Samantha: ఎట్టకేలకు.. సినిమా స్టార్ట్ చేసిన సమంత!
ABN, Publish Date - Oct 23 , 2025 | 06:17 PM
కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉన్న టాలీవుడ్ క్వీన్ సమంత (Samantha) ఎట్టకేలకు మేకప్ వేసుకుంది.
గత కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉన్న టాలీవుడ్ క్వీన్ సమంత (Samantha Ruth Prabhu) ఎట్టకేలకు మేకప్ వేసుకుంది. చివరగా 2023లో శాకుంతలం, ఆ తర్వాత విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) ఖుషి (Kushi) సినిమాలతో ప్రేక్షకులను అలరించిన ఈ ముద్దుగుమ్మ రెండేండ్ల విరామం తర్వాత తిరిగి సినిమా సెట్‌లో అడుగు పెట్టింది. మధ్యలో సిటాడెల్ వెబ్ సిరీస్, ఈ యేడు శుభం సినిమాలో ఓ చిన్న పాత్రలో మాత్రమే కనిపించింది.
అయితే.. గత సంవత్సరం ఏప్రిల్ నెలలోనే ఓ బేబీ ఫేం నందిని రెడ్డి (Nandini Reddy) దర్శకత్వంలో మా ఇంటి బంగారం (Maa Inti Bangaram) అనే చిత్రం చేస్తున్నట్లు పోస్టర్ సైతం రిలీజ్ చేసి ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత మరలా ఆ సినిమా గురించి చర్చే లేకుండా పోయింది. అసలు ఆ సినిమా ఉంటుందా ఉండదా అనే డౌటనుమానాలు కూడా వచ్చాయి.
ఇప్పుడు ఆ వార్తలన్నింటికీ చెక్ పెడుతూ తాజాగా దీపావళి పండుగ ముగిసిన రెండు రోజుల తర్వాత ఆక్టోబర్ 22 బుధవారం రోజున హైదరాబాద్‌లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభించారు. ఇప్పటికే శుభం సినిమాను నిర్మించిన సమంత తన రెండో ప్రయత్నంగా ఈ మా ఇంటి బంగారం సినిమాను నిర్మిస్తుండడం విశేషం. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు మేకర్స్ త్వరలోనే ప్రకటించనున్నారు.