Dokka Seethamma: డొక్కా సీతమ్మ బయోపిక్స్ వార్...

ABN , Publish Date - Sep 16 , 2025 | 01:01 PM

ఆంధ్రుల అన్నపూర్ణ డొక్కా సీతమ్మపై ఒకే సమయంలో మూడు బయోపిక్స్ తెరకెక్కుతున్నాయి. ఇందులో ఒకదానిలో ఆమని టైటిల్ రోల్ పోషిస్తుండగా, మరో చిత్రంలో శివక... డొక్కా సీతమ్మగా నటిస్తోంది. మరో సినిమా పట్టాలెక్కాల్సి ఉంది. ఏపీ ప్రభుత్వం ఇటీవల మధ్యాహ్న భోజనపథకానికి డొక్కా సీతమ్మ పేరు పెట్టడంతో ఆమె పేరు మరోసారి వెలుగులోకి వచ్చింది.

Dokka Seethamma Biopics

తెలుగు సినిమా రంగానికి చెందిన కొందరికి ఒక్కసారిగా ఆంధ్రుల అన్నపూర్ణ డొక్కా సీతమ్మ (Dokka Seethamma) పై ప్రేమ పుట్టుకొచ్చింది. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ముగ్గురు ఆమె జీవిత చరిత్రను వెండితెరకెక్కించడానికి ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇందులో ప్రధానంగా చెప్పుకోవాల్సిన సినిమా 'ఆంధ్రుల అన్నపూర్ణ డొక్కా సీతమ్మ'. ఇందులో టైటిల్ రోల్ ను ప్రముఖ నటి ఆమని (Aamani) పోషిస్తోంది. ఇతర ప్రధాన పాత్రలను మురళీమోహన్ (Murali Mohan), రాజమౌళి, ఆకెళ్ళ, జబర్దస్త్ అప్పారావు, రామసత్యనారాయణ తదితరులు పోషిస్తున్నారు. ఈ సినిమాను టి.వి. రవి నారాయణ్ దర్శకత్వంలో వల్లూరి రాంబాబు నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్ విడుదలైంది. కార్తీక్ కోడకండ్ల దీనికి సంగీతం అందిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉచిత మధ్యాహ్న భోజన పథకానికి డొక్కా సీతమ్మ పేరే పెట్టింది. ఈ సందర్భంగా ప్రముఖ నటుడు, ఎ.పి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలు తనలో స్ఫూర్తిని నింపాయని, అందుకే 'డొక్కా సీతమ్మ' జీవితం ఈ తరానికి తెలియాలనే ఉద్ధేశ్యంతో ఈ సినిమా తీస్తున్నామని దర్శక నిర్మాతలు చెబుతున్నారు. కమర్షియల్ గా కాకుండా సామాజిక సేవగానే ఈ సినిమాను నిర్మిస్తున్నామని దీనిపై వచ్చే లాభాలను ప్రభుత్వానికి విరాళంగా ఇస్తామని దర్శకుడు రవి నారాయణ్ తెలిపారు.


ఇదిలా ఉంటే... 'అన్నపూర్ణ తల్లి బువ్వమ్మ' పేరుతోనే డొక్కా సీతమ్మ బయోపిక్ మరొకటి తెరకెక్కుతోంది. ఇటీవల మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఈ సినిమా షూటింగ్ ముగింపు కార్యక్రమంలో పాల్గొన్నారు. డొక్కా సీతమ్మగా శివిక నటిస్తున్న ఈ సినిమాలో దర్శకుడు సముద్ర (Samudra), కుసుమ, సుప్రియ, నవీన్ మట్టా తదితరులు ఇతర ప్రధాన పాత్రలు చేస్తున్నారు. దీన్ని సురేశ్‌ లంకలపల్లి దర్శకత్వంలో సిరాజ్ ఖాదరన్ ఘోరి నిర్మిస్తున్నారు. తామీ చిత్రాన్ని నిర్మించడానికి పవన్ కళ్యాణ్ సందేశమే కారణమని వీరూ చెబుతున్నారు. దీనికి సాకేత్ వేగి సంగీతం అందిస్తున్నాడు.


ఇక ముచ్చటగా మూడో చిత్రాన్ని డొక్కా సీతమ్మపై అచ్చర్ల రాజబాబు తెరకెక్కిస్తున్నాడు. అతని దర్శకత్వంలో ఎ.ఆర్.బి. ఈ సినిమా నిర్మిస్తున్నాడు. దీనికి వీరు 'అపర అన్నపూర్ణ డొక్కా సీతమ్మ' అనే పేరు పెట్టారు. అయితే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఇంకా మొదలు కాలేదు. ఈ సినిమా టైటిల్ ఇవ్వమని కొందరు దర్శక నిర్మాతలు తమను అడిగారని, తాము అందుకు నిరాకరించామని, ఈ పేరుతో సినిమా ఎవరైనా తీస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఈ మేకర్స్ చెబుతున్నారు.

గతంలోనే ఇలా ఒకే వ్యక్తిపై బయోపిక్స్ తీసిన సందర్భాలు ఉన్నాయి. హిందీలో భగత్ సింగ్ పై ఒకేసారి రెండు బయోపిక్స్ 2002లో వచ్చాయి. అందులో ది లెజెండ్ ఆఫ్ భగత్ సింగ్ మూవీలో అజయ్ దేవ్ గన్ టైటిల్ రోల్ ప్లే చేశాడు. 'షాహిద్ ఎ అజామ్' మూవీలో సోనూసూద్ భగత్ సింగ్ గా నటించాడు. ఇప్పుడు కూడా డొక్కా సీతమ్మపై సినిమాలు తీస్తున్న ముగ్గురు సదుద్దేశ్యంతో ఆ సినిమాలు తీస్తున్నప్పుడు వాటి పేర్లులో కొంత భిన్నత్వం ఉంది కాబట్టి... ఒకరిపై ఒకరు చట్టపరమైన చర్యలకు పోకుండా... సినిమా తీసి జనం ముందు పెడితే... బాగున్న దానిని ప్రేక్షకులు ఆదరిస్తారు.

Also Read: Samyuktha: ప్రతి ఒక్కరికీ హెల్త్ కేర్ అవసరం

Also Read: Theater Movies: ఈ వారం, Sep19.. థియేట‌ర్ల‌లో రిలీజ‌య్యే సినిమాలివే

Updated Date - Sep 16 , 2025 | 01:01 PM