Thiru Veer: ఓ.. సుకుమారిగా ఐశ్వర్య రాజేశ్
ABN , Publish Date - Dec 03 , 2025 | 05:05 PM
తిరువీర్, ఐశ్వర్య రాజేశ్ జంటగా నటిస్తున్న పాన్ ఇండియా మూవీకి 'ఓ సుకుమారీ' అనే పేరు ఖరారు చేశారు.
యంగ్ హీరో తిరువీర్ (Thiru Veer) 'ప్రీ వెడ్డింగ్ షో' (Pre Wedding Show) తోనూ, ట్యాలెంటెడ్ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ (Aishwarya Rajesh) ‘సంక్రాంతికి వస్తున్నాం’ (Sankranthiki Vasthunnam) తోనూ చక్కని విజయాలను ఈ యేడాది తమ ఖాతాలో వేసుకున్నారు. ఇప్పుడు వీరిద్దరూ కలిసి ఓ హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ను చేస్తున్నారు. భరత్ దర్శన్ ను దర్శకుడిగా పరిచయం చేస్తూ, దర్శకత్వంలో గంగా మహేశ్వర రెడ్డి మూలి ఈ సినిమాన నిర్మిస్తున్నారు. విమర్శకుల ప్రశంసలు పొందిన తొలి సినిమా 'శివం భజే' తర్వాత ఈ బ్యానర్ లో రూపొందుతన్న చిత్రమిది.
బుధవారం ఈ సినిమా మేకర్స్ తమ కొత్త సినిమా టైటిల్ ను రిలీల్ చేస్తూ ఓ పోస్టర్ ను విడుదల చేశారు. ఈ చిత్రానికి 'ఓ...! సుకుమారి' (Oh..! Sukumari) అనే పేరు పెట్టారు.

టైటిల్ లోగో పోస్టర్ లో నీలిరంగు హృదయ చిహ్నాన్ని ఒక అద్భుతమైన నారింజ రంగు మెరుపుతో డివైడ్ చేశారు. అలానే ఓ ఉరుము గ్రామంలో చెరువు ఒడ్డున ఉన్న మర్రిచెట్టును తాకుతూ ఉంది. దాంతో గ్రామీణులు భయంతో పరుగులు పెట్టడం ఉంది. మరో వైపు ఇద్దరు యువకులు గ్రామంలోకి బైక్ మీద వస్తూ ఉన్నారు. ఈ పోస్టర్ చూస్తుంటే... గ్రామీణ నేపథ్యంలో జరిగే భిన్నమైన కథా చిత్రమిదని అనిపిస్తోంది.
'రజాకార్, పోలిమేర' చిత్రాలకు సినిమాటోగ్రఫీ చేసిన సిహెచ్. కుషేందర్ ఈ చిత్రానికి కెమెరామ్యాన్. ఎం.ఎం. కీరవాణి శిష్యుడు భరత్ మంచిరాజు సంగీతం సమకూరుస్తారు. 'బలగం' ఫేం తిరుమల ఎం. తిరుపతి ఆర్ట్ డైరెక్టర్, 'క' చిత్రానికి ఎడిటింగ్ చేసిన శ్రీవరప్రసాద్ కూర్పరి. 'స్వయంభు' చిత్రానికి పని చేస్తున్న అను రెడ్డి అక్కటి ఈ చిత్రానికి కాస్ట్యూమ్ డిజైనర్. పాపులర్ లిరిక్ రైటర్ పూర్ణచారి ఈ చిత్రంలోని పాటలు రాస్తున్నారు.
ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న 'ఓ...! సుకుమారి' సినిమాను తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్టు మేకర్స్ తెలిపారు. ఇందులో ఝాన్సీ, మురళీధర్ గౌడ్, ఆనంద్, అంజిమామ, శివానంద్, కోట జయరామ్ ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.
Also Read: Ghantasala biopic: డిసెంబర్ 5న ప్రీ రిలీజ్ ఫంక్షన్
Also Read: Samantha: మా ఇంటికి స్వాగతం వదినమ్మా.. రాజ్ చెల్లి ఎమోషనల్ పోస్ట్