SS Rajamouli: పదేళ్ళ బాహుబలి...
ABN , Publish Date - Jul 09 , 2025 | 04:42 PM
రాజమౌళి జానపదం బాహుబలి సిరీస్ చేసిన సందడిని ఎవరూ మరచిపోలేరు. ఈ సిరీస్ లో బాహుబలి - ద బిగినింగ్ జూలై 10న పదేళ్ళు పూర్తి చేసుకుంటోంది. ఇప్పటికీ వార్తల్లో నిలచిన బాహుబలి సిరీస్ కొత్త హంగులతో మరోమారు జనాన్ని పలకరించనుందట. ఆ ముచ్చటేంటో చూద్దాం...
పదేళ్ళ క్రితం అంటే 2015 జూలై 10న 'బాహుబలి -ద బిగినింగ్' (Baahubali The Beginning) రిలీజైనప్పుడు పలువురు సినీజనం పెదవి విరిచారు. కానీ, ప్రేక్షకులు మాత్రం రాజమౌళి (Rajamouli) చేసిన మ్యాజిక్ కు బ్రహ్మరథం పట్టారు. పదేళ్ళ క్రితం టోటల్ రన్ లో 650 కోట్ల రూపాయలు పోగేసి టాప్ గ్రాసర్ గా నిలచింది 'బాహుబలి- ద బిగినింగ్'. ఈ సినిమా వచ్చిన రెండేళ్ళకు 2017 ఏప్రిల్ 28న 'బాహుబలి - ద కంక్లూజన్' (Baahubali The Conclusion) వెలుగు చూసింది. ఈ సినిమా వెయ్యి కోట్లు పోగేసిన తొలి భారతీయ చిత్రంగా చరిత్రలో నిలచిపోయింది. ఇలా రెండు భాగాలతోనూ 'బాహుబలి' ఎంతగానో జనాన్ని మురిపించింది. ఈ రెండు చిత్రాలను ఒకటిగా మలచి ఈ యేడాది అక్టోబర్ లో విడుదల చేసేందుకు సన్నాహాలు సాగుతున్నట్లు తెలుస్తోంది.
రెండు భాగాలకూ నేషనల్ అవార్డ్స్...
జానపద చిత్రాలకు కాలం చెల్లిందని అందరూ భావిస్తున్న సమయంలో 'బాహుబలి' సిరీస్ ఉత్సాహం నింపింది. ఈ సిరీస్ తో ప్రభాస్ ఏకంగా ఇంటర్నేషనల్ స్టార్ గా నిలిచారు. అంతేకాదు రీజనల్ మూవీస్ కు కూడా అంతర్జాతీయ గుర్తింపును తీసుకు వచ్చింది 'బాహుబలి' సిరీస్. ఈ విషయంలో రాజమౌళి మాకు ఆదర్శం అంటూ మణిరత్నం వంటి మేకర్స్ కూడా చెప్పడం మరచిపోలేని అంశం. ఇక అప్పటి దాకా తెలుగు సినిమాకు జాతీయ స్థాయిలో ఉత్తమ చిత్రం అవార్డు దక్కలేదు. ఆ ఘనతను సంపాదించి పెట్టిన తొలి సినిమాగా 'బాహుబలి- ద బిగినింగ్' నిలచింది. ఇక రెండో భాగం 'బాహుబలి - ద కంక్లూజన్' కూడా హోల్ సమ్ ఎంటర్ టైనర్ గా నేషనల్ అవార్డు సంపాదించింది. ఇలా సిరీస్ లోని రెండు సినిమాలు నేషనల్ అవార్డును అందుకోవడం అరుదైన అంశంగా నిలచింది.
ప్రేక్షకులను అలరించిన సీక్వెల్స్ ను ఒకటిగా చేసి రిలీజ్ చేయడమన్నది ఈ మధ్య కాలంలో జరగలేదనే చెప్పాలి. ఒకప్పుడు 'గాడ్ ఫాదర్' మూడు భాగాలను ఒకటి చేయాలని తలపోశారు కానీ, ఆ చిత్ర అభిమానులు నిరసన తెలపడంతో ఫ్రాన్సిస్ ఫోర్డ్ కొప్పోలా ఆ ప్రయత్నం మానుకున్నారు. అంతకు ముందు 1915లో రూపొందిన 'ద బర్త్ ఆఫ్ ఏ నేషన్'కు సీక్వెల్ గా 1916లో 'ద ఫాల్ ఆఫ్ ఏ నేషన్' అనే మూవీ తెరకెక్కింది. అసలు ఓ సినిమాకు సీక్వెల్ అన్న కాన్సెప్ట్ కు శ్రీకారం చుట్టిన సినిమానే 'ద ఫాల్ ఆఫ్ ఏ నేషన్'. ఈ రెండూ సైలెంట్ మూవీస్ కావడం విశేషం. ఈ రెండు సినిమాలను కలిపి ఒకటిగా చేసి తరువాతి రోజుల్లో ప్రదర్శించారు.. ఆ పై నిడివి ఎక్కువగా ఉన్న చిత్రాలను రెండు, మూడు భాగాల్లో ప్రదర్శించినవీ ఉన్నాయి. అయితే మళ్ళీ ఇన్నాళ్ళకు రెండు భాగాలను కలిపి ఒకే చిత్రంగా మలచడం అన్నది 'బాహుబలి' సిరీస్ తోనే మొదలు కాబోతూ ఉండడం విశేషం! ప్రస్తుతం రాజమౌళి మహేశ్ సినిమాతో బిజీగా ఉన్నప్పటికీ తన వీలును బట్టి రెగ్యులర్ సినిమా లెవల్లో 'బాహుబలి' రెండు భాగాలను కలిపి ఓ సినిమాగా భారీ ప్రచారంతో రిలీజ్ చేయటానికి నిర్మాతలు రెడీ అవుతున్నారు. రెండు భాగాలతోనూ విశేషంగా అలరించిన 'బాహుబలి' కథ, ఒకే చిత్రంగా ఎలా రక్తి కట్టిస్తుందో చూడాలి.
Also Read: Guru Dutt: గురుదత్ శతజయంతి
Also Read: Badass: బ్యాడాస్ టైటిల్ పై త్రివిక్రమ్ అభిమానులు ఆవేదన