Baahubali - The Epic: తాయిలాలతో తృప్తి పడమంటున్న అడివి శేష్
ABN , Publish Date - Oct 29 , 2025 | 04:58 PM
ఈ యేడాది తాను నటించిన మూడు సినిమాలు వస్తాయని చెప్పిన అడివి శేష్ మాట తప్పారు. అతను సినిమాలు 'జి2', 'డకాయిట్' వచ్చే యేడాదికి వాయిదా పడ్డాయి. అతను అతిథి పాత్రలు పోషించిన 'హిట్ -3, బాహుబలి: ది ఎపిక్'తో అభిమానులు తృప్తి పడాల్సి వస్తోంది.
గత యేడాది అడివి శేష్ తన అభిమానులకు ఓ హామీ ఇచ్చాడు. 2023, 2024లో తన సినిమాలేవీ విడుదల కాకపోయినా వర్రీ కావద్దని, 2025లో తాను నటించే మూడు సినిమాలు రిలీజ్ అవుతున్నాయని చెప్పాడు. అప్పటికే అడివి శేష్ 'గూఢచారి -2' (G2) , 'డకాయిట్' (Dacoit) మూవీస్ చేస్తున్నాడు. అవి రెండు అప్పటికే చాలా లేట్ అయిన ప్రాజెక్ట్స్ కాబట్టి వాటిని పూర్తి చేసి 2025లో ఖచ్చితంగా అడివి శేష్ రిలీజ్ చేస్తాడని అంతా భావించారు. మరి అతను చెప్పిన మూడో చిత్రం ఏదై ఉంటుందా అని గెస్ చేయడం మొదలు పెట్టారు. చిత్రం ఏమంటే... అడివి శేష్ ఉదహరించిన ఆ మూడో సినిమా 'హిట్ -3'. ఆ సినిమాలో తాను నటిస్తున్నట్టు అడివి శేష్ చెప్పలేదు. ఎందుకంటే... 'హిట్ -2'లో హీరోగా నటించిన అతను 'హిట్ -3' (Hit 3)లో ఉంటాడని మొదట చెప్పలేదు. అతని ఎంట్రీని ఆడియెన్స్ థ్రిల్ గా ఫీలవ్వాలని మేకర్స్ భావించారు. అయితే ఆడియెన్స్ నిజంగా ఎదురుచూసిన 'జి2', 'డకాయిట్' మూవీస్ మాత్రం ఈ యేడాది విడుదల కాలేదు. సో... ఆ రకంగా అడివి శేష్ ఫుల్ మీల్స్ కోసం ఎదురుచూస్తున్న తన అభిమానులకు తాయిలం మాదిరి 'హిట్ -3'ని అందించాడు. ఇక్కడే ఇంకో సర్ ప్రైజ్ కూడా ఉంది. అది అడివి శేష్ కూడా ఊహించనిది. అతను కీలక పాత్ర పోషించిన 'బాహుబలి' మూవీ కూడా ఇప్పుడు రీ-రిలీజ్ అవుతోంది. 'బాహుబలి' రెండు భాగాలను కలిపి రాజమౌళి 'బాహుబలి - ది ఎపిక్' (Baahubali : The Epic) పేరుతో అక్టోబర్ 31న విడుదల చేస్తున్నారు. ఇందులో అడివి శేష్... రానా కొడుకు పాత్రను పోషించాడు. సో... ప్రభాస్, రానాతో పాటు అడివి శేష్ ను కూడా అతని అభిమానులు ఎంచక్కా చూసేయొచ్చు.
ఇదిలా ఉంటే... డిసెంబర్ 25న విడుదల కావాల్సిన అడివి శేష్ 'డకాయిట్' మూవీ మార్చి 19కి వాయిదా పడగానే చాలా మంది ఆశ్చర్యపోయారు. ఎందుకంటే అదే రోజున యశ్ నటిస్తున్న 'టాక్సిక్' మూవీ విడుదల కావాల్సి ఉంది. 'కె.జి.ఎఫ్.' మూవీస్ తర్వాత యశ్ కీర్తి జాతీయ స్థాయికి చేరింది. దానికి తగ్గట్టే 'టాక్సిక్'ను అంతే భారీగా దర్శకురాలు గీతూ మోహన్ దాస్ తెరకెక్కిస్తోంది. ఇప్పుడు తెలుగు, హిందీ భాషల్లో రూపుదిద్దుకున్న 'డకాయిట్'ను అదే రోజు విడుదల చేస్తున్నారంటే... బహుశా 'టాక్సిక్' మూవీ విడుదల వాయిదా పడి ఉండొచ్చనే సందేహాన్ని కొందరు వ్యక్తం చేస్తున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో!
Also Read: Rajendra Prasad: చాలా పెద్ద మాట అన్నావ్ నటకిరీటి.. అవ్వకపోతే ఏంటి నీ పరిస్థితి
Also Read: Tollywood: ఒకే థీమ్... రెండు సినిమాలు... ఒకే రోజు విడుదల...