Aadi Pinisetty: ఇక్కడ విలన్.. అక్కడ హీరో! ఆది.. బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలు
ABN , Publish Date - Dec 03 , 2025 | 06:35 PM
'అఖండ -2'లో విలన్ గా నటించిన ఆది పినిశెట్టి, 'డ్రైవ్' మూవీలో హీరోగా చేశాడు. ఈ రెండు సినిమాలు బ్యాక్ టూ బ్యాక్ విడుదల కాబోతున్నాయి.
ఆది పినిశెట్టి (Aadi Pinisetty)... ప్రముఖ దర్శకుడు రవిరాజా పినిశెట్టి తనయుడు. తేజ (Teja) దర్శకత్వంలో దాసరి నారాయణరావు (Dasari Narayana Rao) నిర్మించిన 'ఒక 'వి'చిత్రం'తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత తెలుగులో కంటే తమిళంలో హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అయినా మాతృభాష తెలుగు మీద ప్రేమకొద్ది అడపా దడపా ఇక్కడా సినిమాలు చేస్తున్నాడు. 'గుండెల్లో గోదారి', 'మలుపు', 'నిన్ను కోరి' వంటి సినిమాలు తీసుకురాని పేరు 'రంగస్థలం' సినిమాతో వచ్చింది. దానికి ముందు బోయపాటి శ్రీను (Boyapati Srinu) తెరకెక్కించిన 'సరైనోడు'లో చేసిన వైరం ధనుష్ పాత్రతో తనలోని విలనీని బయటకు తీశాడు ఆది పినిశెట్టి. అప్పటి ఆ అనుబంధంతో ఇప్పుడు బోయపాటి మరోసారి 'అఖండ 2 తాండవం' (Akhanda 2 Thandavam) లో ఆది పినిశెట్టిని విలన్ గా బాలకృష్ణ ముందు నిలబెట్టాడు. తాంత్రికుడిగా ఆది పినిశెట్టి పోషించిన పాత్ర ఈ సినిమాకు మెయిన్ హైలైట్ అని మేకర్స్ చెబుతున్నారు. 'అఖండ -2' చిత్రం డిసెంబర్ 5న జనం ముందుకు వస్తోంది.
విశేషం ఏమంటే... 'అఖండ -2' విడుదలైన వారం తర్వాత అంటే డిసెంబర్ 12న ఆది పినిశెట్టి హీరోగా నటించిన 'డ్రైవ్' (Drive) మూవీ విడుదల కాబోతోంది. మలయాళ దర్శకుడు జేనూస్ మొహ్మద్ (Jenuse Mohamed) తెరకెక్కించిన ఈ సినిమాను వి. ఆనంద్ ప్రసాద్ భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మించారు. గురువారం ఈ సినిమా టీజర్ రిలీజ్ అవుతోంది.

ఈ యేడాది ప్రారంభంలో ఆది పినిశెట్టి నటించిన 'శబ్దం' మూవీ విడుదలైంది. కమర్షియల్ గా అదేమంత సక్సెస్ కాలేదు. అయితే ఇప్పుడు అతను విలన్ గా నటించిన 'అఖండ 2' విడుదల కానుండటం, ఆ వెనుకే హీరోగా నటించిన 'డ్రైవ్' వస్తుండటంతో ఆది నటనలోని వైవిధ్యాన్ని వీక్షించవచ్చని సినిమా జనాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి ఈ సినిమాలు ఆది పినిశెట్టికి ఎలాంటి గుర్తింపును ఇస్తాయో చూడాలి.
Also Read: Thiru Veer: ఓ.. సుకుమారిగా ఐశ్వర్య రాజేశ్
Also Read: Samantha: మా ఇంటికి స్వాగతం వదినమ్మా.. రాజ్ చెల్లి ఎమోషనల్ పోస్ట్