Anu Emmanuel: ‘ది గర్ల్‌ఫ్రెండ్’ లో నా నటనకు.. అబ్బాయిలు క్లాప్స్ కొడుతున్నారు
ABN, Publish Date - Nov 12 , 2025 | 12:12 PM
‘ది గర్ల్‌ఫ్రెండ్’ సినిమాలో తన పాత్ర కన్నా కథే తనను ఎక్కువగా ఆకట్టుకుందంటూ నటి అనూ ఇమ్మాన్యుయేల్ చెప్పిన మాటలు వైరల్ అవుతున్నాయి.
‘ది గర్ల్‌ఫ్రెండ్’ (The Girlfriend) సినిమాలో నా పాత్ర కన్నా కథే నన్ను ఎక్కువగా ప్రభావితం చేసింది. ఈతరం అమ్మాయిలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి చర్చించే మంచి చిత్రమిది. అందుకే హీరోయిన్ పాత్ర కాకపోయినా అంగీకరించాను. కొన్ని సన్నివేశాల్లో నా నటనకు అబ్బాయిలు క్లాప్స్ కొడుతుండడం సంతోషాన్నిస్తోంది’ అని అనూ ఇమ్మాన్యుయేల్ (Anu Emmanuel) అన్నారు.
రష్మిక మందన్న (Rashmika Mandanna) లీడ్‌రోల్‌లో రాహుల్ రవీంద్రన్ (Rahul Ravindran) దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇటీవలే విడుదలై చక్కటి ఆదరణతో కొనసాగుతోంది. ప్రేక్షకుల నుంచి ప్రశంసలు లభిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ప్రధాన తారాగణం అంతా కలిసి సినిమాను మరోసారి వీక్షించారు. ఈ సందర్భంగా ఈ చిత్రంలో కీలకపాత్ర పోషించిన అనూ ఇమ్మాన్యుయేల్ మూవీ చూసిన అనంతరం మీడియాతో మాట్లాడారు.
ఒక మంచి సినిమాలో భాగమవ్వాలనే ఈ చిత్రంలో చేశాను. ఈ సినిమాను మంచి హిట్‌గా నిలిపిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. ఇందులో దుర్గ అనే పాత్రలో నటించాను. నా వ్యక్తిత్వానికి పూర్తి భిన్నంగా ఉండే పాత్ర కావడంతో ప్రేక్షకులు ఎలా స్పందిస్తారో అని కంగారు పడ్డాను. రాహుల్ నా పాత్రను ప్రత్యేక శ్రద్ధతో తీర్చిదిద్దారు. ఇకపై నటనకు ఆస్కారమున్న కథానాయికల పాత్రలే చేయాలనుకుంటున్నాను’ అని ఆమె చెప్పారు.