Dacoit: తెలుగోడు, హీందీవోడు కలసి చేశాం.. అమెరికన్ స్టైల్‌లో ఉంటుంది
ABN, Publish Date - Dec 19 , 2025 | 05:45 AM
అడివి శేష్ కథానాయకుడిగా షానియల్ డియో దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న రొమాంటిక్ యాక్షన్ మూవీ ‘డెకాయిట్’.
అడివి శేష్ (Adivi Sesh) కథానాయకుడిగా షానియల్ డియో (Shaneil Deo) దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న రొమాంటిక్ యాక్షన్ మూవీ ‘డెకాయిట్’. మృణాల్ ఠాకూర్ కథానాయిక (Mrunal Thakur). బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ (Anurag Kashyap) కీలక పాత్ర పోషించారు.
అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో సుప్రియ యార్లగడ్డ, సునీల్ నారంగ్ నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది మార్చి 19న థియేటర్లలో విడుదల కానుంది. గురువారం నిర్వహించిన కార్యక్రమంలో టీజర్‌ని ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా అడివి శేష్ మాట్లాడుతూ‘ఒక తెలుగోడు, హీందీవోడు కలసి చేసిన చిత్రమిది. నేను, దర్శకుడు షానియల్ కలసి కథ రాశాము. తను అమెరికన్ స్టైల్‌లో తీశారు. అంతర్జాతీయ ప్రమాణాలతో చిత్రాన్ని తెరకెక్కించాం. ఇందుకు సుప్రియగారు ఎంతో ప్రోత్సహించారు’ అని చెప్పారు. అనంతరం హీరో, హీరోయిన్లు ఇద్దరు.. సినిమాలోని మెయిన్ థీమ్‌కు సంబంధించి గులాబీ పువ్వు, గన్ గురి పెట్టే ఓ చిన్న సన్నివేశాన్ని స్టేజీపై ప్రదర్శించి ఆహుతులను ఆకట్టుకున్నారు.