Mangli: అసభ్యకర కామెంట్స్.. పోలీస్‌స్టేషన్‌కు మంగ్లీ
ABN, Publish Date - Nov 28 , 2025 | 07:03 AM
ప్రముఖ ఫోక్ సింగర్ మంగ్లీ (Mangli) తాజాగా విడుదల చేసిన ‘బాయిలోనే బల్లి పలికే’ (Bayilone Ballipalike) పాట సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
ప్రముఖ ఫోక్ సింగర్ మంగ్లీ (Mangli) తాజాగా విడుదల చేసిన ‘బాయిలోనే బల్లి పలికే’ (Bayilone Ballipalike) పాట సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఆమెతో పాటు నాగవ్వ (Nagavva) ఆలపించిన ఈ పాట రిలీజ్ అయిన కొద్దిసేపటికే రీల్స్, షార్ట్ వీడియోలతో నెట్టింట వైరల్ అయింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఇప్పటికే లక్షల సంఖ్యలో రీల్స్ వచ్చాయి. కమల్ ఎస్లావత్ (Kamal Eslavath) రాసిన పాటకు సురేష్ బోబ్బిలి (Suresh Bobbili) సంగీతం అందించగా, మంగ్లీ వేసిన స్టెప్పులు ఆమె ఎనర్జిటిక్ సింగింగ్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి.
అయితే.. తాజాగా ఈ పాటపై కొంతమంది చేసిన అసభ్యకర, అవమానకర వ్యాఖ్యలు వివాదానికి దారి తీశాయి. ప్రత్యేకంగా ఎస్టీ వర్గాన్ని కించపరుస్తూ ఓ వ్యక్తి తీవ్ర స్థాయిలో కామెంట్స్ చేసినట్లు తెలిసింది. దీనిపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన మంగ్లీ, సంబంధిత వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎస్.ఆర్.నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.
పాట భారీగా పాపులర్ అవుతుండగా.. అదే సమయంలో ఇలాంటి కామెంట్స్ రావడం, మంగ్లీ నేరుగా పోలీసుల వద్దకు వెళ్లడం ఇప్పుడు సినీ వర్గాలు, సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. పోలీసులు ఫిర్యాదును నమోదు చేసి విచారణ ప్రారంభించినట్లు సమాచారం.
ఇదిలాఉంటే.. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు సింగర్ మంగ్లీ గురించి బూతులు తిడుతూ, మంగ్లీ పైన అసభ్యకర పదజాలంతో వీడియో పోస్ట్ చేసిన మాట్లాడిన మేడిపల్లి స్టార్ అనే ఇన్‌స్టాగ్రామర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో హాల్‌చల్ చేస్తోంది.