Aditya Hasan: సక్సెస్ ఫుల్ కాంబోతో 'లిటిల్ హార్ట్స్'
ABN , Publish Date - Aug 02 , 2025 | 06:13 PM
'నైన్టీస్ మిడిల్ క్లాస్ బయోపిక్' దర్శకుడు ఆదిత్య హాసన్ నిర్మాతగా మారి తెరకెక్కించిన సినిమా 'లిటిల్ హార్ట్స్'... 'నో టచింగ్... ఓన్లీ హార్ట్ టచింగ్' అనేది దీని ట్యాగ్ లైన్.
ఓటీటీలో మంచి విజయం సాధించిన నటీనటులు, టెక్నీషియన్స్ తమ తర్వాత టార్గెట్ సిల్వర్ స్క్రీన్ అని భావిస్తుంటారు. అలా కొన్ని వెబ్ సీరిస్ చేసిన మేకర్స్, మూవీస్ చేసిన డైరెక్టర్స్ ఆ తర్వాత థియేట్రికల్ రిలీజ్ కు వచ్చిన ఉదాహరణలు చాలానే ఉన్నాయి. 'నైన్టీస్ మిడిల్ క్లాస్ బయోపిక్' దర్శకుడు ఆదిత్య హాసన్ (Aditya Hasan) ఇప్పుడు నిర్మాతగా మారి 'లిటిల్ హార్ట్స్' (Little Hearts) అనే సినిమాను నిర్మించాడు. ఆ వెబ్ సీరిస్ లో నటించిన మౌళీ తనుజ్ (Mouli Tanuj) 'లిటిల్ హార్ట్స్'లో హీరోగా నటిస్తున్నాడు. అలానే 'అంబాజీపేట మ్యారేజి బ్యాండు' మూవీతో గుర్తింపు తెచ్చుకున్న శివానీ నాగరం (Shivani Nagaram) ఇందులో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీని సాయి మార్తాండ్ డైరెక్ట్ చేస్తున్నాడు.
ఈటీవీ విన్ ఒరిజినల్ (ETV Win Original) అయిన 'లిటిల్ హార్ట్స్' లో మౌళి తనుజ్, రాజీవ్ కనకాల తండ్రీ కొడుకులుగా నటిస్తున్నారు. ఇతర ప్రధాన పాత్రలను ఎస్.ఎస్. కాంచి, అనితా చౌదరి, సత్య కృష్ణన్ తదితరులు చేశారు. ఇందులో ఫ్యామిలీ ఎమోషన్స్, ఎంటర్ టైన్ మెంట్ సమపాళ్ళలో ఉంటాయని మేకర్స్ చెబుతున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 12న థియేట్రికల్ గా రిలీజ్ చేయబోతున్నారు. విశేషం ఏమంటే... కంటెంట్ నచ్చి ప్రముఖ నిర్మాత బన్నీ వాస్ (Bunny Vas), వంశీ నందిపాటి (Vamsi Nandipati) ఈ మూవీని థియేటర్లలో రిలీజ్ చేయడానికి ముందుకొచ్చారు. వంశీ నందిపాటి గతంలో విడుదల చేసిన 'పొలిమేర -2, కమిటీ కుర్రాళ్ళు, క' చిత్రాలు మంచి విజయాన్ని అందించాయి. మరి నిర్మాతగా మారిన ఆదిత్య హాసన్ కు 'లిటిల్ హార్ట్స్' ఏ స్థాయి సక్సెస్ ను ఇస్తుందో చూడాలి.