Shiva Rajkumar: ఛాన్స్ వస్తే.. బాలయ్య బాబుతో సినిమా చేస్తా
ABN, Publish Date - Dec 28 , 2025 | 07:38 AM
శివ రాజ్‌కుమార్, ఉపేంద్ర, రాజ్ బి శెట్టి నటించిన ‘45 ది మూవీ’ జనవరి 1న విడుదల. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో చిత్ర బృందం ఆసక్తికర వ్యాఖ్యలు.
శివ రాజ్‌కుమార్ (Shiva Rajkumar), ఉపేంద్ర (Upendra), రాజ్ బి శెట్టి (Raj B Shetty) ప్రధాన పాత్రలు పోషించిన ‘45 ది మూవీ’ చిత్రం జనవరి ఒకటిన విడుదలవుతోంది. ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ అర్జున్ జన్య (Arjun Janya) దర్శకత్వంలో ఉమా రమేశ్‌రెడ్డి, ఎం.రమేశ్‌రెడ్డి నిర్మించారు.
శనివారం జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో శివ రాజ్‌కుమార్ మాట్లాడుతూ ‘అర్జున్ జన్య అద్భుతంగా ఈ చిత్రం కథను నాకు వినిపించడంతో మీరే డైరెక్ట్ చేయమని సలహా ఇచ్చాను. కన్నడంలో ఈ చిత్రం ఇప్పటికే విడుదలై విజయం సాధించింది. తెలుగులో మైత్రీ మూవీస్ సంస్థ ద్వారా విడుదలవుతున్నందుకు ఆనందంగా ఉంది. ఎన్ని రోజులు ఈ భూమి మీద ఉంటామో తెలీదు కానీ ఉన్నన్నీ రోజులూ సంతోషంగా బతకాలని ఈ చిత్రం చెబుతుంది’ అన్నారు. తెలుగులో మల్టీస్టారర్ ఛాన్స్ వస్తే బాలయ్య బాబుతో చేస్తానని ఈ సందర్భంగా తెలిపారు.
అర్జున్ జన్య ఈ సినిమాతో పెద్ద దర్శకుడవుతారని, శివన్నని ఇంతవరకూ ఇలా ఏ సినిమాలో చూడలేదనీ, అద్భుతమైన పాత్ర ఇందులో చేశారని ఉపేంద్ర అన్నారు. తెలుగువాళ్లు మంచి చిత్రాలను ఎప్పుడూ ఆదరిస్తారు, ఈ సినిమాకు కూడా సపోర్ట్ చేయాలని ఆయన కోరారు. ‘ఓ కొత్త ప్రపంచాన్ని ‘45 ది మూవీ’ లో చూస్తారు. మూడున్నర ఏళ్లు ఈ చిత్రం కోసం కష్టపడ్డాను’ అని అర్జున్ జన్య చెప్పారు. గరుడ పురాణం గురించి గొప్పగా చెప్పే సినిమా ఇదని నిర్మాత రమేశ్ రెడ్డి చెప్పారు.