సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Pragathi: ఇండియా పవర్ ఏంటో చూపించిన ప్రగతి.. 49 ఏళ్ల వయస్సులో కూడా..

ABN, Publish Date - Dec 06 , 2025 | 10:05 PM

ఆడది అంటే అబల కాదు సబల.. ఆడది తలుచుకుంటే ఏదైనా చేయగలదు అనే మాటలు ఎప్పుడు వింటూనే ఉంటాం. తాజాగా ఆడది తలుచుకుంటే ఏదైనా సాధించగలదు అని మరోసారి నిరూపించింది నటి ప్రగతి (Pragathi).

Pragath

Pragathi: ఆడది అంటే అబల కాదు సబల.. ఆడది తలుచుకుంటే ఏదైనా చేయగలదు అనే మాటలు ఎప్పుడు వింటూనే ఉంటాం. తాజాగా ఆడది తలుచుకుంటే ఏదైనా సాధించగలదు అని మరోసారి నిరూపించింది నటి ప్రగతి (Pragathi). అతి చిన్న వయస్సులో పెళ్లి చేసుకొని.. తల్లిగా మారి.. తనకంటూ ఒక పనిని వెతుక్కొని నటిగా మారి.. ఎన్నో మంచి పాత్రల్లో నటించి, మెప్పించిన ప్రగతి.. 49 ఏళ్ళ వయస్సులో తనకంటూ ఒక లక్ష్యాన్ని పెట్టుకొని, దాన్ని సాధించడానికి అహర్నిశలు శ్రమించి అంతర్జాతీయ క్రీడా వేదికపై సరికొత్త చరిత్ర సృష్టించింది.

నటనతో పాటు పవర్‌లిఫ్టింగ్‌పై తనకు ఉన్న మక్కువను ఎప్పుడూ దాచుకోని ప్రగతి.. నెమ్మదిగా రాష్ట్ర, జాతీయ స్థాయిలో పతకాలను గెలుస్తూ వచ్చింది. తాజాగా టర్కీలోని ఇస్తాంబుల్‌లో జరిగిన ప్రతిష్టాత్మక ఏషియన్ ఓపెన్ అండ్ మాస్టర్స్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్ లో పాల్గొని, ఏకంగా నాలుగు పతకాలు సాధించి ఇండియాలో మహిళలకు ఉన్న పవర్ ఏంటో నిరూపించింది. గత కొన్నేళ్లుగా ఆమె తన వ్యక్తిగత జీవితంలో ఫిట్‌నెస్‌కి, ముఖ్యంగా పవర్‌లిఫ్టింగ్‌కి అధిక ప్రాధాన్యత ఇస్తూ వస్తున్న విషయం తెల్సిందే.

నిత్యం సోషల్ మీడియాలో ఆమె పోస్ట్ చేసే వర్కౌట్ వీడియోలు, హెవీ లిఫ్ట్‌లు ఎందరికో ఆదర్శంగా నిలిచాయి. అయితే వీటిమీద కూడా ట్రోల్స్ వచ్చాయి. వయస్సు పెరుగుతున్న సమయంలో ఇలాంటివి అవసరమా అని విమర్శించినవారు ఉన్నారు. కానీ, వాటిని పట్టించుకోని ప్రగతి అనుకున్నది సాధించేవరకు నిద్రపోలేదు. ఇస్తాంబుల్‌లో జరిగిన ఈ అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనడానికి ఆమె చాలా కాలంగా కఠోర శిక్షణ తీసుకుంది. ఈ ఛాంపియన్‌షిప్‌లో ప్రగతి, తన మాస్టర్స్ విభాగంలో అత్యద్భుత ప్రదర్శన కనబరిచి, దేశానికి ప్రాతినిథ్యం వహించి నాలుగు పతకాలు సాధించడం విశేషం. స్క్వాట్‌, బెంచ్ ప్రెస్‌, డెడ్‌లిఫ్ట్‌లో ఒక్కో పతకంతో పాటు ఓవరాల్‌ విభాగంలో మరొక పతకం సాధించింది. ఒకే టోర్నమెంట్‌లో నాలుగు పతకాలు సాధించడం అనేది పవర్‌లిఫ్టింగ్‌లో ఆమె ప్రతిభకు నిదర్శనంగా నిలిచింది.

ప్రగతి విజయం.. సామాన్య మహిళలకు, ముఖ్యంగా గృహిణులకు, ఇతర రంగాల వారికి గొప్ప ప్రేరణగా నిలుస్తోంది. వృత్తి జీవితానికి, వ్యక్తిగత అభిరుచులకు తగ్గట్లు లైఫ్‌ని బ్యాలన్స్‌ చేయవచ్చని, కలలను నెరవేర్చుకోవడానికి వయస్సు అడ్డంకి కాదని ఆమెనిరూపించింది. నటనతో పాటు క్రీడల్లోనూ తన సత్తా చాటిన ప్రగతికి సినీ పరిశ్రమ నుండి, అభిమానుల నుండి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. అప్పుడు విమర్శించినవారే ఇప్పుడు ఆమెను ప్రశంసిస్తున్నారు.

Updated Date - Dec 06 , 2025 | 10:05 PM