ఓ వైపు సాగుతూ ఉండగానే, మరోవైపు నవంబర్ 26వ తేదీన బాలకృష్ణ కొత్త సినిమా ప్రారంభం కానుంది. ఇంతకు ముందు బాలయ్యతో 'వీరసింహారెడ్డి' వంటి బంపర్ హిట్ తెరకెక్కించిన గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఈ సినిమా రూపొందనుంది. నయనతార నాయికగా నటించే ఈ చిత్రంలో తమన్నా ఓ స్పెషల్ సాంగ్ లో నర్తించనుందని సమాచారం. ఈ సినిమా బాలకృష్ణకు 111వ చిత్రం కావడంతో అభిమానుల్లోనూ ఓ స్పెషల్ క్రేజ్ అప్పుడే నెలకొంది. బాలయ్యతో ఇప్పటికే హ్యాట్రిక్ సాధించిన బోయపాటి శ్రీను 'అఖండ-2'తో వస్తున్నారు. మరోవైపు బాలయ్యతో గోపీచంద్ మలినేని రెండో సినిమా సెట్స్ పైకి వెళ్తోంది... ఇలా ఫ్యాన్స్ కు డబుల్ జోష్ అందిస్తున్నారు బాలయ్య. మరి 'అఖండ-2- తాండవం' ఏ తీరున థియేటర్లలో సందడి చేస్తుందో చూడాలి.