Guru Dutt: గురుదత్ శతజయంతి
ABN , Publish Date - Jul 09 , 2025 | 04:25 PM
భారతీయ సినిమాను దశదిశలా వెలిగేలా చేసిన అరుదైన దర్శకుల్లో గురుదత్ స్థానం ప్రత్యేకమైనది. నేడు గురుదత్ శతజయంతి. ఈ సందర్భంగా గురుదత్ శైలిని మననం చేసుకుందాం.
గురుదత్ (Gurudutt) ను ఓ మధురస్వప్నంగా భావించే సినిమా ఫ్యాన్స్ ఉన్నారు. ఆయన సినిమాలే మధుర స్వప్నాలు అనే వారూ లేకపోలేదు.. కాలం కంటే ముందుగా పరుగుతీశారు గురుదత్ అంటారు. కేవలం 39 సంవత్సరాలు జీవించిన గురుదత్ తన కెరీర్ లో 8 చిత్రాలకు దర్శకత్వం వహించారు. 14 సినిమాలలో నటించారు. కొన్ని చిత్రాలకు నటదర్శకునిగానూ సాగారు. దేవానంద్ ను స్టార్ గా నిలపడంలో గురుదత్ దర్శకత్వ ప్రతిభ కూడా దాగుందని పలువురు అభిమానులు అంటారు. ఉత్తరాదిన విజయం సాధించిన దక్షిణాది దర్శకునిగా గురుదత్ అరుదైన ఘనత సాధించారు. ఆయన సమీప బంధువు ప్రఖ్యాత దర్శకుడు శ్యామ్ బెనెగల్ (Shyam Benegal). గురుదత్ తెరకెక్కించిన చిత్రాలలో అద్భుతమైన కెమెరా పనితనం ఉండేది. అందుకు తెలుగువారైన సినిమాటోగ్రాఫర్ వీకే మూర్తి ప్రతిభ కూడా కారణమని చెప్పొచ్చు. గురుదత్ పేరు తలచుకోగానే ఆ నాటి అభిమానులకు చప్పున గుర్తుకు వచ్చే సినిమాలు "ప్యాసా (Pyasa), కాగజ్ కే ఫూల్ (Kaagaz ke phool)" అనే చెప్పాలి.
గురుదత్ స్వాప్నికుడు - ఆయన మనోఫలకంపై నాట్యం చేసిన ఎన్నో కలలు వెండితెరపై కళకళలాడుతూ జనాన్ని ఆకట్టుకున్నాయి. 1925 జూలై 9న బెంగళూరులో జన్మించిన గురుదత్ అసలు పేరు వసంత్ కుమార్ శివశంకర్ పడుకోణె. దత్ బాల్యం కలకత్తాలో సాగింది.ప్రఖ్యాత నృత్యకళాకారుడు ఉదయ్ శంకర్ స్కూల్ లో డాన్స్ నేర్చుకున్న గురుదత్ ముంబై చేరి సినిమాల్లో నటించాలని ఆశించారు. 'లఖ్రానీ' అనే సినిమాలో తొలిసారి గురుదత్ తెరపై కనిపించారు. తరువాత అసిస్టెంట్ డైరెక్టర్ గా, డాన్స్ కొరియోగ్రాఫర్ గానూ సాగారు. దేవానంద్ హీరోగా నటించిన 'బాజీ' చిత్రంతో గురుదత్ దర్శకుడయ్యారు. 'బాజీ' ఘనవిజయం సాధించింది. 'ఫిలిమ్ నాయిర్' మూవీగా 'బాజీ' జేజేలు అందుకుంది. తరువాత గురుదత్ మరి వెనుతిరిగి చూసుకోలేదు. మన దేశంలో తొలి సినిమా స్కోప్ మూవీగా గురుదత్ 'కాగజ్ కే ఫూల్' తెరకెక్కింది. ఈ తరం వారినీ ఆకట్టుకొనే ఈ చిత్రం అప్పట్లో ఘోరపరాజయం పాలయింది. అయితే గురుదత్ అందించిన క్లాసిక్స్ లో ఒకటిగా 'కాగజ్ కే ఫూల్' నిలచింది. ఇందులోని కథాంశం లాగానే గురుదత్ జీవితం కూడా సాగిందని పరిశీలకులు భావిస్తారు.
దేవానంద్ హీరోగా గురుదత్ నిర్మించిన 'సి.ఐ.డి' సినిమాతోనే తెలుగునాట వెలిగిన వహిదా రెహమాన్ హిందీ చిత్రసీమకు పరిచయం అయ్యారు. గురుదత్ గాయని గీతా రాయ్ ని ప్రేమించి పెళ్ళాడారు. గీతాదత్ అనేక చిత్రాల్లో తన గానమాధుర్యంతో అలరించారు. అయితే తనకు హిట్ పెయిర్ గా మారిన వహిదా రెహమాన్ తో గురుదత్ సన్నిహితంగా ఉండడంతో వారి కాపురం కూలింది. గురుదత్ ఆరోగ్యం గురించి పట్టించుకోకపోవడంతో 39 ఏళ్ళకే కన్నుమూశారు. తరువాత ఆయన భార్య గీతాదత్ కూడా తాగుడుకు బానిసై మరణించారు. గురుదత్ ముగ్గురు పిల్లలు వారి బంధువుల నీడన పెరిగారు. గురుదత్ ను ఎంతగానో అభిమానించేవారికి ఆయన జీవితాన్ని తలచుకుంటే ఈ నాటికీ ఆవేదన కలుగుతుంది. ఏది ఏమైనా భారతీయ చిత్రసీమలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించారాయన. గురుదత్ శతజయంతిన అభిమానులు ఆయన చిత్రాల్లోని పాటలను మననం చేసుకుంటూ నివాళులు అర్పించారు.
Also Read: Badass: బ్యాడాస్ టైటిల్ పై త్రివిక్రమ్ అభిమానులు ఆవేదన
Also Read: Brahmanda Movie: ప్రివ్యూ చూస్తూ దర్శకుడు రాంబాబు కన్నుమూత